సూళ్లూరుపేట, న్యూస్‌లైన్:భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆవిర్భవించిన 50 ఏళ్లలో ఎన్నో మైలురాళ్లను అధగమించి ప్రపంచంలో ఆరోస్థానానికి చేరుకోగలిగామని షార్ డెరైక్టర్ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ అన్నారు. అంతరిక్ష ప్రయోగాలు చేసేందుకు భారతదేశం ఎంతో అనుకూలంగా ఉందని అంతరిక్ష పితామహులు డాక్టర్ విక్రమ్ సారాబాయ్ గుర్తించి ఐక్యరాజ్యసమితికి నివేదిక ఇచ్చారన్నారు. 1963 నవంబర్ 21న ఫ్రాన్స్ రాడార్, లాంచర్, రష్యా కంప్యూటర్, హెలీకాప్టర్, అమెరికా రాకెట్‌ను ఇచ్చాయన్నారు. ఈ మూడు దేశాల సహకారంతో మనం మొట్టమొదట రాకెట్ ప్రయోగానికి శ్రీకారం చుట్టామని ఆయన చెప్పారు. ఇస్రో 50 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో తనది 38 ఏళ్ల అనుబంధమన్నారు. భవిష్యత్తులో ఇంకా సాధించాల్సి ంది చాలా ఉందంటున్న షార్ డైర్‌క్టర్ ‘న్యూస్‌లైన్’తో తన అభిప్రాయాలు పంచుకున్నారు.
న్యూస్‌లైన్: గడిచిన 50 ఏళ్లలో ఉపగ్రహ ప్రయోగాలతో దేశ ప్రజలకు ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించగలిగారు?
షార్ డెరైక్టర్: కమ్యూనికేషన్ శాటిలైట్స్ ద్వారా టెలిపోన్, ఇంటర్నెట్, రేడియో, కేబుల్ అపరేటర్స్ ద్వారా అన్ని చానెల్స్ ప్రసారం, డీటీహెచ్, వీశాట్ ద్వారా ఏటీఎం, అన్‌లైన్ బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్, ఐఓసీ నెట్ వర్కింగ్ లాంటి ఎన్నో సౌకర్యాలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చాం. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ద్వారా దేశంలో వ్యవసాయానికి సంబంధించి వరి, గోధుమ తదితర పంటల దిగుబడులపై భారత ప్రభుత్వానికి సమాచారం ఇచ్చి ఆహార కొరతను ముందుగానే తెలియజేస్తుంది. ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్‌మెంట్ వారికి తుపాన్లు, వర్ష సూచనలు, వాతావరణానికి సంబంధించిన అన్ని విషయాలను ముందుగానే అందిస్తున్నాం. టెలీఎడ్యుకేషన్, టెలీ మెడిసన్ లాంటి సౌకర్యాలను కూడా అందించాం.
న్యూస్‌లైన్: భవిష్యత్తులో ఎలాంటి ప్రయోగాలు చేయనున్నారు?
షార్ డెరైక్టర్: జీఎస్‌ఎల్‌వీ మార్క్-3లో 4 టన్నుల కమ్యూనికేషన్ శాటిలైట్‌ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. దీనికి సంబంధించి భూ స్థిర పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశాం. కమ్యూనికేషన్ శాటిలైట్స్‌ను ఫ్రెంచి గయానా నుంచి కాకుండా మనమే ప్రయోగించుకునేందుకు జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను డెవలప్ చేస్తున్నాం. చంద్రయాన్-2, చంద్రుడిపైకి మానవ సహిత ప్రయోగాలు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నాం. అలాగే నావిగేషన్ సిస్టంను అభివృద్ధి చేసేందుకు ఇటీవల ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1)ను విజయవంతంగా ప్రయోగించాం. ఈ తరహా ఉపగ్రహాలను మరో ఐదింటిని ప్రయోగించి నావిగేషన్ సిస్టంను సొంతంగా ఏర్పాటు చేసుకోబోతున్నాం. జీఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగంలో మూడో దశలో ఉపయోగించే క్రయోజనిక్ దశను అభివృద్ధి చేసుకుంటున్నాం. అలాగే 2 వేలు కోట్లతో సెమీ క్రయోజనిక్ ఇంజన్లను తయారు చేసుకోవడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
న్యూస్‌లైన్: పీఎస్‌ఎల్‌వీ విజయరహస్యమేంటి?
షార్ డెరైక్టర్: పీఎస్‌ఎల్‌వీ విజయానికి కారణం వికాస్ ఇంజన్. ఫ్రాన్స్‌తో కలసి ఇస్రో ఈ వికాస్ ఇంజన్‌ను రూపొం దించింది. ఈ తరహా ఇంజన్లను ఫ్రాన్స్ కూడా వాడుతూ సక్సెస్‌ను సాధించింది. అలాగే పీఎస్‌ఎల్‌వీ విజయంలో ఈ ఇంజనే ప్రధాన కారణం.
న్యూస్‌లైన్: షార్‌కు కొత్త ప్రాజెక్టులు ఏవైనా వస్తున్నాయా? భవిష్యత్తులో షార్ ఏ విధంగా ఉండబోతోంది?
షార్ డెరైక్టర్ : రూ.250 కోట్లతో మల్టీ ఆబ్జెక్టివ్ రాడార్ కేంద్రం పనులు జరుగుతున్నాయి. 2015 నాటికి ఈ పనులు పూర్తవుతాయి. ఇప్పటికే శ్రీహరికోటలో ఆరు రాడార్లున్నాయి.
ఈ రాడార్లు రాకెట్ గమనాన్ని మాత్రమే చూపిస్తాయి. శకలాలు ఎక్కడ పడతాయో పసిగట్టలేవు. ఈ మల్టీ ఆబ్జెక్టివ్ రాడార్ అందుబాటులోకి వస్తే బహుళ ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయి. ఒకే సారి రాకెట్ ఉపగ్రహాన్ని విడిచిపెట్టడంతో పాటు స్ట్రాపాన్ బూస్టర్లు శకలాలు ఎక్కడ పడేది చూపిస్తుంది. రోదసీలో నిరుపయోగంగా మారిన ఉపగ్రహాలను తొలగించేందుకు కూడా ఉపయోగపడుతుంది.
ఈ రాడార్ ను 50 మంది ఇంజనీర్లు డిజైన్ చేయగా ప్రస్తుతం వందమంది ఇంజనీర్లు ఈ పనిలో నిమగ్నమయ్యారు. రెండో ప్రయోగ వేదికకు అనుసంధానంగా రూ.360 కోట్లతో రెండో వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్ కూడా మంజూరైంది. మరో మూడేళ్లలో ఈ పనులు మొదలు కానున్నాయి. ప్రస్తుతం ఏడాదికి 8 ప్రయోగాలు చేస్తున్నాం. భవిష్యత్తులో 12 ప్రయోగాలు చేసేందుకు రెండో వ్యాబ్‌ను నిర్మిస్తాం. మూడో ప్రయోగవేదికకు కూడా ప్రతిపాదనలు పంపాం. మానవ సహిత ప్రయోగాలు చేయాలంటే మూడో ప్రయోగవేదిక అవసరం. ఇవన్నీ అందుబాటులోకి వస్తే షార్ భవిష్యత్తులో భారీ ప్రయోగాలు చేసే బలీయమైన శక్తిగా మారుతుంది.
న్యూస్‌లైన్: ఇస్రో 50 ఏళ్ల ప్రయాణంలో మీ అనుభూతి ఏంటి?
షార్‌డెరైక్టర్: ఇస్రో 50 ఏళ్ల ప్రయాణంలో ఎంతో సాధించినందుకు అనందంగా ఉంది. దేశ ప్రజలకు ఎన్నో సేవలను ఉపగ్రహాల ద్వారా అందిస్తున్నందుకు గర్వంగా ఉంది. భవిష్యత్తులో ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. చంద్రయాన్-1, మంగళయాన్ లాంటి గ్రహాంతర ప్రయోగాలు చేసి విజయం సాధించినందుకు సంతృప్తికరంగా ఉంది. ఎంతో మంది మహామహులు అంతరిక్ష శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి మానవాళికి ఎన్నో ప్రయోజనాలు అందించారు. వారి స్ఫూర్తితో ముందుకు నడుస్తాం.
సాధించాల్సింది చాలా ఉంది
Published Thu, Nov 21 2013 3:39 AM | Last Updated on Sat, Sep 2 2017 12:48 AM
Advertisement
Advertisement