తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
తిరుమల: వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. సాయంత్రం 6 గంటల వరకు సర్వదర్శనం కోసం మొత్తం 31 కంపార్ట్‌మెంట్లు నిండి, వెలుపల కూడా క్యూ కట్టిన భక్తులకు 24 గంటల తర్వాత స్వామి దర్శనం లభించనుంది. కాలినడకన తిరుమల వచ్చిన యాత్రికులకు 8 గంటలు, రూ.300 టికెట్ల దర్శన భక్తులకు 5 గంటల తర్వాత దర్శనం లభించనుంది. గదులకు డిమాండ్ ఏర్పడింది. ఇదిలా ఉండగా, తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 18వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించనున్నారు. 19వ తేదీన ఉట్లోత్సవం నిర్వహించనునానరు. ఈ సందర్భంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.
లడ్డూ కవర్ల కొరత: తిరుమలలో లడ్డూ కవర్ల కొరత ఏర్పడింది భక్తులు లడ్డూలు తీసుకెళ్లేందుకు టీటీడీ బయోడీగ్రేడబుల్(పర్యావరణానికి ముప్పులేని) కవర్లను ఒక్కోటి రూ.2 చొప్పున విక్రయిస్తోంది. రోజులో సుమారు 30 వేల కవర్లను భక్తులకు విక్రయిస్తుంటారు. ఈ కవర్లను ఎప్పటికప్పుడు టీటీడీ మార్కెటింగ్ విభాగం సరఫరా చేస్తోంది. రెండు రోజుల ముందే కవర్ల స్టాక్ ఖాళీ అయినా సరఫరా చేయకపోవటంతో భక్తులు ఆదివారం ఇబ్బంది పడ్డారు. కవర్ల స్టాకు వచ్చేందుకు రెండు రోజులు పడుతుందని సిబ్బంది తెలిపారు.
చైన్ స్నాచింగ్: శ్రీవారి దర్శనం కోసం చెన్నైకి చెందిన షీబా వైకుంఠం-1 వద్దనున్న క్యూలో ఉండగా గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడలోని 24 గ్రాముల బంగారు గొలుసు లాక్కుని పరుగు తీశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చే శారు.
సంప్రదాయంగా మనగుడి కార్యక్రమం
రాష్ట్ర దేవాదాయ శాఖ సౌజన్యంతో టీటీడీ శ్రావణ పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన మనగుడి కార్యక్రమాన్ని తిరుపతి కోదండరామస్వామి ఆలయంలో ఆదివారం ఉదయం 8.30 గంటలకు టీటీడీ ఈవో ఎంజీ గోపాల్ ప్రారంభించారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని మొత్తం 52 వేల దేవాలయాల్లో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్ని ఆలయాల్లో ఆదివారం ఉదయం భగవన్నామ సంకీర్తనలతో మనగుడి కార్యక్రమాలు మొదలైనట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆయా ఆలయాల్లో స్థానిక సంప్రదాయాల ప్రకారం మూలవర్లకు అభిషేకం, అర్చన, సామూహిక పారాయణం, వస్త్రసమర్పణ ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించారు. తిరుమల నుంచి వచ్చిన అక్షితలు, కంకణాలు, పసుపు, కుంకుమలు, ప్రసాదాలను దేవతామూర్తుల ముందు ఉంచి కుంకుమార్చనలు, సౌభాగ్యవ్రతాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. రాష్ర్టవ్యాప్తంగా 3.66 కోట్ల కంకణాలను భక్తులకు పంపిణీ చేశామన్నారు. అనేక ప్రాంతాల్లో రథయాత్రలు, ఉత్సవ మూర్తుల ఊరేగింపులు వైభవంగా జరిగాయని టీటీడీ అధికారులు తెలిపారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 8542 ఆలయాల్లో మనగుడి ఉత్సవాలు జరిగాయి.