Swamis darshan
-
భక్తుల సమస్యలపై టీటీడీ రహస్య సర్వే
రిసెప్షన్, పారిశుద్ధ్యం, దర్శనం, ఆన్లైన్ సేవలపై తరచూ భక్తుల అభిప్రాయాల సేకరణ నివేదిక అందిన తర్వాత తక్షణమే పరిష్కారం దిశగా చర్యలు పరుగులు తీస్తున్న విభాగాధిపతులు.. మెరుగవుతున్న భక్తుల సౌకర్యాలు తిరుమల: దేవదేవుడు శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అదే స్థాయిలో సమస్యలు కూడా పెరుగుతున్నాయి. వీటి పరిష్కారం కోసం టీటీడీ రహస్య సర్వేల మార్గం ఎంచుకుని తక్షణమే పరిష్కారం చూపుతోంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు అన్ని చోట్లా సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. తిరుమల కొండకు రాకముందే భక్తులకు రూ.300 ఆన్లైన్ టికెట్ల బుకింగ్ లో, ఇంటర్నెట్లో ఆర్జిత సేవా టికెట్ల బుకింగ్‌లో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. తిరుమలకు చేరిన భక్తులకు బస, కల్యాణకట్ట, దర్శనం, లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదం, పారిశుద్ధ్య నిర్వహణ, ఇంజనీరింగ్ పనుల వంటి విషయాల్లో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. వీటిపై లేఖల రూపంలో, డయల్ యువర్ ఈవో కార్యక్రమం రూపంలో, కాల్‌సెంటర్లు, టోల్‌ఫ్రీ నంబర్‌కు భక్తులు ఫిర్యాదు చేస్తున్నారు. వాటిని రికార్డు చేసి టీటీడీ ఈవోకు చేరవేస్తున్నారు. రహస్య సర్వేలకు శ్రీకారం.. ప్రధానంగా రూ.300 టికెట్ల ఆన్లైన్ బుకింగ్, బస (రిసెప్షన్), కల్యాణకట్ట, దర్శనం, లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదం, పారిశుద్ధ్య నిర్వహణ, ఇంజనీరింగ్ పనులపై టీటీడీ రహస్య సర్వేకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆయా విభాగాల కింద అందే సౌకర్యాలపై ప్రశ్నావళి రూపొందించింది. వాటిని శ్రీవారి సేవకులకు అందజేసి ఎంపిక చేసిన ప్రాంతంలో రహస్య సర్వే చేయిస్తున్నారు. ప్రశ్నావళిలో విభాగాల వారీగా భక్తులు పొందే సంతృప్తి, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై అభిప్రాయం తీసుకుంటున్నారు. తక్షణమే స్పందిస్తున్న ఈవో సాంబశివరావు రహస్య సర్వేలో వెలుగుచూసిన సమస్యలను టీటీడీ పీఆర్వో విభాగ ం నివేదిక రూపంలో సిద్ధం చేస్తోంది. దాన్ని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావుకు అందజేసి వివరిస్తోంది. ఆ మేరకు ఈవో కూడా ఆయా విభాగాలకు తక్షణమే ఉత్తర్వులు ఇవ్వటంతో సమస్యలు కూడా పరిష్కారమవుతున్నాయి. విభాగాధిపతులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నారు. రూ.300 టికెట్లపై ఫొటో తొలగింపు సర్వేలో భాగమే కొంతకాలంగా సర్వే చేయిస్తున్నారు. రూ.300 టికెట్లు పొందే క్రమంలో ఫొటో అప్లోడ్ చేయటం సమస్యగా ఉందని అధిక సంఖ్యలో భక్తులు ఫిర్యాదు చేశా రు. దీంతో ఈ నెల ఒకటో తేదీ నుంచి రూ.300 టికెట్లపై ఫొటో తొలగించారు. ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ గుర్తింపు కార్డు నంబరు ఆధారంగానే టికెట్లు కేటాయిస్తున్నారు. ఇక గదులు పొందటం నుంచి ఖాళీ చేసే వరకు, దర్శనం, లడ్డూ ప్రసాదం, పారిశుద్ధ్య నిర్వహణ, కల్యాణకట్టల్లోనూ అనేక సమస్యలు పరిష్కారం కావడం ఇందులో భాగమే. -
నిర్లక్ష్యానికి క్యూ
తల్లీబిడ్డ మృతి ఘటనలో అడుగడుగునా అన్ని శాఖల వైఫల్యం దర్శన క్యూల ఏర్పాటులో సంబంధిత శాఖల నిర్లక్ష్యం.. సమన్వయ లోపం భద్రతా ప్రమాణాలు పాటించకుండా అతి విశ్వాసంతోనే క్యూల నిర్మాణం ఘటనకు బాధ్యత మీరంటే మీరేనంటూ ఒకరిపై ఒకరి ఫిర్యాదులు తిరుమల: తిరుమలలో స్వామి దర్శన క్యూలు మృత్యుమార్గాలుగా మారుతున్నాయి.. తిరుమలేశుని సన్నిధిలో అభంశుభం తెలియని తల్లీబిడ్డా ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. సోమవారం రాత్రి విద్యుదాఘాతం మిగిల్చిన ఈ విషాద ఘటన అందరినీ తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటనలో ‘తిలాపాపం.. తలా పిడికెడు’గా మారింది. టీటీడీ విద్యుత్, సివిల్, విజిలెన్స్ విభాగాల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. అడుగడుగునా ఆయా విభాగాల సమన్వయ లోపాలను తాజా ఘటన ఎత్తిచూపింది. భద్రతా ప్రమాణాల్లేని క్యూలు శ్రీవారి దర్శనం కోసం నిత్యం లక్ష మంది వచ్చే తిరుమల క్యూల నిర్మాణంలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించటం లేదు. భక్తుల రద్దీ, ఇతర సందర్భాల్లో అవసరాలకు తగ్గట్టుగా ఉన్నతాధికారులు‘తాన’ అంటే చాలు వారి మెప్పుకోసం కింది స్థాయి అధికారులు ‘తందానా’ అంటూ భజన చేస్తూ.. రాత్రిరాత్రే క్యూలను నిర్మించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. వాటి నిర్మాణంలో కనీస మార్గదర్శకాలు కూడా పాటించటం లేదు. క్యూల నిర్మాణంలో ప్రధాన పాత్రధారులైన సంబంధిత సివిల్, ఎలక్ట్రికల్, విజిలెన్స్ విభాగాలు ఏమాత్రం సమన్వయ సహకారంతో పనిచేయటం లేదు. ఎక్కడ బడితే అక్కడ తాత్కాలిక క్యూలను నిర్మించేందుకు అధికారులు మొగ్గుచూపుతున్నారు. ఏమీ జరగదులే! అన్న అతివిశ్వాసంతో క్యూలు నిర్మిస్తున్నారు. వాటిని నిర్మించాక చేతులు దులిపేసుకుంటున్నారు. నిర్వహణలో ఏమాత్రం జాగ్రత్తలు పాటించటం లేదు. చేతు లు కాలాక... ఆకులు పట్టుకున్న చందంగా ఏదైనా ఘటన జరిగిన తర్వాత మాత్రం హడావుడి చేస్తూ తర్వాత చేతులు దులుపుకుకోవడం ఇక్కడి విభాగాల అధికారుల అలవాటుగా మారింది. క్యూల నిర్మాణంలో లోపాలు.. ప్రస్తుతం సర్వదర్శన క్యూలు, కాలిబాట క్యూలు, రూ.300 టికెట్లు క్యూల నిర్మాణంలో అనేక లోపాలు కనిపిస్తున్నాయి. కూలేందుకు సిద్ధంగా రేకులు కనిపిస్తున్నాయి. కరెంట్‌పోల్ మధ్యలో ఉంచి క్యూ నిర్మించటం బహుశా తిరుమలలో మాత్రమే కనిపిస్తుందేమో!. కిలోమీటర్ల మేర ఇనుప కమ్మీలనే అనుసంధానం చేస్తూ క్యూలు నిర్మించారు. మధ్యలో ఎక్కడా కూడా ఖాళీ కనిపించదు. నిత్యం వేలాది మంది వేచి ఉండే ఇనుప కమ్మీల క్యూలలో ఎక్కడైనా కరెంట్ సరఫరా అయితే పరిస్థితి ఏమిటి? ఇలాంటి పరిస్థితుల నుంచి రక్షణ కోసం ఏర్పాటు చేసిన ట్రిప్పర్లు పనిచేయకపోతే ఎలాంటి పరిణామాలుంటాయి? అన్నవి ఊహకు అందవు. సివిల్, ఎలక్ట్రికల్ విభాగాల మధ్య సమన్వయ లోపం వల్లే ఇలాంటి పరిస్థితి ఉంది. పరస్పర ఫిర్యాదులు విద్యుదాఘాతంతో తల్లీబిడ్డ మృతిచెందిన ఘటనపై పరస్పర ఫిర్యాదులు చేసుకునేందుకు సివిల్, ఎలక్ట్రికల్, విజిలెన్స్ విభాగాలు పోటీ పడుతున్నాయి. క్యూ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, క్యూ నుంచి ఫుట్‌పాత్ వరకు సిమెంట్ ర్యాంపు లేకపోవటం, విద్యుత్ వైర్లు వెళ్లే ప్రాంతంలోనే భద్రతా పరంగా అత్యవసర ప్రవేశ ద్వారం నిర్మించటం, వాటిని తెరిచి ఉంచటం వల్లే ఇలాంటి ఘటన జరిగిందని సివిల్, విజిలెన్స్ విభాగాలపై ఎలక్ట్రికల్ విభాగం ఫిర్యాదు చేసింది. క్యూల వద్ద ఇష్టానుసారంగా విద్యుత్ వైర్లు వదిలేయటం, ఎర్త్‌తో పాటు ట్రిప్పర్లు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా పర్యవేక్షించకపోవడం, రెండు రోజులుగా వర్షం కురుస్తున్నా విద్యుత్ సరఫరాలో జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని ఎలక్ట్రికల్ విభాగంపై సివిల్, విజిలెన్స్ శాఖలు ఫిర్యాదు చేశాయి. ఇష్టానుసారంగా విద్యుత్ వైర్లు తిరుమలలో అనేక ప్రాంతాల్లోనూ విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఎక్కడబడితే అక్కడ విద్యుత్ వైర్లు వేలాడుతున్నాయి. నిత్యం వేలాది మంది భక్తులు సంచరించే ప్రాంతాల్లోనూ ఇలాంటి పరిస్థితి కనిపించింది. విద్యుత్ సరఫరా అయ్యే వైర్లు, జంక్షన్ బాక్సులు అడ్డదిడ్డంగా ఏర్పాటు చేశారు. తగిన జాగ్రత్తలు తీసుకోకుండానే ఏర్పాటు చేశారు. వర్షం వస్తే వైర్ల నుంచి సరఫరా అయ్యే విద్యుత్ వల్ల అనుకోని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. తాజాగా జరిగిన ఘటన నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులను చక్కదిద్దకపోతే భవిష్యత్‌లో మూల్యం చెల్లించక తప్పదు. -
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
తిరుమల: వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. సాయంత్రం 6 గంటల వరకు సర్వదర్శనం కోసం మొత్తం 31 కంపార్ట్మెంట్లు నిండి, వెలుపల కూడా క్యూ కట్టిన భక్తులకు 24 గంటల తర్వాత స్వామి దర్శనం లభించనుంది. కాలినడకన తిరుమల వచ్చిన యాత్రికులకు 8 గంటలు, రూ.300 టికెట్ల దర్శన భక్తులకు 5 గంటల తర్వాత దర్శనం లభించనుంది. గదులకు డిమాండ్ ఏర్పడింది. ఇదిలా ఉండగా, తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 18వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించనున్నారు. 19వ తేదీన ఉట్లోత్సవం నిర్వహించనునానరు. ఈ సందర్భంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. లడ్డూ కవర్ల కొరత: తిరుమలలో లడ్డూ కవర్ల కొరత ఏర్పడింది భక్తులు లడ్డూలు తీసుకెళ్లేందుకు టీటీడీ బయోడీగ్రేడబుల్(పర్యావరణానికి ముప్పులేని) కవర్లను ఒక్కోటి రూ.2 చొప్పున విక్రయిస్తోంది. రోజులో సుమారు 30 వేల కవర్లను భక్తులకు విక్రయిస్తుంటారు. ఈ కవర్లను ఎప్పటికప్పుడు టీటీడీ మార్కెటింగ్ విభాగం సరఫరా చేస్తోంది. రెండు రోజుల ముందే కవర్ల స్టాక్ ఖాళీ అయినా సరఫరా చేయకపోవటంతో భక్తులు ఆదివారం ఇబ్బంది పడ్డారు. కవర్ల స్టాకు వచ్చేందుకు రెండు రోజులు పడుతుందని సిబ్బంది తెలిపారు. చైన్ స్నాచింగ్: శ్రీవారి దర్శనం కోసం చెన్నైకి చెందిన షీబా వైకుంఠం-1 వద్దనున్న క్యూలో ఉండగా గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడలోని 24 గ్రాముల బంగారు గొలుసు లాక్కుని పరుగు తీశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చే శారు. సంప్రదాయంగా మనగుడి కార్యక్రమం రాష్ట్ర దేవాదాయ శాఖ సౌజన్యంతో టీటీడీ శ్రావణ పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన మనగుడి కార్యక్రమాన్ని తిరుపతి కోదండరామస్వామి ఆలయంలో ఆదివారం ఉదయం 8.30 గంటలకు టీటీడీ ఈవో ఎంజీ గోపాల్ ప్రారంభించారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని మొత్తం 52 వేల దేవాలయాల్లో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్ని ఆలయాల్లో ఆదివారం ఉదయం భగవన్నామ సంకీర్తనలతో మనగుడి కార్యక్రమాలు మొదలైనట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆయా ఆలయాల్లో స్థానిక సంప్రదాయాల ప్రకారం మూలవర్లకు అభిషేకం, అర్చన, సామూహిక పారాయణం, వస్త్రసమర్పణ ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించారు. తిరుమల నుంచి వచ్చిన అక్షితలు, కంకణాలు, పసుపు, కుంకుమలు, ప్రసాదాలను దేవతామూర్తుల ముందు ఉంచి కుంకుమార్చనలు, సౌభాగ్యవ్రతాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. రాష్ర్టవ్యాప్తంగా 3.66 కోట్ల కంకణాలను భక్తులకు పంపిణీ చేశామన్నారు. అనేక ప్రాంతాల్లో రథయాత్రలు, ఉత్సవ మూర్తుల ఊరేగింపులు వైభవంగా జరిగాయని టీటీడీ అధికారులు తెలిపారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 8542 ఆలయాల్లో మనగుడి ఉత్సవాలు జరిగాయి.