ఒక మహిళ... మూడు హత్యలు
ఇద్దరు స్నేహితులు, తల్లీ, కుమారుడు, మరో యువకుడు ఒకరి తరువాత ఒకరు మృత్యువాత పడ్డారు. వీరిలో ముగ్గురు హత్యకు గురికాగా, ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. వీరి మరణాల వెనుక మిస్టరీని ఛేదించడంలో పోలీసులు విఫలమయ్యారు. ఒక మహిళ... మూడు హత్యల కథ ఏమిటనేది మిస్టరీగానే ఉంది. విజయవాడలో మొదలైన ఈ హత్యల పరంపర కన్యాకుమారిలో ఆమె ఆత్మహత్యతో ముగిసింది.
సాక్షి ప్రతినిధి, విజయవాడ : విజయవాడకు చెందిన ఉమ్మడి శ్రీనివాసయాదవ్(45), కళ్యాణి (36) పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. శ్రీనివాస యాదవ్ టీడీపీ అర్బన్‌శాఖలో ముఖ్య కార్యకర్త. ఈయన స్నేహితుడు పడాల కనకారావు (కన్నా) (42) ఆ పార్టీ అర్బన్ కార్యదర్శి. ఆరునెలల క్రితం శ్రీనివాసయాదవ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతడిది సహజ మరణమని పోలీసులు, అనారోగ్యంతో చనిపోయాడని అందరూ భావించారు. తన కుమారుడిది సహజ మరణం కాదని అతడి తల్లి వాదన. అతడి మరణం తరువాత పడాల కన్నా కళ్యాణి వద్దకు వచ్చిపోయేవాడు. ఈ క్రమంలో గత నెల 25వ తేదీ తెల్లవారుజామున కళ్యాణి ఉంటున్న వీధి చివరలో రోడ్డుపై కన్నా చనిపోయి ఉండడం తెలిసిందే.
దీంతో కళ్యాణిపై ఆమె బంధువులు, కన్నా బంధువులకు అనుమానాలు పెరిగాయి. విషప్రయోగం వల్ల మృతి చెందినట్లు పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది. ఈ కేసులో కళ్యాణిని అనుమానితురాలిగా భావించిన పోలీసులు ముందుగా ఇంటివద్ద, తరువాత స్టేషన్‌కు పిలిపించి విచారించారు. ఇదే సమయంలో తన కుమారుడు బయట ఉన్నాడని, వాడిని తీసుకొస్తానని చెప్పి స్టేషన్ నుంచి వెళ్లిన కళ్యాణి తిరిగి రాలేదు. పోలీసులు ఇంటికి వెళితే అక్కడ కూడా లేదు. ఇంటికి రాలేదని బంధువులు చెప్పారు. దీనిపై బంధువులు ఆరా తీసి అనిల్ అనే వ్యక్తితో కలిసి పరారైనట్లు తెలుసుకున్నారు. తరువాత పోలీసులు ఈ కేసును పట్టించుకోలేదు.
కళ్యాణి తన కుమారుడు ఉజ్వల కృష్ణ, ప్రియుడు అనిల్‌తో కలిసి ఈ నెల 4న తమిళనాడులోని నాగర్‌కోయిల్‌లో ఒక హోటల్‌లో దిగారు. ఈ విషయం ఎవరికీ తెలియదు. విజయవాడకు చెందిన చిన్ని అనిల్ (30) (శ్రీనివాస్‌యాదవ్‌కు పిన్ని కొడుకు)తో పరిచయం పెంచుకొని అతనితో కలిసి పరారైనట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది. అనిల్ అప్పుడప్పుడూ కళ్యాణి ఇంటికి వచ్చిపోతూ వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు కన్నా సన్నిహితుల అనుమానం. ఈ నేపథ్యంలోనే కన్నాను కూడా మట్టుపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆమె అనిల్‌ను తీసుకొని పరారైనట్లు సమాచారం.
కళ్యాణి మూడేళ్లుగా భర్త శ్రీనివాస్‌యాదవ్‌తో నిత్యం తగాదా పడేదని బంధువులు చెబుతున్నారు. ఆస్తిని దక్కించుకునేందుకు శ్రీనివాస్‌ను హత్యచేసి ఉంటుందని, కన్నా మరణానంతరం ఆయన బంధువులు, స్నేహితులు, టీడీపీలోని శ్రీనివాస్‌యాదవ్ సన్నిహితులు అనుమానించారు. అటు భర్త, ఆయన స్నేహితుడు హత్యలకు గురికావడాన్ని బంధువులు గుర్తించడంతో తమకు ముప్పు తప్పదని భావించిన అనిల్.. నాగర్‌కోయిల్ నుంచి బంధువులు, కుటుంబ సభ్యులకు సూసైడ్ నోట్ రాసి పంపించాడు. అందులో ఏమున్నదనేది బంధువులు కానీ, పోలీసులు కాని చెప్పడం లేదు. గత ఆదివారం హోటల్ రూములో అనిల్‌తో కలిసి కళ్యాణి తన కుమారుడిని గొంతునులిమి హత్య చేసింది. ఆ తరువాత విషం తీసుకొని ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు.
అనిల్‌కు ఏడాది క్రితం వివాహమైంది. తన భర్త చావుకు కళ్యాణి కారణమని ఆయన భార్య చిన్ని సుభాషిణి ఆరోపిస్తోంది. కళ్యాణి ఎవరితోనైనా ఇట్టే పరిచయం పెంచుకుని, వాడుకుని వదిలేసే మనస్తత్వం గలదని స్థానికులు చెబుతున్నారు. అందులో భాగంగానే ఈ హత్యలకు తెరతీసిందనేది స్థానికుల వాదన. కళ్యాణి మనస్థత్వం స్థిరంగా లేకపోవడంతో ఆమె భర్త, అతని స్నేహితుడు, కుమారుడు ఉజ్వలకృష్ణ (8)హత్యకు గురయ్యారు. తదనంతరం ప్రియునితో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది.
నిజం నిగ్గు తేల్చాలి : ఆదిలక్ష్మి
నా భర్త కనకారావు మృతి వెనుక కచ్చితంగా కుట్ర జరిగింది. గతంలో ఉమ్మడి శ్రీనివాస్ యాదవ్, కనకారావు మృతికి కళ్యాణి కారణ ం. అందుకే ఆమె అకస్మాత్తుగా, అనుమానాస్పదంగా మృ తి చెందింది. కొడుకుని కూడా హత్య చేసింది. దీని వెనుక ఎదో బలమైన కార ణం ఉంది. ఆమె బతికి ఉంటే మరిన్ని వాస్తవాలు బయట పడేవి. ఆమె మృతి వెనుక కూడా పెద్దల హస్తం ఉండవచ్చు.