ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టనున్న ఆమరణ నిరాహార దీక్ష మరికొద్ది సేపట్లో చంచల్గూడ జైల్లో ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో జైలు వద్ద పోలీసులు ఆదివారం చంచల్గూడ జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక బలగాలను మోహరించారు. ఉన్నతస్థాయి అధికారులు జైలులో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై చేస్తే ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలి, అలా కుదరకుంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరు నగరంలో సమరభేరీ దీక్షను చేపట్టారు.
ఆరోగ్య పరిస్థితల దృష్ట్యా దీక్ష విరమించాలని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వైఎస్ విజయమ్మకు సూచించారు. అందుకు ఆమె ఒప్పుకో లేదు. దాంతో శుక్రవారం ఆర్థరాత్రి వైఎస్ విజయమ్మ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆమె ఆరోగ్యంపై ఆందోళన చెందిన ఆమె కుమారుడు వైఎస్ జగన్ చంచల్గూడ జైలు అధికారులు కల్పించిన ఫోన్ సహాయంతో నేరుగా వైఎస్ విజయమ్మతో మాట్లాడారు. అనారోగ్యం దృష్ట్యా దీక్ష విరమించాలని తన తల్లిని జగన్ కోరారు. ఆదివారం నుంచి తాను చంచల్గూడ జైల్లో ఆమరణ నిరాహారదీక్ష చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు వైఎస్ విజయమ్మకు జగన్ తెలిపారు. దాంతో వైఎస్ విజయమ్మ దీక్ష విరమించిన సంగతి తెలిసిందే.