కొవ్వూరు : హత్యకేసులో ఆటోడ్రైవర్ కలిదిండి పాటియ్యకు జీవిత ఖైదుతో పాటు రూ.2వేలు జరిమానా విధిస్తూ కొవ్వూరు జిల్లా
కొవ్వూరు : హత్యకేసులో ఆటోడ్రైవర్ కలిదిండి పాటియ్యకు జీవిత ఖైదుతో పాటు రూ.2వేలు జరిమానా విధిస్తూ కొవ్వూరు జిల్లా అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి వైవీఎస్‌జీబీ పార్ధసారధి తీర్పు నిచ్చినట్టు పోలవరం సీఐ కే.బాలరాజు తెలిపారు. గోపాలపురం మండలం చిట్యాల సమీపంలో 2013 అక్టోబర్ 19 జరిగిన ఈ హత్యోదంతం వివరాలను మంగళవారం విలేకరులకు తెలిపారు. కొయ్యలగూడెం మండలం గంగవరానికి చెందిన ఆటోడ్రైవర్ పాటియ్యకు చిట్యాలకు చెందిన జ్యోతితో 14 ఏళ్ల క్రితం వివాహమైంది. ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. మరో ఆటోడ్రైవర్ ఈడుపుగంటి శ్రీనుతో జ్యోతికి వివాహేతర సంబంధం ఉందన్న కారణంగా భార్యాభర్తలు గొడవలు పడ్డారు. పాటియ్య తన భార్యను చిట్యాల పుట్టింటికి పంపేశాడు.
తర్వాత అక్కడకు వెళ్లి శ్రీనును హతమార్చేందుకు సహకరించాలని కోరాడు. భార్య జ్యోతి పాటియ్య ప్రతిపాదనకు అంగీకరించింది. 2013 అక్టోబర్ 19న జ్యోతితో శ్రీనుకి ఫోన్ చేయించి రాత్రి 9 గంటలకు చిట్యాల హైస్కూలుకు రమ్మని కబురు చేశాడు. ఆ ప్రకారం వచ్చిన శ్రీను జ్యోతిని ఆటోలో ఎక్కించుకుని చెరుకుమిల్లి రోడ్డులో ఉన్న తాడిపూడి ఎత్తిపోతల పథకం కాలువ వద్దకు తీసుకువెళ్లాడు. ఆ సమయంలో పాటియ్య పలుగుతో శ్రీను తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ శ్రీనును ఆటోలో గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. డాక్టర్ శ్రీనును పరిశీలించి మృతి చెందినట్టు నిర్ధారించారు. డాక్టర్ నవీన్‌కుమార్ పోలీస్‌లకు ఇచ్చిన ఫిర్యాదుపై అప్పటి గోపాలపురం ఎస్సై ఎస్.గంగరాజు కేసు నమోదు చేశారు.
అప్పటి సీఐ జీఆర్‌ఆర్ మోహన్ చార్జీషీట్ దాఖలు చేశారు. తొమ్మిది మంది సాక్షులను విచారించిన అనంతరం పాటియ్య హత్య చేసినట్టు రుజువు కావడంతో న్యాయమూర్తి జీవిత ఖైదుతో పాటు రూ.2వేలు జరిమానా విధించినట్టు సీఐ బాలరాజు తెలిపారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారన్నారు. జిల్లా అదనపు సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కవల నాగేశ్వరరావు ప్రాసిక్యూషన్ తరఫున కేసు వాదించినట్టు సీఐ తెలిపారు. ఎస్సై కె.లక్ష్మినారాయణ దర్యాప్తులో సహకరించినట్టు తెలిపారు.