రిసెప్షన్, పారిశుద్ధ్యం, దర్శనం, ఆన్‌లైన్ సేవలపై తరచూ భక్తుల అభిప్రాయాల సేకరణ
నివేదిక అందిన తర్వాత తక్షణమే పరిష్కారం దిశగా చర్యలు
పరుగులు తీస్తున్న విభాగాధిపతులు..
మెరుగవుతున్న భక్తుల సౌకర్యాలు
తిరుమల: దేవదేవుడు శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అదే స్థాయిలో సమస్యలు కూడా పెరుగుతున్నాయి. వీటి పరిష్కారం కోసం టీటీడీ రహస్య సర్వేల మార్గం ఎంచుకుని తక్షణమే పరిష్కారం చూపుతోంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు అన్ని చోట్లా సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. తిరుమల కొండకు రాకముందే భక్తులకు రూ.300 ఆన్‌లైన్ టికెట్ల బుకింగ్ లో, ఇంటర్నెట్‌లో ఆర్జిత సేవా టికెట్ల బుకింగ్‌లో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి.
తిరుమలకు చేరిన భక్తులకు బస, కల్యాణకట్ట, దర్శనం, లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదం, పారిశుద్ధ్య నిర్వహణ, ఇంజనీరింగ్ పనుల వంటి విషయాల్లో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. వీటిపై లేఖల రూపంలో, డయల్ యువర్ ఈవో కార్యక్రమం రూపంలో, కాల్‌సెంటర్లు, టోల్‌ఫ్రీ నంబర్‌కు భక్తులు ఫిర్యాదు చేస్తున్నారు. వాటిని రికార్డు చేసి టీటీడీ ఈవోకు చేరవేస్తున్నారు.
రహస్య సర్వేలకు శ్రీకారం..
ప్రధానంగా రూ.300 టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్, బస (రిసెప్షన్), కల్యాణకట్ట, దర్శనం, లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదం, పారిశుద్ధ్య నిర్వహణ, ఇంజనీరింగ్ పనులపై టీటీడీ రహస్య సర్వేకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆయా విభాగాల కింద అందే సౌకర్యాలపై ప్రశ్నావళి రూపొందించింది. వాటిని శ్రీవారి సేవకులకు అందజేసి ఎంపిక చేసిన ప్రాంతంలో రహస్య సర్వే చేయిస్తున్నారు. ప్రశ్నావళిలో విభాగాల వారీగా భక్తులు పొందే సంతృప్తి, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై అభిప్రాయం తీసుకుంటున్నారు.
తక్షణమే స్పందిస్తున్న ఈవో సాంబశివరావు
రహస్య సర్వేలో వెలుగుచూసిన సమస్యలను టీటీడీ పీఆర్‌వో విభాగ ం నివేదిక రూపంలో సిద్ధం చేస్తోంది. దాన్ని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావుకు అందజేసి వివరిస్తోంది. ఆ మేరకు ఈవో కూడా ఆయా విభాగాలకు తక్షణమే ఉత్తర్వులు ఇవ్వటంతో సమస్యలు కూడా పరిష్కారమవుతున్నాయి. విభాగాధిపతులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నారు.
రూ.300 టికెట్లపై ఫొటో తొలగింపు సర్వేలో భాగమే
కొంతకాలంగా సర్వే చేయిస్తున్నారు. రూ.300 టికెట్లు పొందే క్రమంలో ఫొటో అప్‌లోడ్ చేయటం సమస్యగా ఉందని అధిక సంఖ్యలో భక్తులు ఫిర్యాదు చేశా రు. దీంతో ఈ నెల ఒకటో తేదీ నుంచి రూ.300 టికెట్లపై ఫొటో తొలగించారు. ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ గుర్తింపు కార్డు నంబరు ఆధారంగానే టికెట్లు కేటాయిస్తున్నారు. ఇక గదులు పొందటం నుంచి ఖాళీ చేసే వరకు, దర్శనం, లడ్డూ ప్రసాదం, పారిశుద్ధ్య నిర్వహణ, కల్యాణకట్టల్లోనూ అనేక సమస్యలు పరిష్కారం కావడం ఇందులో భాగమే.
భక్తుల సమస్యలపై టీటీడీ రహస్య సర్వే
Published Wed, Jan 13 2016 1:43 AM | Last Updated on Mon, Sep 17 2018 5:56 PM
Advertisement