సత్తెనపల్లి టీడీపీలో గ్రూపుల గోల మొదలైంది. నియోజకవర్గ నాయకులు మూడు గ్రూపులుగా విడిపోయారు.
సాక్షి, గుంటూరు: సత్తెనపల్లి టీడీపీలో గ్రూపుల గోల మొదలైంది. నియోజకవర్గ నాయకులు మూడు గ్రూపులుగా విడిపోయారు. రానున్న ఎన్నికల్లో సత్తెనపల్లి టీడీపీ టికెట్‌ను స్థానికులకే ఇవ్వాలంటూ నియోజకవర్గానికి చెందిన కీలక నాయకులు గురువారం హైదరాబాద్ వెళ్లి చంద్ర బాబునాయుడును కలవడం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ పార్టీకి సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జిగా నిమ్మకాయల రాజనారాయణ కొనసాగుతున్నారు.
2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాజనారాయణ కాంగ్రెస్ అభ్యర్థి యర్రం వెంకటేశ్వరరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తరువాత పార్టీ అధిష్టానం రాజనారాయణను నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాలను ఆయనే నిర్వహిస్తున్నారు. అయితే ఈ నెల ఒకటో తేదీ నుంచి సత్తెనపల్లి టీడీపీ రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు ప్రవేశించారు.
2004 ఎన్నికల్లో సత్తెనపల్లి టికెట్ దక్కలేదన్న కారణంతో పార్టీకి దూరమైన ఆయన కొన్నాళ్ల నుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈసారి టికెట్ తనకేనంటూ వైవీ ఆంజనేయులుతనకు అనుకూలమైన మండల, గ్రామస్థాయి నాయకుల్ని సమీకరించుకుంటున్నారు. అడపాదడపా ఏదో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ రూ. లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. గతంలో వైవీతో సత్సంబంధాలు వున్న నాయకులు ఒక్కొక్కరూ తనను వీడి వైవీ వెంట నడవడం రాజనారాయణకు ఇబ్బందికరంగా మారింది.
పార్టీలో క్రమశిక్షణ లోపిస్తుందనీ, గ్రూపులు మొదలైతే ఎన్నికల్లో పార్టీ గెలవడం కష్టమనే విషయాన్ని రాజ నారాయణ జిల్లా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ వైవీని నిలువరించే ప్రయత్నాలేవీ జిల్లా నేతలు చేయకపోవడం రాజనారాయణకు తలనొప్పిగా మారింది.
మరోసారి తెరపై స్థానిక నినాదం: ఇదిలా ఉండగా పార్టీలోని కొందరు నాయకులు తాజాగా స్థానిక నినాదాన్ని లేవనెత్తారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి విధిగా నియోజకవర్గానికి చెందినవారై ఉండాలనీ, అలాంటి వారికే టికెట్ కేటాయించాలన్న డిమాండ్‌ను తెరమీదకు తెచ్చారు. నిమ్మకాయల రాజనారాయణ, వైవీ ఆంజనేయులు ఇద్దరూ స్థానికేతరులన్న విషయాన్ని పార్టీ అధినాయకుని ముందుంచి స్థానిక ప్రాధాన్యతను బలంగా వినిపించాలని నిర్ణయించుకున్నారు.
ఈ నేపథ్యంలోనే తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మన్నెం నాగమల్లేశ్వరరావు, పార్టీ అధికార ప్రతినిధి ముప్పాళ్ల మండలం మాజీ ఎంపీపీ గోగినేని కోటేశ్వరరావు, సత్తెనపల్లి మండల కమిటీ మాజీ అధ్యక్షుడుఆళ్ల సాంబయ్య, నకరికల్లు మాజీఎంపీపీ నాగోతు శౌరయ్య, టీడీపీ జిల్లా కార్యదర్శి భీమినేని వందనాదేవిలు గు రువారం హైదరాబాద్ వెళ్లి పార్టీ అధినేత చంద్రబాబునాయుడును కలిశారు.
సామాజికవర్గం ఏదైనా, ఎవరికిచ్చినా తాము అభ్య ంతరంచెప్పబోమనీ,అయితే స్థానికులకు మాత్రమే టికెట్ ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబును కోరారు. స్థానికేతరుల వల్ల నియోజకవర్గం అభివృద్ధి ఆశించిన మేర జరగడం లేద నిబాబుకు వివరించినట్లు తెలిసింది. ఎవరికి వారు టికెట్టు తమదంటే తమదేనంటూ కార్యకర్తలను వెంటేసుకుని తిరగడం,హడావుడి చేయడం పార్టీకి శ్రేయస్కరం కాదన్న విషయాన్ని అధినేత ముందు ంచినట్లు సమాచారం. నేతల అభ్యర్థన విన్న చంద్రబాబు వారం రోజుల్లో పార్టీ అధిష్టానం సమస్యను పరిష్కరిస్తుందని సమాధానం చెప్పి పంపినట్లు తెలిసింది.