రజాకార్ల నిరంకుశ పాలనకు ఎదురొడ్డారాయన. ఆంధ్రలో హైదరాబాద్ రాష్ర్ట విలీనానికి వ్యతిరేకంగా ఉద్యమించారు.
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: రజాకార్ల నిరంకుశ పాలనకు ఎదురొడ్డారాయన. ఆంధ్రలో హైదరాబాద్ రాష్ర్ట విలీనానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. తెలంగాణ స్వయంప్రతిపత్తికి ఆ రోజుల్లోనే పట్టుబట్టిన నాయకుడే కొండా వెంకటరంగారెడ్డి. సమైక్య రాష్ట్రంలో తొలి ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కేవీ రంగారెడ్డి 1890 డిసెంబర్ 12న మొయినాబాద్ మండలం పెద్ద మంగళారంలో జన్మించారు. ఉర్దూ భాషలో ప్రావీణ్యుడైన కొండా వకీలుగా పనిచేశారు.
హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా వ్యవహరించిన రంగారెడ్డి అప్పట్లో ఆ రాష్ట్రాన్ని ఆంధ్రరాష్ట్రంలో విలీనం చేయాలనే ప్రతిపాదనకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్వయం పాలనకు అవకాశమివ్వకుండా ఆంధ్రలో కలపాలనే ఆలోచనను విరమించుకోవాలని కేంద్రంపై ఒత్తిడి చేశారు. స్వయంప్రతిపత్తి కోసం యువత ప్రాణాలర్పించడంతో చలించిన కొండా మంత్రి పదవికి రాజీనామా చేశారు. 1956 ఫిబ్రవరి 26న రాష్ట్ర విలీన సమయంలో పెద్ద మనుషుల ఒప్పందంలో కీలక సభ్యుడిగా వ్యవహరించారు కేవీ రంగారెడ్డి. ఈయన మేనల్లుడే మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి. మామ స్మృత్యర్థం చెన్నారెడ్డి 1978లో ‘రంగారెడ్డి’ జిల్లాను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను ఆ రోజుల్లోనే బలంగా చాటిన కొండా వెంకటరంగారెడ్డి 123 జయంతి గురువారం. ప్రత్యేక రాష్ట్ర కల సాకారమవుతున్న వేళ ఆయనకిదే నిజమైన నివాళి అని చెప్పుకోవచ్చు.