కేసులు పెట్టింది టీడీపీ వాళ్లే | TDP leaders are strategical propaganda on YSRCP | Sakshi
Sakshi News home page

కేసులు పెట్టింది టీడీపీ వాళ్లే

Published Wed, Sep 18 2019 3:27 AM | Last Updated on Wed, Sep 18 2019 4:32 AM

TDP leaders are strategical propaganda on YSRCP - Sakshi

నారా లోకేశ్‌తో కోడెల శివరాంపై ఫిర్యాదు చేసిన టీడీపీ నేత వడ్లమూడి శివరామయ్య (ఫైల్‌)

సాక్షి, గుంటూరు: కోడెలను ప్రభుత్వం వేధించిందని, వైఎస్సార్‌సీపీ నాయకులు కేసులు పెట్టించారని టీడీపీ నేతలు వ్యూహాత్మకంగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో సత్తెనపల్లి, నరసరావు పేట నియోజకవర్గాల్లో కోడెల కుమారుడు శివరామకృష్ణ, కుమార్తె పూనాటి విజయలక్ష్మి అనేక అక్రమాలకు పాల్పడ్డారు. కే–ట్యాక్స్, ఉద్యోగాలిప్పిస్తామని, ల్యాండ్‌ కన్వర్షన్‌ల పేరుతో అమాయకులను నమ్మించి, బెదిరించి డబ్బులు వసూలు చేశారని చాలా మంది టీడీపీ నేతలు, ఆ పార్టీ సానుభూతిపరులు,  ప్రైవేట్‌ వ్యక్తులు ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారాక ఫిర్యాదు చేశారు. కోడెల తన కుమారుడి షోరూమ్‌లో నిబంధనలకు విరుద్ధంగా అసెంబ్లీ ఫర్నిచర్‌ను ఉంచారని అధికారులు గుర్తించాకే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ వాస్తవాలను టీడీపీ పెద్దలు విస్మరించి ఇష్టానుసారం మాట్లాడుతుండటం శవ రాజకీయమేనని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. కోడెల మరణించాక రాద్ధాంతం చేస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ ముఖ్య నాయకులు.. కోడెల, కోడెల కుమారుడు, కుమార్తెలపై వరుస కేసులు నమోదవుతున్నన్ని రోజులు పెదవి కూడా విప్పలేదు. వాటిపై స్పందిస్తే ఎక్కడ పార్టీ పరువు, ప్రతిష్టలు దెబ్బతింటాయోనని  భయపడ్డారు. అసెంబ్లీ ఫర్నిచర్‌ వ్యవహారం బయటపడినప్పుడు ఆ పార్టీ నేత వర్ల రామయ్య స్పందిస్తూ కోడెల పార్టీ పరువును బజారుకీడ్చాడని వ్యాఖ్యానించారు. కోడెల తప్పు చేస్తే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సైతం అప్పట్లో ప్రకటించారు. అలాంటి వ్యక్తులు ఇప్పుడు.. రూ.2 లక్షల ఫర్నిచర్‌ తీసుకెళ్తే తప్పా అని రాద్దాంతం చేస్తుండటం చూసి ప్రజలు ముక్కున వేలు వేసుకుంటున్నారు.

కోడెలపై రెండు కేసులే..
కోడెలపై 19 కేసులు పెట్టారని, ఆయన్ను వేధింపులకు గురిచేశారని టీడీపీ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారు. వాస్తవానికి కోడెలపై నమోదైంది రెండు కేసులు మాత్రమే. మిగిలిన కేసులన్నీ కోడెల కుమార్తె, కుమారుడిపై నమోదయ్యాయి. వీరు కె–ట్యాక్స్‌ పేరుతో సొంత పార్టీ నాయకులను సైతం దోచుకున్నారు. వారి ఆస్తులను ఆక్రమించారు. సత్తెనపల్లి మండలం వెన్నాదేవి సమీపంలోని వివాదాస్పదంగా ఉన్న 17 ఎకరాల భూమిని కాజేశారు. ఈ క్రమంలో ఎంతో కాలం నుంచి ఆ భూమిని సాగు చేసుకుంటున్న టీడీపీ నాయకుడు గొడుగుల సుబ్బారావుతో పాటు మరికొందరి వద్ద నుంచి ఆ భూమిని బలవంతంగా లాక్కున్నారు. పొలంలో గొడుగుల సుబ్బారావు ఏర్పాటు చేసుకున్న గృహం, కోళ్ల ఫారాలను అర్ధరాత్రి ఖాళీ చేయాలంటూ కోడెల తనకు చెందిన గుండాల ద్వారా అప్పట్లో బెదిరించాడు. అప్పట్లో కోడెల స్పీకర్‌ హోదాలో ఉండటంతో ఆయన చేస్తున్న దుశ్చర్యకు కొందరు పోలీసులు అధికారులు అండగా నిలిచారు.

ఆ భూమిని కోడెల వ్యక్తిగత అంగరక్షకుడు ప్రతాప్‌కు చెందిన శశి ఇన్‌ఫ్రా పేరుతో రిజిస్ట్రేషన్‌ చేశారు. గొడుగుల టీడీపీ నాయకుడే. కోడెల 2014 సత్తెనపల్లి నియోజకవర్గానికి వలస వచ్చినప్పుడు సుబ్బారావు ఇంటిని సందర్శించారు. అప్పుడు సుబ్బారావు టీడీపీ తీర్థం తీసుకోవడంతో పాటు, రూ.లక్ష పార్టీ ఫండ్‌ కూడా ఇచ్చాడు. ఆ విషయాన్ని మరచి, పార్టీ నాయకుడనే సానుభూతి కూడా లేకుండా కోడెల, కోడెల కుమారుడు.. సుబ్బారావు స్థలాన్ని ఆక్రమించారు. ఈ ఘటనపై సుబ్బారావు తల్లి గొడుగుల శ్రీరావమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే తరహాలో ఓ కాంట్రాక్టు వ్యవహారంలో తనతో కోడెల శివరామ్‌ రూ.5 లక్షలు తీసుకున్నాడని నరసరావుపేట నియోజకవర్గం రొంపిచర్ల మండలం వడ్లమూడివారిపాలెంకు చెందిన టీడీపీ నాయకుడు వడ్లమూడి శివరామయ్య చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇతను గతంలో టీడీపీలో పలు పార్టీ పదవుల్లో సైతం పని చేశాడు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్‌గా పని చేస్తున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement