తిరుపతి నగరానికి చెందిన గల్లా ప్రవీణ్ (23) అనే విద్యార్థి ఇటీవల అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
ఉన్నత విద్య అభ్యసించేందుకు వెళ్లాడు
అనుమానాస్పద స్థితిలోచనిపోయాడు
అక్కడే అంత్యక్రియలు
తిరుపతి క్రైం : తిరుపతి నగరానికి చెందిన గల్లా ప్రవీణ్ (23) అనే విద్యార్థి ఇటీవల అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు అతని తండ్రి గల్లా నాగేశ్వరరావు గురువారం మీడియాకు తెలిపారు. తిరుపతిలో నివాసముంటున్న నాగేశ్వరరావు కుమారుడు గల్లా ప్రవీణ్ (23) ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమెరికాకు వెళ్లాడు. కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ పుల్లెర్టన్ నగరంలో ఎంఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఒకటో తేదీ వర్సిటీకి బయలుదేరిన ప్రవీణ్ అదృశ్యమయ్యాడు. తీవ్రంగా వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. 2వ తేదీ నుంచి గల్లా ప్రవీణ్ అదృశ్యం అయినట్టు పోలీస్ స్టేషన్లో కేసు నమోద యింది. ఈనేపథ్యంలో రెండు రోజుల క్రితం గల్లా ప్రవీణ్ న్యూపోర్టులోని బీచ్‌లో శవమై తేలడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో మృతదేహం గల్లా ప్రవీణ్‌దిగా గుర్తించి సంబంధిత యూనివర్సిటీ అధికారులకు సమాచారం అందించారు. ప్రవీణ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
అయితే న్యూ జెర్సీలోని నాగేశ్వరరావు సోదరుడు చంద్రశేఖర్‌కు చెందిన సొంత స్థలంలో గల్లా ప్రవీణ్‌కు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఇదిలా ఉండగా గల్లా ప్రవీణ్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ప్రవీణ్‌కు మార్కులు తగ్గడంతో మానసికంగా ఒత్తిడికి గురై ఉండవచ్చని వారి స్నేహితులు చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే మృతుడి తండ్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ తన కుమారుడు బాగా చదివేవాడని, అన్నింటిలో చురుగ్గా ఉండేవాడని అన్నారు. మృతికి బలమైన కారణాలు ఏమైఉంటాయో తెలియడం లేదన్నారు.