సాక్షి, కర్నూలు : కర్నూలు శివారు ప్రాంతాల్లో దొంగలు రెచ్చిపోతున్నారు. పోలీసుల నిఘా లేకపోవడంతో పేట్రేగిపోతున్నారు. ముసుగులు ధరించి.. వాహనాలపై వెళుతున్న వారిని అడ్డగించి బలవంతంగా సొమ్ము లాక్కుంటున్నారు. అడ్డుచెబితే రాడ్లతో దాడి చేస్తున్నారు. ఇటువంటి ఘటనే ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో కర్నూలు తాలూకా పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కర్నూలు శివారులోని దిన్నెదేవరపాడు గ్రామానికి చెందిన మహేశ్వరరెడ్డి కుమార్తె సావిత్రి హైదరబాద్ నుంచి కర్నూలు బస్టాండ్‌కు చేరుకుంది. అక్కడ నుంచి ద్విచక్రవాహనంపై తండ్రి, కుమార్తె దిన్నెదేవరపాడుకు బయలు దేరారు.
సరిగ్గా దిన్నెదేవరపాడు సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ముసుగులు ధరించిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్రవాహనంలో వెంబడించారు. వాహనాన్ని అడ్డుకుని సావిత్రి మెడలోని చైన్‌ను బలవంతంగా లాక్కున్నారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన మహేశ్వర రెడ్డిపై రాడ్లతో దాడి చేశారు. తీవ్ర గాయాలైన అతని వద్ద ఉన్న పర్సును లాక్కొని అక్కడ నుంచి పరారయ్యారు. బాధితులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకొని కర్నూలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కర్నూలు శివారు ప్రాంతాల్లో సరైన నిఘా లేకపోవడం వల్లే ఇటువంటి సంఘటనలు పునరావృతమవుతున్నయన్న విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment