తిరుపతిలో మంగళవారం భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమైనాయి.
తిరుపతి : తిరుపతిలో మంగళవారం భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమైనాయి. స్థానిక నిమ్మకాయల వీధిలోని మూడంతస్తుల భవనం ఒకటి కుప్పకూలింది. అయితే అప్పటికే అప్రమత్తమైన ఆ భవనంలోని వారంతా బయటకు రావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. భవనం కుప్పకూలిన ఘటనపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని... సహాయక చర్యలు చేపట్టారు.
భవనం కింద భాగంలో మొబైల్ షాపు ఉండగా, పై అంతస్తులో రెండు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. కూలడానికి ముందే భవనం గోడలు నెరలు ఇస్తుండడంతో అందులోని వారు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. దీంతో వారికి ప్రాణాపాయం తప్పింది. భవనం కుప్పకూలడంతో సుమారు రూ. 10 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించిందని ఉన్నతాధికారులు తెలిపారు.