నిర్లక్ష్యానికి క్యూ
తల్లీబిడ్డ మృతి ఘటనలో అడుగడుగునా అన్ని శాఖల వైఫల్యం
దర్శన క్యూల ఏర్పాటులో సంబంధిత శాఖల నిర్లక్ష్యం.. సమన్వయ లోపం
భద్రతా ప్రమాణాలు పాటించకుండా అతి విశ్వాసంతోనే క్యూల నిర్మాణం
ఘటనకు బాధ్యత మీరంటే మీరేనంటూ ఒకరిపై ఒకరి ఫిర్యాదులు
తిరుమల: తిరుమలలో స్వామి దర్శన క్యూలు మృత్యుమార్గాలుగా మారుతున్నాయి.. తిరుమలేశుని సన్నిధిలో అభంశుభం తెలియని తల్లీబిడ్డా ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. సోమవారం రాత్రి విద్యుదాఘాతం మిగిల్చిన ఈ విషాద ఘటన అందరినీ తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటనలో ‘తిలాపాపం.. తలా పిడికెడు’గా మారింది. టీటీడీ విద్యుత్, సివిల్, విజిలెన్స్ విభాగాల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. అడుగడుగునా ఆయా విభాగాల సమన్వయ లోపాలను తాజా ఘటన ఎత్తిచూపింది.
భద్రతా ప్రమాణాల్లేని క్యూలు
శ్రీవారి దర్శనం కోసం నిత్యం లక్ష మంది వచ్చే తిరుమల క్యూల నిర్మాణంలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించటం లేదు. భక్తుల రద్దీ, ఇతర సందర్భాల్లో అవసరాలకు తగ్గట్టుగా ఉన్నతాధికారులు‘తాన’ అంటే చాలు వారి మెప్పుకోసం కింది స్థాయి అధికారులు ‘తందానా’ అంటూ భజన చేస్తూ.. రాత్రిరాత్రే క్యూలను నిర్మించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. వాటి నిర్మాణంలో కనీస మార్గదర్శకాలు కూడా పాటించటం లేదు. క్యూల నిర్మాణంలో ప్రధాన పాత్రధారులైన సంబంధిత సివిల్, ఎలక్ట్రికల్, విజిలెన్స్ విభాగాలు ఏమాత్రం సమన్వయ సహకారంతో పనిచేయటం లేదు. ఎక్కడ బడితే అక్కడ తాత్కాలిక క్యూలను నిర్మించేందుకు అధికారులు మొగ్గుచూపుతున్నారు. ఏమీ జరగదులే! అన్న అతివిశ్వాసంతో క్యూలు నిర్మిస్తున్నారు. వాటిని నిర్మించాక చేతులు దులిపేసుకుంటున్నారు. నిర్వహణలో ఏమాత్రం జాగ్రత్తలు పాటించటం లేదు. చేతు లు కాలాక... ఆకులు పట్టుకున్న చందంగా ఏదైనా ఘటన జరిగిన తర్వాత మాత్రం హడావుడి చేస్తూ తర్వాత చేతులు దులుపుకుకోవడం ఇక్కడి విభాగాల అధికారుల అలవాటుగా మారింది.
క్యూల నిర్మాణంలో లోపాలు..
ప్రస్తుతం సర్వదర్శన క్యూలు, కాలిబాట క్యూలు, రూ.300 టికెట్లు క్యూల నిర్మాణంలో అనేక లోపాలు కనిపిస్తున్నాయి. కూలేందుకు సిద్ధంగా రేకులు కనిపిస్తున్నాయి. కరెంట్‌పోల్ మధ్యలో ఉంచి క్యూ నిర్మించటం బహుశా తిరుమలలో మాత్రమే కనిపిస్తుందేమో!. కిలోమీటర్ల మేర ఇనుప కమ్మీలనే అనుసంధానం చేస్తూ క్యూలు నిర్మించారు. మధ్యలో ఎక్కడా కూడా ఖాళీ కనిపించదు. నిత్యం వేలాది మంది వేచి ఉండే ఇనుప కమ్మీల క్యూలలో ఎక్కడైనా కరెంట్ సరఫరా అయితే పరిస్థితి ఏమిటి? ఇలాంటి పరిస్థితుల నుంచి రక్షణ కోసం ఏర్పాటు చేసిన ట్రిప్పర్లు పనిచేయకపోతే ఎలాంటి పరిణామాలుంటాయి? అన్నవి ఊహకు అందవు. సివిల్, ఎలక్ట్రికల్ విభాగాల మధ్య సమన్వయ లోపం వల్లే ఇలాంటి పరిస్థితి ఉంది.
పరస్పర ఫిర్యాదులు
విద్యుదాఘాతంతో తల్లీబిడ్డ మృతిచెందిన ఘటనపై పరస్పర ఫిర్యాదులు చేసుకునేందుకు సివిల్, ఎలక్ట్రికల్, విజిలెన్స్ విభాగాలు పోటీ పడుతున్నాయి. క్యూ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, క్యూ నుంచి ఫుట్‌పాత్ వరకు సిమెంట్ ర్యాంపు లేకపోవటం, విద్యుత్ వైర్లు వెళ్లే ప్రాంతంలోనే భద్రతా పరంగా అత్యవసర ప్రవేశ ద్వారం నిర్మించటం, వాటిని తెరిచి ఉంచటం వల్లే ఇలాంటి ఘటన జరిగిందని సివిల్, విజిలెన్స్ విభాగాలపై ఎలక్ట్రికల్ విభాగం ఫిర్యాదు చేసింది. క్యూల వద్ద ఇష్టానుసారంగా విద్యుత్ వైర్లు వదిలేయటం, ఎర్త్‌తో పాటు ట్రిప్పర్లు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా పర్యవేక్షించకపోవడం, రెండు రోజులుగా వర్షం కురుస్తున్నా విద్యుత్ సరఫరాలో జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని ఎలక్ట్రికల్ విభాగంపై సివిల్, విజిలెన్స్ శాఖలు ఫిర్యాదు చేశాయి.
ఇష్టానుసారంగా విద్యుత్ వైర్లు
తిరుమలలో అనేక ప్రాంతాల్లోనూ విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఎక్కడబడితే అక్కడ విద్యుత్ వైర్లు వేలాడుతున్నాయి. నిత్యం వేలాది మంది భక్తులు సంచరించే ప్రాంతాల్లోనూ ఇలాంటి పరిస్థితి కనిపించింది. విద్యుత్ సరఫరా అయ్యే వైర్లు, జంక్షన్ బాక్సులు అడ్డదిడ్డంగా ఏర్పాటు చేశారు. తగిన జాగ్రత్తలు తీసుకోకుండానే ఏర్పాటు చేశారు. వర్షం వస్తే వైర్ల నుంచి సరఫరా అయ్యే విద్యుత్ వల్ల అనుకోని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. తాజాగా జరిగిన ఘటన నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులను చక్కదిద్దకపోతే భవిష్యత్‌లో మూల్యం చెల్లించక తప్పదు.