ఊరుకాని ఊరిలో..
విజయనగరం క్రైం: రాష్ట్రం కాని రాష్ట్రం. ఎక్కడి నుంచో వస్తున్న వారు తమకు తెలియని ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. విజయనగరం పట్టణంలో గురువారం వేకువ జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇతర రాష్ట్రాలకు చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను ట్రాఫిక్ సీఐ ఎ.రవికుమార్ ఇలా తెలియజేశారు. కేరళ రాష్ట్రానికి చెందిన ఎం.పి.మోనికుట్టు (58) విన్ ఇండియా మిషనరీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈనెల 9న ఒడిశాలోని కొరాపుట్ జిల్లా జైపూర్‌లో మిషనరీ ప్రచార కార్యక్రమం కోసం వచ్చా రు. ఆ కార్యక్రమం పూర్తి చేసుకున్న ఆయన హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది.
అదే సమయంలో జైపూర్‌కు చెందిన శుభంనాయక్ (19), పద్మనాభ నాయక్ (31), డ్రైవర్ నాదీరావ్ కౌంట్ మౌర్య బుధవారం రాత్రి 11 గంటలకు బొలెరో వాహనంలో విశాఖపట్నం వెళ్లేందుకు బయలు దేరారు. ఎం.పి.మోనికుట్టు కూడా విశాఖ పట్నం రైల్వే స్టేషన్‌కు వెళ్లేందుకు వారితో పాటు బొలెరో వాహనంలో ప్రయాణం చేస్తున్నారు. విజయనగరంలోని ఆర్టీఏ కార్యాలయం మలుపు వద్దకు వచ్చేసరికి విజయనగరం వైపు నుంచి వస్తున్న ఆయిల్ ట్యాంకర్, బొలెరో ఎదు రెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో శుభం నాయక్ (19), పద్మనాభనాయక్ (31) సంఘటన స్ధలంలో మృతి చెందగా, ఎం.పి.మోనికుట్టు, (58) బొలెరో డ్రైవర్ నాదీరావ్ కౌంట్ మౌర్యకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు 108, పట్టణ అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ ఎం.పి.మోనికుట్టు మృతి చెందారు. నాదీరావ్ కౌంట్ మౌర్య పరిస్థితి విషమంగా ఉండడంతో అతనిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. శుభంనాయక్, పద్మనాభనాయక్ దగ్గర బంధువులు. విషయం తెలుసుకున్న ట్రాఫి క్ సీఐ ఎ.రవికుమార్, ఎస్సై ఎస్.అమ్మినాయుడు, స్వామినాయుడు, ఏఎస్సై ఎం.రాజు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న వాహనాలను పొక్లెయినర్‌తో పక్కకు నెట్టించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చేశారు. మృతదేహాలను జిల్లా కేంద్రాస్పత్రికి పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. ట్రాఫిక్ సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేరళ వాసి అయిన ఎం.పి.మోనికుట్టు కుటుంబ సభ్యులు రావడానికి రెండు రోజులు పడుతుందని, మృతదేహాన్ని జిల్లా కేంద్రాస్పత్రి పోస్టుమార్టం గదిలో ఉంచామని సీఐ తెలిపారు.
అరగంట నరకయాతన..
లారీ, బొలెరో ఢీకొన్న ప్రమాదంలో బొలెరోలో ప్రయాణిస్తున్న శుభం నాయక్ అరగంటపాటు నరక యాతన అనుభవించాడు. డైవరు పక్క సీట్లో కూర్చు న్న శుభం నాయక్ వాహనం ముదు భాగం అంతా నుజ్జునుజ్జవడంతో సీటుకు మధ్యలో ఇరుక్కుపోయా డు. కాపాడండి.. కాపాడండి.. అని కేకలు వేస్తూ..దాహం..దాహం వేస్తోంది మంచినీళ్లు కావాలని మొరపెట్టుకున్నాడు. శుభం నాయక్‌ను రక్షించేందుకు ట్రాఫిక్ సిబ్బంది అరగంటపాటు పడిన శ్రమ ఫలించలేదు. చివరకు వాహనంలోనే ప్రాణం విడిచిపెట్టాడు. నిన్ననే కొన్నారు..శుభం నాయక్ తండ్రి సుభాష్ చంద్రనాయక్ బొలెరో వాహనాన్ని బుధవారమే కొన్నారు. ఇంకా కొత్త టీ.ఆర్.నంబర్‌తోనే బొలెరో వాహనం ఉంది.