యథేచ్ఛగా కబ్జా! | To take random! | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా కబ్జా!

Published Sat, Jan 24 2015 3:32 AM | Last Updated on Sat, Sep 2 2017 8:08 PM

యథేచ్ఛగా కబ్జా!

యథేచ్ఛగా కబ్జా!

సాక్షి ప్రతినిధి, కర్నూలు : జిల్లాలోని వక్ఫ్ ఆస్తులను ఆక్రమణదారులు దర్జాగా కబ్జా చేసేస్తున్నారు. వక్ఫ్ బోర్డుకు చెందిన విలువైన స్థలాలను ముక్కలు ముక్కలు చేసి కేకుల్లా పంచుకుతింటున్నారు. వీటిని కాపాడుకోవాల్సిన వక్ఫ్ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. వక్ఫ్‌బోర్డుకు చెందిన స్థలమని తెలిసినప్పటికీ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఇతరుల పేరు మీద బదిలీ చేస్తూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఈ ఆస్తులను కాపాడేందుకు కలెక్టర్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ఎలాంటి చర్యలు తీసుకోలేక నామమాత్రంగా ఉంది. ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క వక్ఫ్ స్థలాన్ని కూడా కాపాడిన దాఖలాలు లేవు. మొత్తం మీద వక్ఫ్ బోర్డుకు చెందిన ఒక్కో స్థలం క్రమంగా కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోతోంది.
 
విలువైన ఆస్తులపై కబ్జాదారుల కన్ను
కర్నూలు జిల్లాలో ప్రధానంగా నగరం చుట్టూ పక్కల మండలాల్లో వక్ఫ్ బోర్డుకు చాలా విలువైన స్థలాలు ఉన్నాయి. ఈ స్థలాలపై మొదటి నుంచీ కబ్జాదారుల కన్ను ఉంది. ఈ నేపథ్యంలో 1983లోనే ఏయే ప్రాంతాల్లో ఏయే సర్వే నెంబర్లల్లో వక్ఫ్‌స్థలాలు ఉన్నాయనే విషయాన్ని పేర్కొంటూ గెజిట్‌ను ప్రభుత్వం విడుదల చేసింది.
     
ఈ గెజిట్ ప్రకారం కల్లూరులోని సర్వే నెంబరు 356లోని 21 ఎకరాల 79 సెంట్ల స్థలం వక్ఫ్‌బోర్డుకు చెందినది. అయితే, ఇప్పుడు తాజాగా ఈ సర్వే నెంబరును 356, 356/1, 356/2,356/3లుగా విడదీసి.. ముక్కలు ముక్కలు చేసి వేర్వేరు వ్యక్తులు అమ్ముకున్నారు. వారి పేరు మీద పాసుపుస్తకాలు కూడా సిద్ధమయ్యాయి. ఇది వక్ఫ్ ఆస్తి అని తెలిసినప్పటికీ రిజిస్ట్రేషన్‌శాఖ సిబ్బంది కాస్తా మాముళ్లకు అలవాటు పడి వేర్వేరు వ్యక్తుల పేరు మీద రిజిస్ట్రేషన్లు చేశారు.

ఈ ఆస్తులను కాపాడుకోవాల్సిన వక్ఫ్ అధికారులు లంచాల మత్తులో జోగుతూ కబ్జాదారులతో చేతులు కలుపుతున్నారు. గెజిట్‌లో స్పష్టంగా కల్లూరులోని సర్వే నెంబరు 356లోని స్థలం వక్ఫ్‌బోర్డుదని ఉన్నా... ఇతరుల పరమైపోయింది. అయితే, ఈ పాసుపుస్తకాలను రద్దు చేసి, తిరిగి వక్ఫ్‌బోర్డు పేరు మీద స్థలాన్ని మార్చే అధికారం ఉన్నా... జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందన్న విమర్శలున్నాయి.
     
కల్లూరు మండలంలోనే మరో సర్వే నెంబరు 124 కూడా వక్ఫ్ ఆస్తి అని.. ఈ సర్వే నెంబరును ఎవరి పేరుమీద రిజిస్ట్రేషన్లు చేయవద్దని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు వక్ఫ్ బోర్డు స్పష్టంగా లేఖ కూడా రాసింది. అయినప్పటికీ జిల్లా రిజిస్ట్రార్ సెలవులో ఉన్న సమయాన్ని చూసి.. 2014 ఆగస్టు నెలలో ముక్కలు ముక్కలు చేసి ఏకంగా 31 మందికి ప్లాట్లుగా రిజిస్ట్రేషన్ చేశారు.

మొత్తం మీద జిల్లాలో వక్ఫ్ ఆస్తులను ఎవరూ పట్టించుకోవడం లేదని.. దీనిని అత్యంత ప్రాధాన్యత లేని అంశంగా చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వాస్తవానికి వక్ఫ్ ఆస్తులను కాపాడేందుకు సర్వాధికారాలు ఉన్న జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఏమాత్రమూ వీటి గురించి పట్టించుకుంటున్న పాపాన పోలేదు.
 
నామ్‌కే వాస్త్‌గా కమిటీ..!
వాస్తవానికి వక్ఫ్ ఆస్తులను కాపాడేందుకు ప్రభుత్వం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వక్ఫ్ ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యతను తీసుకోవాలని స్పష్టం చేసింది. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో మరో 10 మంది సభ్యులు ఉంటారు. ఎస్పీతో పాటు జాయింట్ కలెక్టర్, ఆర్డీవో, జిల్లా వక్ఫ్ అధికారి, రెవెన్యూ, మునిసిపల్, ఆర్ అండ్ బీ, అటవీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, పంచాయతీ శాఖల నుంచి నామినేట్ చేసే అధికారులు సభ్యులుగా ఉంటారు.

ఈ కమిటీకి జిల్లా వక్ఫ్ అధికారి కన్వీనరుగా వ్యవహరిస్తారు. అయితే, ఈ కమిటీ కేవలం పేరుకు మాత్రమే ఉంది. వక్ఫ్ ఆస్తులను ఆక్రమించిన కబ్జాదారులపై క్రిమినల్ కేసులను నమోదు చేసే అధికారం ఈ కమిటీకి ఉంది. అంతేకాకుండా ఆస్తులను ఆక్రమించిన వారి పాసుబుక్కులను రద్దు చేసి.. వక్ఫ్‌బోర్డు పేరు మీద ఆస్తిని బదిలీ చేయాలి. జిల్లాలో ఒక్కటంటే ఒక్క ఆక్రమిత ఆస్తిని కూడా తిరిగి వక్ఫ్‌బోర్డు పేరు మీద ఇప్పటివరకు బదిలీ కాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
 
రికార్డులూ లేవు..
వాస్తవానికి వక్ఫ్‌బోర్డుకు చెందిన ఆస్తుల వివరాలన్నీ సమగ్రంగా ఒక రికార్డు రూపంలో తయారుచేసుకోవాలి. ఈ రికార్డులను వక్ఫ్ అధికారులు జాగ్రత్తంగా నిర్వహించాలి. ఈ రికార్డులను జిల్లా రెవెన్యూ అధికారికి ఇచ్చి భద్రపరచడంతో పాటు.. ఈ వివరాలను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు కూడా ఇవ్వాలి. తద్వారా ఈ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయవద్దని స్పష్టంగా లిఖితపూర్వకంగా లేఖ రాయాలి. అయితే... జిల్లాలో ఈ ప్రక్రియ ఏ మాత్రమూ సాగటం లేదన్న విమర్శలు ఉన్నాయి. అంతేకాదు వక్ఫ్ ఆస్తులపై ఎప్పటికప్పుడు కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ సమావేశం కావాల్సి ఉన్నా.. ఏ మాత్రమూ పట్టించుకున్న దాఖలాలు లేవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement