దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డి
‘అనంత’ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపదగిన ఆదర్శవంతమైన జీవితం ఆయన సొంతం. సీమాంధ్ర చరిత్రనే కాదు జాతీయ రాజకీయాలను సైతం ప్రభావితం చేసిన ఆయన పోరాటం విలక్షణం. అనితర సాధ్యం. ‘వీరులార మీకు పరి పరి దండాలు’ అంటూ ప్రజలు ఆర్తిగా పాడుకునే పాటలకు స్ఫూర్తిగా నిలచిన ఆయనే తరిమెల నాగిరెడ్డి. ఆ మహనీయుడి వర్ధంతిని నేడు (ఆదివారం) అభిమానులు ఘనంగా జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన జీవిత విశేషాలు మీకోసం.. – అనంతపురం కల్చరల్
విద్యార్థి దశలోనే రచయితగా..
1917 ఫిబ్రవరి 11న శింగనమల మండలం తరిమెలగ్రామానికి చెందిన సుబ్బారెడ్డి, ఆది లక్ష్మమ్మలకు జన్మించారు నాగిరెడ్డి. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రిషివ్యాలి విద్యాలయంలో నీలం సంజీవరెడ్డితో కలసి విద్యాభ్యాసం చేశారు. ఆ కాలంలోనే దేశకాల పరిస్థితులు తెలిసిన రచయితగా, మానవత్వం పరిమళించిన మనిషిగా అనేక పుస్తకాలను రచించారు. ముఖ్యంగా 1940లో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులలో ‘యుద్ధము– ఆర్థిక ప్రభావం’ అన్న రచనతో అందరిని ఆలోచింపజేశారు. 1941లో కమ్యూనిస్టు సిద్ధాంతాలను వ్యతిరేకించిన బ్రిటీష్ ప్రభుత్వం తరిమెల నాగిరెడ్డిని తిరుచిరాపల్లి కారా గారంలో బంధించింది.
ప్రజాప్రతినిధిగానూ..
మద్రాసు లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబరుగా, లోకసభ సభ్యునిగా, కమ్యూనిస్టు పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నాగిరెడ్డి ఎన్నికయ్యారు. ప్రజలకు నిరుపమాన సేవలందించారు. మార్క్సిజం జీవన గమ్యంగా తన జీవితాన్ని అణగారిన బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికే ఆయన అంకితం చేశారు. వారి ఆప్తబంధువుగా నిలిచారు.
నీలం సంజీవరెడ్డినీ ఓడించారు..
ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి ఎరుగని నేతగా తరిమెల పేరుగాంచారు. జీవితాంతం విలువలు పాటించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. దీంతోనే మేరునగ ధీరుడైన మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డిని సైతం 1952 ఎన్నికల సంగ్రామంలో ఓడించగలిగారు. ‘వీరులారా మీకు పరి పరి దండాలు’ అంటూ ప్రజానీకం ఆర్తిగా పాడుకునే పాటలకు స్పూర్తిగా నిలచిన తరిమెల నాగిరెడ్డి జీవితమే పఠనీయ గ్రంథమని ఎంతో మంది జాతీయ నాయకులే కొనియాడడం ఆయన నిబద్ధతకు అద్దం పడుతుంది. పేదల కోసం తన జీవితాన్నే అంకితం చేసిన తరిమెల 1976లో రహస్య జీవితం గడుపుతూ మరణించారు.
దేవులపల్లితో కలిసి అడుగులు
కమ్యూనిస్టు దిక్సూచిగా నిలిచిన నేతగా తరిమెల నాగిరెడ్డిది విలక్షణ జీవన విధానం. 1964లో కమ్యూనిస్టులు రెండుగా చీలిన తర్వాత దేవులపల్లి వెంకటేశ్వరరావుతో విప్లవకారుల సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని పోరాటాలు చేశారు. దీంతోనే నాగిరెడ్డితో పాటు దేవులపల్లి వర్ధంతిని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
నేడు విప్లవవీరుల సంస్మరణ:
రైతు కూలీల తరఫున పోరాటాలెన్నో చేసి చిరస్మరణీయుడిగా మారిన తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వేంకటేశ్వరరావు వర్ధంతిని ఆదివారం సాయంత్రం స్థానిక ఉపాధ్యాయభవన్‌లో ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర నాయకులు సుబ్బారెడ్డి, బాలు, భాస్కర్, అజయ్‌రెడ్డి తదితరులు ఆత్మీయ అతిథులుగా విచ్చేసి ప్రసంగించనున్నారు. కమ్యూనిస్టు శ్రేయోభిలాషులు, ప్రజాతంత్ర వాదులు సంస్మరణ సభకు హాజరై నివాళులర్పించాలని యూసీసీఆర్‌ఐ (ఎం.ఎల్.) జిల్లా కార్యదర్శి భాస్కర్ ఓ ప్రకటనలో కోరారు.
Comments
Please login to add a commentAdd a comment