గోవిందా.. గోవిందా.. | Tirumala place of exile invasion | Sakshi
Sakshi News home page

గోవిందా.. గోవిందా..

Published Fri, Jan 9 2015 1:50 AM | Last Updated on Tue, Sep 3 2019 9:06 PM

గోవిందా..  గోవిందా.. - Sakshi

గోవిందా.. గోవిందా..

ఆక్రమణల చెరలో తిరుమలేశుని స్థలం
 
రూ.3.5 కోట్ల విలువైన 15 సెంట్లలో పెట్రోల్ బంక్ నిర్వహణ
కోర్టు ఆదేశించినా ఖాళీ చేయని వైనం
స్వాధీనానికి టీటీడీ  అధికారుల వెనుకంజ    

 
దేవుడే కదా మనం ఏమి చేసినా పట్టించుకోడులే... ఆయన వచ్చి అడగడు కదా... అయినా వేలాది కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న దేవదేవునికి రూ.5కోట్ల విలువైన స్థలం ఓ లెక్కా.. అని అనుకున్నారో ఏమో.. తిరుమలేశుని స్థలంలో తిష్టవేశారు. జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని ఆదేశించినా వారి చెవికెక్కలేదు. వెంకన్నకు చెందిన స్థలంలో యథేచ్ఛగా పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నారు. ఇంత జరుగుతున్నా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. స్థలం స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టడంలేదు.
 
విజయవాడ : అందరిని రక్షించే దేవదేవుడి ఆస్తులకు రక్షణ లేకుండాపోయింది. తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామిపై భక్తితో నగరానికి చెందిన దాతలు ఇచ్చిన భూములను కొందరు అక్రమంగా అనుభవిస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. విద్యాధరపురంలో టీటీడీకి చెందిన స్థలంలో పెట్రోల్ బంక్ నిర్వహించడమే ఇందుకు నిదర్శనం. నగరానికి చెందిన సామా రంగయ్య అనే వ్యక్తి తిరుమలేశునిపై భక్తితో 1940వ దశకంలో తన ఆస్తిలో కొంతభాగాన్ని టీటీడీకి విరాళంగా ఇచ్చారు. దానధర్మాలు చేయడంలో సామా రంగయ్యకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన పేరుతోనే వన్‌టౌన్‌లో సామారంగ్ చౌక్ ఉంది. ఆయన టీటీడీకి ఇచ్చిన విరాళంలో విద్యాధరపురంలోని కుమ్మరిపాలెం సెంటర్‌లో జాతీయ రహదారి పక్కన 2.30 ఎకరాల భూమి కూడా ఉంది. ఈ భూమిని ఆయన అప్పట్లోనే సర్వహక్కులతో టీటీడీకి రిజిస్ట్రేషన్ చేశారు. అయితే, అప్పటికే ఈ భూమిలో 15 సెంట్లను హెచ్‌పీ పెట్రోల్ బంకు నిర్వహణ కోసం 50 ఏళ్లపాటు సామా రంగయ్య లీజుకు ఇచ్చారు. లీజుకాలం ముగిసిన వెంటనే ఈ స్థలంపై కూడా సర్వహక్కులూ టీటీడీకి ఉంటాయని రిజిస్ట్రేషన్ దస్తావేజుల్లో ఆయన నమోదు చేశారు. సామా రంగయ్య కుమారులు సుబ్బారావు, సీతారామయ్య, రంగారావు, గోపి కూడా ఈ మేరకు టీటీడీకి సహకరించి తమ తండ్రి రాసిన విధంగా భూమిని అప్పగించారు.

లీజు గడువు ముగిసినా...  నిర్వాహకులు మారినా..

సామా రంగయ్య ఇచ్చిన లీజు గడువు ముగిసి 20 ఏళ్లు అవుతోంది. అయినా పెట్రోల్ బంకు నిర్వాహకులు మాత్రం ఈ స్థలాన్ని ఖాళీ చేయలేదు. నిరాటంకంగా పెట్రోల్ బంక్‌ను నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు బంక్ నిర్వాహకులు కూడా ఆరుగురు మారారు. తొలుత సామా రంగయ్య నుంచి రాజకుమారి థియేటర్ నిర్వాహకుడు ఖుద్దూస్ స్థలాన్ని లీజుకు  తీసుకున్నారు. ఆయన కొన్నేళ్లు పెట్రోల్ బంకు నిర్వహించారు. ఆ తర్వాత నగరానికి చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి ఖుద్దూస్ నుంచి సబ్ లీజుకు తీసుకుని కొంతకాలం బంక్ నడిపారు. అనంతరం గుంటూరు జిల్లా తెనాలికి చెందిన రవి అనే వ్యక్తి కొన్నేళ్లు ఈ బంక్‌ను నిర్వహించారు. ఆ తర్వాత హెచ్‌పీ కంపెనీ నిర్వహించింది. అప్పటికే లీజు గడువు ముగియడంతో టీటీడీ స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా, హెచ్‌పీ కంపెనీ కోర్టుకు వెళ్లింది. ఈక్రమంలో జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులు టీటీడీకి అనుకూలంగా తీర్పు చెప్పాయి.

ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించాయి. అయితే జిల్లా కోర్టులో కేసు దాఖలు చేసిన తర్వాత హెచ్‌పీ కంపెనీ పెట్రోల్ బంక్ లీజును గొల్లపూడికి చెందిన మరో పెట్రోల్ బంక్ నిర్వాహకులకు అప్పగించింది. వారి నుంచి నెల రోజుల క్రితం శంకరరావు అనే వ్యక్తి లీజుకు తీసుకున్నారు. కింది కోర్టులో టీటీడీకి తీర్పు అనుకూలంగా వచ్చినప్పటికీ బంక్‌ను నిర్వహిస్తూనే ఎగువ కోర్టులకు వెళ్లి కాలం గడిపారు. చివరకు సుప్రీంకోర్టు కూడా గత నెలలో ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని టీటీడీకి ఉత్తర్వులు జారీచేసినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

టీటీడీ అధికారుల అలసత్వం...

 సామా రంగయ్య ఇచ్చిన 2.30 ఎకరాల భూమిలో ఈ 15 సెంట్లు మినహా మిగిలిన దానికి టీటీడీ అధికారులు గతంలోనే ప్రహరీ నిర్మించారు.  పెట్రోల్ బంక్ విషయంలో మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి నెలరోజులు అయినా రకరకాల కారణాలు చెబుతూ కాలయాపన చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ గజం రూ.50వేల వరకు ధర పలుకుతోంది. ఈ లెక్కన పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్న స్థలం ధర రూ.3.5కోట్ల వరకు ఉంటుంది. ఈ స్థలంలో రూ.10 కోట్లతో వేంకటేశ్వరస్వామి దేవాలయం, అర్చకులకు క్వార్టర్సులను నిర్మించాలని టీటీడీ ఇంజినీరింగ్ విభాగం ప్రతిపాదనలు కూడా సిద్ధంచేసింది. అయితే, స్థలం స్వాధీనం కాకపోవడంతో ఈ ప్రతిపాదనలు అటకెక్కాయి. ఇప్పటికైనా టీటీడీ ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణదారుల నుంచి స్థలం స్వాధీనం చేసుకుని స్వామి సేవకు వినియోగించాల్సిన అవసరం ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement