శుభకార్యానికి వచ్చి పరలోకాలకు.. | Three people died in river | Sakshi
Sakshi News home page

శుభకార్యానికి వచ్చి పరలోకాలకు..

Published Mon, May 26 2014 2:11 AM | Last Updated on Sat, Sep 2 2017 7:50 AM

Three people died in river

సోమశిల, న్యూస్‌లైన్: బంధువుల ఇంట జరిగిన శుభకార్యానికి విచ్చేసి అందరితో సంతోషంగా గడిపారు ఆ దంపతులు. ఎటూ ఊరికి వచ్చాం కదా..అని సోమశిల జలాశయం వద్ద సరదాగా గడుపుదామని భావించారు. కొందరు బంధువులు కూడా వస్తామని ముందుకు రావడంతో 10 మంది బృందంగా సోమశిల జలాశయం వద్దకు వెళ్లారు. ఆనందంగా నీటిలో కేరింతలు కొడుతుండగా దంపతులైన శ్రీనివాసులు(30), నాగరత్నమ్మ(28)తో పాటు వారి మేనకోడలు స్వాతి(13)ని మృత్యువు కబళించింది. సోమశిల జలాశయం వద్ద ఆదివారం జరిగిన ఈ సంఘటన ఇటు సోమశిలతో పాటు అటు ఉప్పలపాడులో విషాదం నింపింది. బెంగళూరులోని శేషాద్రిపురంలో ఉండే కలువాయి శ్రీనివాసులు, నాగరత్నమ్మ బంధువుల పెళ్లికి హాజరయ్యేందుకు అనంతసాగరం మండలంలోని ఉప్పలపాడుకు వచ్చారు. మూడు రోజుల క్రితం జరిగిన వివాహ వేడుకలో బంధువులందరితో కలిసి సరదాగా గడిపారు.
 
 గ్రామానికి వచ్చినప్పుడల్లా సోమశిల జలాశయం వద్దకు విహారయాత్రకు వెళ్లే అలవాటు వీరికి ఉంది. అందులో భాగంగా ఉప్పలపాడులోని బంధువులు 10 మందితో కలిసి సోమశిల జలాయశం వద్దకు వెళ్లారు. వీరికి మేనకోడలైన స్వాతి(చెరుకూరు యానాదయ్య, అచ్చమ్మ కుమార్తె) కూడా జలాశయంలోని మునిగేందుకు వెళ్లింది. అందరూ కలిసి జలాశయం కింది భాగంగా పెన్నానదిలో కేరింతలు కొట్టసాగారు. ఇంతలో నాగరత్నమ్మ దిగిన చోట పాచి ఎక్కువగా ఉండడంతో ఆమె లోతులోకి జారిపోయింది.
 
 గమనించిన వెంకటేశ్వర్లు కాపాడే ప్రయత్నంలో తానూ మునిగిపోయాడు. వీరిద్దరిని రక్షించాలనే ప్రయత్నంలో స్వాతి తన చేతిని అందిచ్చింది. ఈ ప్రయత్నంలో ముగ్గురూ నీటిలో మునిగిపోయారు. గమనించిన బంధువులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక మామిడిచెట్ల సెంటర్‌లో ఉండే జాలర్లు నీటిలో దిగి మృతదేహాలను వెలికితీశారు. సంఘటన స్థలాన్ని ఆత్మకూరు సీఐ అల్తాఫ్‌హుస్సేన్, అనంతసాగరం ఎస్సై పుల్లారావు పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
 అనాథైన చిన్నారి
 శ్రీనివాసులు, నాగరత్నమ్మ నీటిలో మునిగి చనిపోవడంతో వీరి కుమారుడు నానేష్(5) అనాథగా మారాడు. తల్లిదండ్రులిద్దరూ నీళ్లలో మునిగిపోవడం చూసిన నానేష్ ‘మా అమ్మా..నాన్న నీళ్లలో మునుగుతూ పోయారు’ అని చెప్పడం అందరినీ కంటతడి పెట్టించింది.
 
 ఉప్పలపాడులో విషాదం
 గ్రామానికి చెందిన మంగళ రవికుమార్ వివాహం మూడు రోజుల క్రితం జరిగింది. ఈ వేడుకకు హాజరయ్యేందుకు వచ్చిన భార్యాభర్తలతో పాటు వారి మేనకోడలైన గ్రామానికి చెందిన చిన్నారి మృతిచెందడంతో ఉప్పలపాడులో విషాదఛాయలు అలుముకున్నాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement