ముగ్గురిని బలిగొన్న టిప్పర్
పెదతాడేపల్లి (తాడేపల్లిగూడెం రూరల్) : టిప్పర్ ఢీకొనడంతో మోటార్‌సైకిల్‌పై వెళుతున్న ముగ్గురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. పెదతాడేపల్లి గ్రామానికి చెందిన గెడ్డం వెంకటేశ్వరరావు అనే యాకోబు (18) అక్క విజయ నిశ్చితార్థం గురువారం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం పెదతాడేపల్లి శివారులోని పోశమ్మపురం వద్ద ఉన్న పెట్రోల్ బంక్‌లో ఆయిల్ కొట్టించుకునేందుకు యాకోబు మోటార్‌సైకిల్‌పై వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తుండగా, అదే సెంటర్‌లో నెల్లూరు జిల్లాకు చెందిన సర్కస్ చేస్తూ భవాని కల్లి (15), భవాని ఏసు (17) తమను పెదతాడేపల్లిలో దింపాలని కోరారు. దీంతో వీరిని మోటార్ సైకిల్‌పై ఎక్కించుకుని వస్తుండగా భారతీయ విద్యాభవన్స్ సమీపంలోకి వచ్చేసరికి టిప్పర్ లారీ ఢీకొట్టింది. దీంతో యాకోబు, భవాని కల్లి అక్కడికక్కడే మృతి చెందారు. ఏసుకు తీవ్రగాయాలు కావడంతో అతనిని 108 వాహనంలో తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించగా, అక్కడి నుంచి ఏలూరు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందింది.
సొమ్మసిల్లిన అక్క
ముగ్గురు కుమార్తెల తరువాత పుట్టిన యాకోబు అందరితో చనువుగా ఉండేవాడు. అక్కలంటే అతనికి వల్లమాలిన ప్రేమ. యాకోబు తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో తల్లి ఎస్తేరు సంరక్షణలో వీరు పెరిగారు. ఇద్దరు అక్కలకు గతంలో పెళ్లి జరగ్గా, చిన్న అక్కకు గురువారమే ఇంటి వద్ద నిశ్చితార్థం సందర్భంగా కుటుంబం అంతా ఆనందంగా ఉన్న సమయంలో యాకోబు మృతి వార్త వారిని కలచివేసింది. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. తమ్ముడు ఎక్కడుకు వెళ్లావురా అంటూ అక్కలు కన్నీటిపర్యంతమయ్యారు. యాకోబు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పొట్టకూటి కోసం వచ్చి..
నెల్లూరు జిల్లా నుంచి పొట్టకూటికోసం సర్కస్ ఫీట్లు చేసే సంచారజీవుల బతుకులు రోడ్డుప్రమాదంలో తెల్లారిపోయాయి. గుప్పెడు అన్నం కోసం జిల్లాలు దాటి వచ్చిన వీరిని తీరని ఆవేదనను మిగిల్చింది. పెదతాడేపల్లి శివారులో పదిరోజులుగా టెంట్లు వేసుకుని చుట్టుపక్కల గ్రామాల్లో సర్కస్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో ప్రదర్శనల ద్వారా పొట్టనింపుకుంటున్న వారిలో ఏసు, కల్లి ఉన్నారు. వీరు ఉంగుటూరు మండలంలోని పలుగ్రామాల్లో సర్కస్ చేసేందుకు వెళ్లారు. సాయంత్రం తిరిగి వచ్చేందుకు వాహనాలు లేకపోవడంతో అదే సమయంలో మోటారు సైకిల్‌తో ఒంటరిగా వెళుతున్న యాకోబు వీరికి తారసపడ్డాడు. లిఫ్ట్ అడిగితే కాదనలేకపోయాడు. ప్రమాదంలో వీరిద్దరూ దూరం కావడంతో సంచారజీవులు గుండెలవిసేలా రోదించారు. రూరల్ ఎస్సై కఠారి రామారావు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.