- వేలాది ఎకరాలు కోనుగోలు చేసిన నేతలు
- నూజివీడు కోసం ఒక వర్గం.. మంగళగిరి కోసం మరో వర్గం పట్టు
- అందుకే విజయవాడ పరిసరాలని చంద్రబాబు ప్రకటన
- పార్టీలో జోరుగా ప్రచారం
సాక్షి, విజయవాడ : నగర పరిసర ప్రాంతాల్లో రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై తెలుగుదేశం పార్టీలో అంతర్యుద్ధం జరుగుతోంది. పార్టీలో సీనియర్ నేతల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం వల్లే ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని ఎక్కడనే అంశాన్ని గురువారం అసెంబ్లీలో స్పష్టంగా ప్రకటించకుండా నగర పరిసర ప్రాంతాలంటూ వెల్లడించారని పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. భవిష్యత్తులో నాయకుల్ని సమన్వయపరచి ఆ తరువాత కొత్త రాజధానికి శ్రీకారం చుడతారని పార్టీ నేతలు చెబుతున్నారు.
రాజధాని భూములపై ‘దేశం’ నేతల కన్ను
కొత్త రాజధాని విజయవాడ-మంగళగిరి మధ్యని, విజయవాడ-ఏలూరు మధ్యని, అమరావతి సమీపంలో, నూజీవీడు పరిసర ప్రాంతాల్లో అని టీడీపీ నేతలు పెద్దఎత్తున ప్రచారం చేశారు. దీనికి తగ్గట్లుగానే వారు విజయవాడ పరిసర ప్రాంతాల్లో వందలాది ఎకరాలకు టోకెన్ అడ్వాన్సులు ఇచ్చారు. అలాగే.. కొన్నిచోట్ల బినామీల పేరున భూములకు అడ్వాన్సులు ఇచ్చి అగ్రిమెంట్లు కూడా చేయించారు. కంచికచర్ల, చందర్లపాడు మండలాలు పరిసర ప్రాంతాల్లో ఎంపీ సుజనా చౌదరి, జిల్లా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులు వేలాది ఎకరాల భూమికి అడ్వాన్స్‌లు ఇచ్చినట్లు తెలిసింది.
కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య రాజధాని వస్తే అటు గుంటురు జిల్లాలోని అమరావతి నుంచి ఇటు కృష్ణాజిల్లా చెవిటికల్లు వరకు వంతెన నిర్మించి అక్కడే అవుటర్ రింగ్ రోడ్డు వేయిస్తే తమ భూములకు డిమాండ్ పెరుగుతుందని ఈ నేతలు భావిస్తున్నారు. చందర్లపాడు మండలంలో కొన్ని పరిశ్రమలకు అనుమతులు కోసం సుజనా చౌదరి ఇటీవల కేంద్రానికి లేఖలు రాసినట్లు తెలిసింది.
ఎంపీలు సీఎం రమేష్, కేశినేని శ్రీనివాస్(నాని), డెప్యూటీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిలు నూజివీడు పరిసర ప్రాంతాల్లో వందల ఎకరాల కొనుగోలుకు బినామీల ద్వారా అగ్రిమెంట్లు చేయించుకుంటున్నట్లు అర్బన్ టీడీపీలో చెబుతున్నారు. ఇక్కడే పోలసానిపాలెం వద్ద ఎంపీ మురళీమోహన్ కూడా బినామీ పేర్లతో 110 ఎకరాలు కొనుగోలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగా ఇటీవల చంద్రబాబు తనయుడు లోకేష్ కూడా ఈ ప్రాంతంలో వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవం పేరుతో పర్యటించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అడవి నెక్కలం, నూజీవీడు, గన్నవరం ప్రాంతాల్లో కొంతమంది రైతుల్ని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అనుచరులమంటూ బెదిరించినట్లు ఇటీవల ఆరోపణలొచ్చాయి. అలాగే, విజయవాడ-గుంటూరు జిల్లాల మధ్య మంత్రి పత్తిపాటి పుల్లారావు, మరికొందరు నేతలు దృష్టిసారించినట్లు తెలిసింది. నగరంలోనూ, పరిసర ప్రాంతంలోనూ కొత్తగా ఎన్నికైన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఈ కొనుగోళ్లు అమ్మకాలు వ్యవహారాన్ని గోప్యంగా నడుపుతున్నట్లు సమాచారం.
తమ పేర్లు బయటకు పొక్కకుండా ఏజెంట్లు, రియల్టర్లు ద్వారా రైతులకు అడ్వాన్సులు ఇప్పిస్తున్నారు. భవిష్యత్తులో తాము అనుకున్నట్లు రాజధాని వస్తే ముందుగా నిర్ణయించిన రేటుకు భూమి కొనుగోలు చేసేట్లు లేకపోతే తమ పరపతి ఉపయోగించి సొమ్ము వెనక్కు తీసుకోవాలని ఈ నేతలు నిర్ణయించుకున్నారు.
చంద్రబాబుపై ఒత్తిడి.....
తాము భూములు కొనుగోలు చేసిన ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని చంద్రబాబుపై టీడీపీ నేతలు వత్తిడి తెస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో కోట్లు కుమ్మరించి పార్టీని గెలిపించామని, ఇప్పుడు రాజధాని తమకు అనుకూలంగా ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. పార్టీలో అన్ని వర్గాలను సంతృప్తిపరిచే విధంగా మూడు నగరాలను, అవకాశాలను బట్టి రాజధాని ఏర్పాటుచేసుకోవచ్చంటూ చంద్రబాబు ప్రకటించారని టీడీపీలో చర్చించుకుంటున్నారు.