చిత్తూరు జిల్లాలో మరోసారి ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. భాకరాపేట పులిబోను గుట్ట అటవీ ప్రాంతంలో భారీగా తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లు ఉన్నారన్న సమాచారాన్ని పోలీసు బుధవారం అందుకున్నారు. దాంతో పోలీసులు హుటాహుటిన భాకరాపేట పులిబోను గుట్ట చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఆ విషయాన్ని స్మగ్లర్లు పసిగట్టి పోలీసులపై రాళ్లు, కత్తులతో దాడికి తెగబడ్డారు. దాంతో పోలీసులు వెంటనే అప్రమత్తమైయ్యారు.
స్మగ్లర్లపై పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఆ ఘటనలో ముగ్గురు స్మగ్లర్లు మరణించారు. ఇటీవల చిత్తూరు జిల్లాలో అటవీశాఖ అధికారులపై తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లు దాడి చేసి చంపారు. ఈ నేపథ్యంలో ఎర్రచందనం స్మగ్లర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తున్న సంగతి తెలిసిందే.