
గన్నవరం: లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రెండో విడత ‘‘వందే భారత్ మిషన్’’లో భాగంగా ఈ నెల 20 నుండి 27 వరకు మూడు ప్రత్యేక విమానాలు గన్నవరం ఎయిర్‌పోర్టుకు రానున్నాయి. ఎయిరిండి యాకు చెందిన తొలి విమానం (ఏఐ 1913) సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఉన్న కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ నెల 20న బయల్దేరి రాత్రి 10.15 గంటలకు ఇక్కడికి చేరుకుంటుంది. ఇదే విమానం (ఏఐ 1914) అర్ధరాత్రి 12 గంటలకు ఇక్కడి నుండి హైదరాబాద్ వెళ్తుంది.
ఈ నెల 23న ఎయిరిండియాకు చెందిన మరో విమానం (ఏఐ 1920) సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఉన్న కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరి రాత్రి 10.15 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటుంది. అదే విమానం రాత్రి 11 గంటలకు ఇక్కడి నుంచి హైదరాబాద్ బయల్దేరుతుంది. వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రవాసాంధ్రులను తీసుకుని న్యూఢిల్లీ నుంచి ఎయిరిండియా విమానం (ఏఐ 1200) ఈ నెల 27న ఉదయం 11.30 గంటలకు గన్నవరం చేరుకుంటుందని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం ఎయిర్‌పోర్టులోని అంతర్జాతీయ టెర్మినల్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ప్రయాణికులు ఇక్కడికి చేరుకోగానే వైద్య పరీక్షలు, థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులు ద్వారా ప్రయాణికుల ఎంపిక మేరకు ప్రభుత్వ, పెయిడ్ క్వారంటైన్ సెంటర్లకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment