తిరుమలలో ప్రైవేట్ పీఆర్‌వోల హవా | Tirumala private pro Hawa | Sakshi
Sakshi News home page

తిరుమలలో ప్రైవేట్ పీఆర్‌వోల హవా

Published Sat, Nov 29 2014 3:00 AM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM

తిరుమలలో  ప్రైవేట్ పీఆర్‌వోల హవా - Sakshi

తిరుమలలో ప్రైవేట్ పీఆర్‌వోల హవా

గదులు, శ్రీవారి దర్శనాల పేరుతో దందా
టీటీడీ అతిథిగృహాల్లో పీఆర్‌వోల తిష్ట   చూసీచూడనట్టుగా టీటీడీ రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు

 
తిరుమల : తిరుమలలో ప్రైవేట్ పీఆర్‌వోల హవా నడుస్తోంది. రాజకీయ నేతలు, కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు సొంతంగా ఏర్పాటు చేసుకున్న ఈ వ్యవస్థ వేళ్లూనుకుపోయింది. వీరు టీటీడీ అతిథిగృహాల్లో గదులను అనధికారికంగా ఆక్రమించుకున్నారు. శ్రీవారి దర్శనాలు, గదుల పేరుతో దందా జోరుగా సాగిస్తున్నారు. లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి.
 పాతుకుపోయిన ప్రైవేట్ పీఆర్‌వోలు దేశంలో మరెక్కడా లేనివిధంగా తిరుమల కేంద్రంగా ప్రైవేట్ పీఆర్‌వోల వ్యవస్థ పాతుకుపోయింది. రాజకీయ నాయకులు, కొందరు ప్రజాప్రతినిధులు, కార్పొరేట్ సంస్థలు, ఇతర అధికార, అనధికార సంస్థల కేంద్రంగా ఈ వ్యవస్థ నడుస్తోంది. ఇప్పటికే తిరుమలలో సుమారు వందకు పైగా ప్రైవేట్ అతిథిగృహాలున్నాయి. వీటికి అనుబంధంగా పీఆర్‌వోలు పనిచేస్తున్నారు. సర్వం వీరే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. వారిలో చాలా మంది తిరుమలకు వచ్చినవారికి గదులు, దర్శనాలు ఏర్పాటు చేయటంలో కీలకపాత్ర పోషిస్తుంటారు. తిరుమల కేంద్రంగా గదులు, దర్శనాల పేరుతో నెలవారీగా పెద్దమొత్తాల్లో చేతులు మారుతున్నట్టు ఆరోపణలున్నాయి. దాతలు కట్టించి టీటీడీకి అప్పగించిన అతిథి గృహాల్లో పీఆర్‌వోలు అనధికారికంగా గదులు ఆక్రమించుకుని ఏకంగా కాపురాలు సాగిస్తున్నట్టు ఫిర్యాదులున్నాయి. వీటికి సంబంధించి టీటీడీ విజిలెన్స్ అధికారుల వద్ద పక్కా సమాచారం ఉంది.
 
టీటీడీలో చక్రం తిప్పుతూ.. దందా

టీటీడీలో దీర్ఘకాలికంగా పనిచేసే ఉద్యోగుల కంటే ప్రైవేట్ పీఆర్‌వోలే చక్రం తిప్పుతున్నారు. అలాంటి వారికే టీటీడీ అధికారులు కూడా ఎర్రతివాచి పరుస్తున్నట్టు విమర్శలున్నాయి. దాతలు నిర్మించి టీటీడీకి అప్పగించిన అతిథిగృహాల గదులు కేటాయించాల్సిన బాధ్యత రిసెప్షన్ అధికారులదే. వారినే నియంత్రించే స్థాయిలో ప్రైవేట్ పీఆర్‌వోలు ఉన్నారు. తమ పరిధిలో ఉండే అతిథిగృహంలోని గదులు ఎప్పుడు? ఎవరెవరికి? ఎన్నెన్ని కేటాయించాలో వీరే నిర్ణయించే స్థాయికి ఎదిగిపోయారు. ఇక దర్శన టికెట్ల విషయంలోనూ ఇలాంటి పరిస్థితి ఉన్నట్టు విమర్శలున్నాయి. తాము పనిచేసే సంస్థ, యజమాని పేరుతో తాము సిఫారసు చేసిన వారికి ఏ రోజు, ఏ సేవా టికెట్టు కావాలన్నా సాధించి పెట్టడంలో వీరిపాత్ర ప్రధానంగా ఉంటుంది. ఇందుకోసం సంబంధిత టీటీడీ అధికారులపై రాష్ర్ట రాజధాని నుంచే కాదు ఏకంగా ఢిల్లీ స్థాయిలో కూడా తీవ్రస్థాయిలో వత్తిడి తేవడంలోనూ వీరు ప్రధాన భూమిక పోషిస్తున్నారు.

రద్దు చేసినా..

ప్రైవేట్ పీఆర్‌వోల ఆగడాలు శృతిమించటంతో గతంలోనే ఈ వ్యవస్థను టీటీడీ రద్దు చేసింది. దాతలు నిర్మించి టీటీడీకి అప్పగించిన అతిథిగృహాల్లో అనధికారికంగా తిష్టవేసిన ప్రైవేట్ పీఆర్‌వోలను ఖాళీ చేయించారు. వాళ్లు ఆక్రమించుకున్న గదులను కూడా భక్తులకు కేటాయించటంతో టీటీడీకి రాబడి వచ్చింది. కొన్నాళ్లు ఆచరణలో పెట్టినా తర్వాత అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరించారు. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది.

ప్రైవేట్ పీఆర్‌వో పోస్టు కోసం కప్పం

కొందరు దళారులు ప్రైవేట్ పీఆర్‌వోల అవతారం ఎత్తి తిరుమలలో దర్శనాలు, గదులు మంజూరు చేయిస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. కొందరు ‘ఫలానా సంస్థ, ఫలానా నేత’ పీఆర్‌వోగా చెప్పుకుంటూ ఇక్కడి కార్యకలాపాలను సాగించేందుకు నెలవారీగా కప్పం కడుతున్నట్టు విమర్శలున్నాయి. ఇలాంటి దళారుల సంఖ్య ఇటీవల పెరిగిపోయింది. దీనికి కొందరు పలుకుబడి కలిగిన నేతలు కూడా ఊతం పలుకుతుండటం గమనార్హం.

గదులు, దర్శనాలపై టీటీడీలో స్పష్టమైన విధానం

రాజ్యాంగ పరిధి హోదా కలిగిన ప్రజాప్రతినిధులు, అధికారులకు తిరుమలలో గదులు, శ్రీవారి దర్శన కేటాయింపుల్లో టీటీడీకి స్పష్టమైన విధానం ఉంది. సంబంధిత కార్యాలయం నుంచి తిరుమలలోని టీటీడీ జేఈవో కార్యాలయానికి ఫ్యాక్స్ చేస్తే అందుకు అనుగుణంగా కేటాయింపులు చేస్తుంటారు. ఇందుకోసం సుమారు 40 మంది దాకా సిబ్బంది పనిచేస్తున్నారు. అయితే, ఇందుకు విరుద్ధంగా కొందరు ప్రైవేట్ పీఆర్‌వోలను ప్రోత్సహిస్తూ టీటీడీపై వత్తిడి తేవడం వల్లే ఇలాంటి పరిస్థితి దాపురించింది. ఇకనైనా టీటీడీ ఉన్నతాధికారులు దీనిపై చర్యలు తీసుకుని ప్రైవేట్ పీఆర్‌వోలు లేకుండా చూడాలని టీటీడీ సిబ్బంది, భక్తులు కోరుతున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement