ఆద్యంతం కుట్ర
రగులుతున్న రాజధాని
‘దురాక్రమణ’పై వాస్తవాల వెల్లడితో నివ్వెరపోతున్న జనం
{పభుత్వ పెద్దల అవినీతిపై విచారణ చేపట్టాలని డిమాండ్
రాజధాని రగులుతోంది...ప్రభుత్వ పెద్దల భూ దురాక్రమణపై ‘సాక్షి’ దినపత్రికలో మూడు రోజుల నుంచి వరుసగా వస్తున్న కథనాలు కలకలం రేపుతున్నాయి. అమాయక రైతుల భూములను కారుచౌకగా కొట్టేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి బినామీల బాగోతం బట్టబయలు కావడంతో జిల్లా ప్రజానీకం నివ్వెరపోతోంది...ప్రభుత్వ పెద్దలపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తోంది. ముఖ్యమంత్రి, ఆయన తనయుడు, మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు ఆద్యంతం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ భూములు లాక్కొన్నారనే విషయం తేటతెల్లమవుతోందని అంటున్నారు.
మంగళగిరి: ‘ రాజధాని దురాక్రమణ’పై టీడీపీ పెద్దలంతా కుట్రపూరితంగానే వ్యవహరించారని జిల్లా ప్రజానీకం దుయ్యబడుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన తనయుడు, మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు ఏ తప్పూ చేయకుంటే విచారణకు ఆదేశించి ప్రభుత్వం తన నిజాయతీ నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తోంది. రాజధానికి సమీకరించిన భూములలో రైతుల వద్ద పది శాతం భూములు లేవని, అధికార పార్టీ నేతలు, రియల్ వ్యాపారులు చేతిలోనే అధికశాతం భూములుండగా మిగిలినవి సైతం చోటా నేతలు, వ్యాపారుల చేతిలోకి మారాయని అంటున్నారు. రాజధానిలో రైతులు లేకుండా చేయాలనే ముఖ్యమంత్రి కోరిక నెరవేరినట్లేనని అధికార పార్టీ నేతలే చెబుతున్నారు. భూములను కొనడంలో ప్రభుత్వ పెద్దలు విజయం సాధించారని, ఇక మాస్టర్ ప్లాన్‌లో రోడ్ల విస్తరణను వ్యతిరేకిస్తున్న ఆయా గ్రామాలను సైతం ఖాళీ చేయించగలిగితే తాము అనుకున్న విధంగా విదేశీ సంస్థలకు భూములను అప్పగించవచ్చని ప్రణాళిక సిద్ధం చేశారని అధికారులు చెబుతున్నారు.
పక్కా పథకం ప్రకారం...
పక్కా పథకం ప్రకారమే భూములు రైతుల నుంచి తీసుకునేలా ప్రభుత్వం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి బినామీలకు సహకరించిందనే విషయం తేటతెల్లమైంది. రాజధాని చుట్టపక్కల లింగమనేని సంస్థ విదేశీ సంస్థలతో కలిసి రియల్ వ్యాపారం చేసేందుకు అనుగుణంగా ఆ సంస్థ భూములను ఎక్కడా రాజధాని భూ సమీకరణలోకి రాకుండా రాజధాని ప్రకటన వచ్చే ము ందే ప్రభుత్వ పెద్దలు కుట్ర పన్నారని ఆరోపిస్తున్నారు. లింగమనేని సంస్థ ముఖ్యమంత్రికి అతిథి గృహం బహూకరించిన కారణంగానే రాజధానిలో ఇంత పెద్ద ఎ త్తున ఆ సంస్థకు లబ్ధి చేకూరేలా రాజధాని ప్రణాళిక సిద్ధం చేశారని ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు.
లింగమనేనికి మినహాయింపు ఎలా..?
నాగార్జున యూనివర్సిటీ ఎదుట నిర్మించిన అపార్ట్‌మెంట్లు, విల్లాస్‌లు ప్రభుత్వానికి అద్దెలకిచ్చి భారీగా లబ్ధిపొందిన లింగమనేనికి నిడమర్రు గ్రామం వరకు ఆనుకుని ఉన్న భూములను సమీకరణలో ఏ విధంగా మినహాయించారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.కేవలం లింగమనేని భూములనే ఎందుకు విడిచిపెట్టారనే విషయంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. విజయవాడ, గుంటూరు నగరాల్లోనే అపార్ట్‌మెంట్లు అద్దెలు చదరపు అడుగుకు నెలకు రూ.15కు మించకపోగా లింగమనేని సంస్థ నిర్మించిన భవనాలకు మాత్రం ప్రభుత్వం రూ.35 నుంచి 40 చెల్లించే విధంగా ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధమవ్వడం ఆశ్చర్యానికి గురిజేస్తోంది. లింగమనేని సంస్థలో ప్రభుత్వ పెద్దలకు వాటాలుండటంతో పాటు ముఖ్యమంత్రికి అతిథి గృహాన్ని ఉచితంగా ఇచ్చిన కారణంగానే లబ్ధిచేకూర్చారని అంటున్నారు.