- లక్షన్నర మంది భక్తుల రాక ..
- ఏకాదశి దర్శనం కోసం పాట్లు
- ధర్నాలతో హోరెత్తించిన భక్తులు.. నిరసనలతో
- ధర్మకర్తల మండలి, అధికారులపై తిట్ల దండకం
సాక్షి, తిరుమల: అనుకున్నదే అయ్యింది. చరిత్ర పునరావృత్తం అయింది. నాలుగైదేళ్లుగా వైకుంఠ దర్శనం కోసం వచ్చే సామాన్య భక్తులకు నరకం కనిపించటం సర్వసాధారణమైపోయింది. అన్నీ తెలిసిన టీటీడీ ధర్మకర్తల మండలి, అధికారులు మాత్రం వీఐపీ సేవలోనే తరలించారు. కాలినడక భక్తులు అష్టకష్టాలు పడ్డారు. అడుగడుగునా తిరుమలలో భక్తులు ఆందోళనలు, ధర్నాలతో తమ నిరసన వ్యక్తం చేశారు. ధర్మకర్తల మండలి, అధికారులపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి పార్థసారథి వాహనాన్ని అడ్డుకున్నారు. ఆయన సముదాయించినా భక్తులు శాంతించలేదు.
చలిగాలుల్లో భక్తుల పాట్లు
తిరుమలలో ధనుర్మాసంతో వల్ల చలి తీవ్రంగా పెరిగింది. దీనికి తోడు మంచు వర్షంలా కురవటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గదులు లభించని భక్తులు ఆరుబయట షెడ్లలోనే నిరీక్షించారు. మరికొందరు భక్తులు చెట్ల కింద, క్యూలైన్లలోని నిద్రించారు.
భక్తులకు లగేజీకష్టాలు
వైకుంఠ ఏకాదశి , ద్వాదశి దర్శనం కోసం నడకదారుల్లో రికార్డు స్థాయిలో 60 వేల మందికిపైగా భక్తులు వచ్చారు. వీరిలోని టీటీడీకి 40 వేల మందికే టికెట్లు ఇచ్చింది. ఇందులోభాగంగా అలిపిరి వద్ద డిపాజిట్ చేసిన లగేజీని తిరుమలకు తెచ్చేందుకు ఆలస్యమైంది. అలాగే, తిరుమలకు చేరిన లగేజీ కూడా త్వరగా అందజేయటంలో సిబ్బంది విఫలమయ్యారు. వీటితోపాటు కొందరు భక్తుల లగేజీ చేరకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దర్శన టికెట్టు ఇవ్వలేని టీటీడీ తాము తెచ్చిన లగేజీ కూడా అందజేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
టికెట్ల దందా..
రూ.10 వేలనుంచి రూ.20 వేలు పలికిన వీఐపీ పాసు ప్రముఖులకు కేటాయించి రూ.1000 వీఐపీ టికెట్టు నల్లబజారులో రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ధరతో చేతులు మారింది. ప్రముఖులతోపాటు ఇతర పేర్లు కూడా జతచేయటంతో టికెట్లు అందాయి. అలాగే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల అధికారులతో పేర్లతోపాటు కేటాయించిన టికెట్లలో కూడా ఇతర పేర్లు జత అయ్యాయి. అలాంటి టికెట్లను ముందుగానే కుదుర్చుకున్న ధరలతో విక్రయించారు. ఇందులో ఇద్దరు ముగ్గురు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు కూడా ఉన్నారు. వీరు తమ ఇష్టానుసారంగా టికెట్లను ఇతర వ్యక్తులకు కేటాయించినట్టు తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.
ఆశ పోయింది...
వైకుంఠ ఏకాదశికి శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుందామని నాయుడుపేట నుంచి వచ్చాను. ఇక్కడ క్యూలైన్ చూస్తుంటే ఏకాదశికి స్వామి దర్శనం దొరుకుతుందనే ఆశ పోయింది.
- సుబ్బారావు, నాయుడుపేట
క్యూలైన్‌లో ఊపిరి పీల్చుకోవటం కష్టమైంది...
అలిపిరి నుండి కాలినడకన తిరుమలకు వచ్చాము. గాలిగోపురం వద్దనున్న అధిక భక్తుల రద్దీలో కనీసం ఊపిరిపీల్చుకోవటం చాలా కష్టమైపోయింది. మా కుటుంబ సభ్యులందరూ కనిపించకుండా పోయారు.
- వరలక్ష్మి, నెల్లూరు
సిబ్బంది దురుసుగా వ్యవహరిస్తున్నారు...
క్యూలైన్‌లను అదుపుచేయలేకపోవటమే కాకుండా టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు. క్యూలైన్ వద్ద కనీసం తాగటానికి మంచి నీరు కూడా లభించ టంలేదు.
- మురళి, హైదరాబాద్
కనీస వసతులు లేవు...
సామాన్య భక్తులకు కనీసం వసతులను కూడా టీటీడీ ఏర్పాటు చేయడంలేదు. ఓ క్రమపద్ధతిలో క్యూలైన్‌ను క్రమబద్ధీకరించకుండా వదిలేసారు. అందువల్లనే భక్తుల మధ్య తోపులాట జరుగుతోంది.
- రాజ్యలక్ష్మి, చిత్తూరు