ఓ శుభ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరిన ఆ కుటుంబం ఆనందం అంతలోనే ఆవిరైంది. అంతవరకూ సంతోషంగా ఉన్న వారిని చూసి విధికి కన్నుకుట్టింది. తల్లీకూతుళ్లను విగతజీవులుగా చేసి ఆ కుటుంబంలో విషాదం నింపింది. తన బిడ్డ పెద్దపెద్ద చదువులు చదవాలి, తనకు పేరు తీసుకురావాలన్న కోటి ఆశలతో కుమారుడిని హాస్టల్‌లో జాయిన్ చేయడానికి తీసుకువెళుతున్న ఓ వ్యక్తి ఆశలను అంతలోనే ఆ రాకాసి మలుపు చిదిమేసింది. కొమరాడలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల సమీపంలో ఉన్న మలుపు వద్ద ఆటోను లారీ ఢీకొనడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఆ ప్రాంతం బంధువుల, క్షతగాత్రుల రోదనలతో, పెడబొబ్బలతో దద్దరిల్లింది.
పార్వతీపురం/ కొమరాడ: కొమరాడ మండలంలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల సమీపంలోని మలుపు వద్ద బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కూనేరు నుంచి పార్వతీపురం వైపు వస్తున్న ఆటోను... పార్వతీపురం నుంచి రాయగడ వైపు వెళ్తున్న లారీ ఢీ కొంది. ఈ సంఘటనలో ఆటో నుజ్జు నుజ్జు కాగా, అందులో ప్రయాణిస్తున్న 14 మందిలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఆరుగురిని విశాఖపట్నం తరలించారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. దీనికి సంబంధించి స్థానికులు, క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులు అందించిన వివరాలిలా ఉన్నాయి...
కొమరాడ మండలంలోని గుమడ గ్రామానికి చెందిన డ్రైవర్ బాసంగి శ్రావణ్ తన ఆటోలో టికెట్లు ఎక్కించుకొని కూనేరు నుంచి పార్వతీపురం వైపు ప్రయాణమయ్యాడు. పార్వతీపురంలో జరుగుతున్న ఓ ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు ఒడిశా రాష్ట్రం కెరడ గ్రామానికి చెందిన గెంబలి నారాయణమూర్తి కుటుంబానికి చెందిన తల్లి గెంబలి కళావతి (60), చెల్లెళ్లు గెంబలి శ్రీదేవి(25), షర్మిల, వారణాశి జానకి, బావ కృష్ణ, తమ్ముడు దినేష్‌లు వీరితో పాటు తన కొడుకును హాస్టల్ లో దించేసి, ఇంటికి తిరుగు ప్రయాణంలో భాగంగా జియ్యమ్మవలస మండలం పిప్పలభద్ర గ్రామానికి చెందిన కొప్పర రామన్నదొర కూనేరులో ఆటో ఎక్కారు. తన కొడుకు కార్తీక్‌ను కొమరాడలోని హాస్టల్‌లో జాయిన్ చేసేందుకు బయలుదేరిన ఉలిపిరి గ్రామానికి చెందిన ఉర్లక నాగేశ్(36), కుమారునితో పాటు కూనేరు రామభద్రపురంలో ఆటో ఎక్కాడు.
తన ఇద్దరు కొడుకుల్లో పెద్దకొడుకు గొడబ జగదీష్‌ను పార్వతీపురంలో డిగ్రీ కళాశాలలో జాయిన్ చేద్దామని, అలాగే చిన్న కొడుకు దుర్గను హాస్టల్‌లో జాయిన్ చేద్దామని బయలుదేరిన లాభేసుకు చెందిన గొడబ లక్ష్మి కుమారులిద్దరితో వీరభద్రరాజపురం జంక్షన్‌లో ఆటో ఎక్కింది. దేవుకోన గ్రామానికి చెందిన కొండబోయిన శివాజీ పార్వతీపురం పనిమీద వెళ్తూ దేవుకోన జంక్షన్‌లో ఆటో ఎక్కారు. ఇలా మొత్తం 13 మంది ఆటోలో ప్రయాణిస్తుండగా సరిగ్గా కొమరాడ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల సమీపంలోని యూ టర్న్ మలపు వద్దకు వచ్చే సరికి ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఇక్కడ ఎదురెదురుగా ప్రయాణిస్తున్న వాహనాలు దగ్గరకు వచ్చే వరకూ కనిపించవు. ఈ దుర్ఘటనలో ఆటో నుజ్జు నుజ్జుయింది.
అక్కడికక్కడే ఒకరి మృతి...
సంఘటన జరిగిన స్థలంలోనే కెరడ గ్రామానికి చెందిన గెంబలి శ్రీదేవి(25) అక్కడకక్కడే మృతి చెందగా, 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన జరిగిన వెంటనే స్థానికులు క్షతగాత్రులను 108 వాహనాలలో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వెంటనే ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ జి.నాగభూషణరావుతోపాటు వైద్యాధికారులు శేషగిరి, వెంకటరావు, వాసుదేవరావు, రవి కుమార్, ప్రదీప్ కుమార్, రామచంద్రరావు తదితరులు తమ సిబ్బందితో కలిసి క్షతగాత్రులకు సేవలందించారు.
పార్వతీపురం ఏఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, సీఐ వి.చంద్రశేఖర్, పార్వతీపురం, కొమరాడ ఎస్సైలు వి.అశోక్ కుమార్, బి.సురేంద్రనాయుడు, సతీష్ కుమార్ తదితరులు తమ సిబ్బందితో పాటు సంఘటన స్థలం, ఏరియా ఆస్పత్రికి చేరుకొని పరీస్థితిని సమీక్షించి, క్షతగాత్రులకు సేవలందించారు.
వైద్య సేవలు పొందుతూ ఒకరు...విశాఖ తరలిస్తుండగా మరొకరు మృతి...
సంఘటన స్థలంలో గెంబలి శ్రీదేవి(25) అక్కడకక్కడే మృతి చెందగా, ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీదేవి తల్లి గెంబలి కళావతి(60)మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన ఆరుగురిని విశాఖ తరలిస్తుండగా మార్గమధ్యంలో ఉలిపిరికి చెందిన ఉర్లక నాగేశ్ (36) మృతి చెందాడు. విశాఖ తరలించిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.
పగబట్టిన విధి
కెరడకు చెందిన గెంబలి కుటుంబంపై విధి పగబట్టింది. ఆ కుటుంబానికి చెందిన ఆరుగురు ఆటో ఎక్కగా, అందులో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో షర్మిల అనే బాలిక ఎటువంటి గాయాలు త గలలేదు. సంఘటన స్థలంలో క్షతగాత్రులు, మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
మృత్యు మలుపు
Published Thu, Jun 18 2015 12:43 AM | Last Updated on Tue, Aug 28 2018 7:14 PM
Advertisement
Advertisement