మహానేతా.. మనసాస్మరామి.. | Today, exactly four years was for YSR | Sakshi
Sakshi News home page

మహానేతా.. మనసాస్మరామి..

Published Mon, Sep 2 2013 3:40 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM

Today, exactly four years was for YSR

చెరగని చిరునవ్వు.. చెదరని ఆత్మవిశ్వాసం.. ఎదనిండా మంచితనం.. ఎదురులేని రాజసం.. రాజన్నా!  నిన్నెలా మరిచిపోగలం..! అంటూ జిల్లా ప్రజ ఆ మహానేతను తలచుకుంటోంది. నువ్వు దూరమై నాలుగేళ్లు గడుస్తున్నా ఇంకా మా మధ్యనే ఉన్నట్లుంది.. అంటూ గుండె తడి చేసుకుంటోంది. జ్ఞాపకాలను నెమరువేసుకుంటోంది. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా నాటి గురుతుల పునరావలోకనం..
 
 సాక్షి, గుంటూరు : ప్రజల్లో నుంచి పుట్టిన నాయకుడాయన. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్లు పాలన అందించిన మహానేత.  రైతులకు వైఎస్ పాలన ఓ సువర్ణయుగం. పేదోడు తలెత్తుకుని కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకుంది ఆయన పరిపాలనలోనే. జిల్లాతో విడదీయలేని అనుబంధం ఉన్న దివంగత మహానేత వైఎస్ దూరమై నేటికి సరిగ్గా నాలుగేళ్లు. రైతుల బతుకుచిత్రాన్ని మార్చే క్రమంలో భాగంగా ఆయన రూ.1.50 లక్షల కోట్లతో జలయజ్ఞం కింద చేపట్టిన 86 ప్రాజెక్టుల్లో మొట్టమొదటిది జిల్లా రైతుల స్థితి గతుల్ని మార్చే పులిచింతల ప్రాజెక్టే. మహానేత వైఎస్ చివరిగా సంతకం చేసిన ఫైల్ కూడా జిల్లాలో మిర్చి రైతులకు వాతావరణ ఆధారిత బీమా కింద ప్రయోజనం చేకూర్చేదే. ఈ బీమాతో జిల్లాలో మిర్చి రైతులు రూ.17 కోట్లకు పైగా లబ్ధిపొందారు. 
 
 గుంటూరుకు ప్రాధాన్యం..
 జిల్లా ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని ఆర్థికంగా, రాజకీయంగా గుంటూరుకు వైఎస్ ఎంతో ప్రాధాన్యం కల్పించారు. జిల్లాకు మంత్రి పదవుల్ని కేటాయించడంతో పాటు పథకాల అమల్లోనూ పెద్దపీట వేశారు. రాష్ట్రవ్యాప్తంగా చేసిన రూ.12 వేల కోట్ల రుణమాఫీలో జిల్లాకు రూ.560 కోట్ల మేర రైతులకు ప్రయోజనం చేకూరింది. ఇందిరప్రభ జిల్లాలో ప్రారంభించి రైతుల ప్రయోజనాలకు పెద్దపీట వేశారు.  జిల్లా పరిషత్తు ఉద్యోగులకు యాభై ఏళ్లుగా ఉన్న జీతాల సమస్యను పరిష్కరించి 010 పద్దు కింద తీసుకువచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. గుంటూరు నగరానికి దాహార్తి తీర్చేందుకు రూ.6.50 కోట్లతో తక్కెళ్ళపాడు రా వాటర్ ప్లాంట్ నుంచి తక్కెళ్ళపాడు నీటి శుద్ధి ప్లాంట్ వరకు రెండో పైపు లైన్ నిర్మించారు. నగర ప్రజలకు నీటి కష్టాలు తీర్చిన మహానేతను నగరవాసులు గుర్తు చేసుకుంటున్నారు. ప్రపంచ బ్యాంకు నిధులైన రూ.460 కోట్లతో చేపట్టనున్న సమగ్ర తాగునీటి పథకానికి అంకురార్పణ చేశారు. దీంతో రాబోయే 40 సంవత్సరాల నగర జనాభా నీటి అవసరాలు తీరనున్నాయి.  
 
 కోస్తాలో అతి పెద్ద ఆస్పత్రిగా పేరొందిన జీజీహెచ్‌లో మిలీనియం బ్లాక్ నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు చేసిన ఘనత వై.ఎస్.కే దక్కుతుంది. అన్ని వర్గాలకు ప్రయోజనాల్ని కల్పించి భధ్రత కల్పించింది వైఎస్సేనని రాజకీయాలకతీతంగా నేతలు అంగీకరిస్తున్నారంటే  జనహృదయాల్లో ఎంతటి చెరగని ముద్ర వేసుకున్నారో అవగతమవుతుంది. జిల్లా మొత్తానికి కృష్ణా జలాలు అందించాలన్న ఆయన ఆశయం ప్రస్తుత ప్రభుత్వం అటకెక్కించింది. రూ.1,281 కోట్ల వ్యయంతో పులిచింతల ప్రాజెక్టును పూర్తిచేసేందుకు అన్ని ప్రాంతాల ప్రజల్లో వ్యక్తమైన వ్యతిరేకత, అపోహల్ని తొలగించి యుద్ధప్రాతిపదికన పూర్తిచేసేందుకు వైఎస్ కృషిచేస్తే ఈ ప్రాజెక్టు నేటికీ పూర్తికాక ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోంది. ఆయన దూరమై నాలుగేళ్లు కావస్తున్నా.. ఇప్పటికీ ఓ కలగానే ఉందని జిల్లా రైతాంగం పేర్కొంటోంది. ఆదుకుంది ఆ మహానేతేనంటూ స్మరించుకుంటున్నారు.
 
  ప్రజల మదిలో సుస్థిర స్థానం
 ప్రత్తిపాడు : సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న నేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. పేద, బడుగు, బలహీన వర్గాలతో అన్ని వర్గాల ప్రజల ముఖాల్లో చిరునవ్వులు చిందాలనే లక్ష్యంగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన మహనీయుడాయన. ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్ళినా.. ప్రత్తిపాడు ప్రజల గుండెల్లో మాత్రం ఆయన  గురుతులు మెదులుతూనే ఉన్నాయి. వైఎస్సార్‌కు ప్రత్తిపాడుతో సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. తొలిసారిగా ఆయన ప్రతిపక్ష నాయకుడి హోదాలో 1996 ఏప్రిల్ 16న ప్రచారం నిమిత్తం ప్రత్తిపాడుకు వచ్చారు. అనంతరం 1998లో రెండవసారి వచ్చారు. 1998 సెప్టెంబరు 13న  యడ్లపాడు మండలం ఉన్నవ నుంచి ప్రత్తిపాడు మీదుగా ముట్లూరు వరకు మినీ పాదయాత్ర చేశారు.  అనంతరం ముఖ్యమంత్రి అయిన తర్వాత 2006 మే 10న సీఎం హోదాలో మొదటిసారిగా ప్రత్తిపాడు వచ్చిన ఆయన ప్రజాపథం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే వైఎస్ ప్రత్తిపాడుకు రావడం చివరిసారి. ఎన్నికల హామీలను నెరవేర్చి ఆయన చెరగని ముద్ర వేసుకున్నారు. 
 
  రాజన్నా.. నిను మరువం..
 చిలకలూరిపేట రూరల్ : చిలకలూరిపేట ప్రాంతంలోని జన హృదయాల్లో వైఎస్సార్ చిరస్థాయిగా ఉన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో  అభివృద్ధి సంక్షేమం కోసం నాటి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ ప్రతిపాదించిన కార్యక్రమాలకు నిధులు విడుదల చేసి ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించారు. ముస్లిం మైనార్టీ బాలికలు ఉన్నత విద్యను అభ్యసించేందుకు కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాన్ని మర్రి కృషితో పోతవరం గ్రామంలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఓగేరు వాగుపై పోతవరం - రాజాపేట మధ్య, మద్దిరాల - గోపాళంవారిపాలెం, కుప్పగంజివాగుపై మద్దిరాల - గోపాళంవారిపాలెం గ్రామాల మధ్య బ్రిడ్జిలు నిర్మించారు. పంటపొలాలకు సాగునీటి ఆయకట్టు పరిధిని పెంపొందించేందుకు బొప్పూడి-3, 4, పసుమర్రు-2, మానుకొండవారిపాలెం, గోపాళంవారిపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటుకు నిధులు, యడవల్లి ఎస్సీల భూములను సాగులోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేక లిఫ్ట్ ఇరిగేషన్‌లను ఏర్పాటు చేయించారు.  
 
  అపర భగీరధుడు
 అచ్చంపేట : దివంగతనేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అచ్చంపేట మండలానికి బహుళ ప్రయోజనాలు సమకూరాయి. ముఖ్యమంత్రిగా ఉన్న ఆరేళ్లకాలంలో రెండుసార్లు మండలానికి వచ్చారు. తాగునీటి కష్టాలు తీర్చేందుకు పుట్లగూడెం వద్ద రక్షిత మంచినీటి పథకం ఏర్పాటు ఆయన చలవే. రైతులు ఏడాదిలో రెండు పంటలు పండించుకునేందుకు నాలుగు ఎత్తిపోతల పథకాలు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, పులిచింతల ప్రాజెక్టు నిర్మాణానికి ఆయన చేసిన కృషి ఇక్కడి ప్రజలు మరచిపోరు. చెంతనే కృష్ణానది పారుతున్నా మంచినీటికి నోచుకోని 14 గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు పుట్లగూడెం కృష్ణానది వద్ద రక్షిత మంచినీటి పథకానికి రూ.8 కోట్లు మంజూరు చేయించారు. జలయజ్ఞంలో భాగంగా మండలంలోని మాదిపాడు పంచాయతీ పంధిలోగల చట్టుబడి మోటు తండా వద్ద మహానేత వైఎస్సార్ పులిచింతల ప్రాజెక్టు నిర్మాణానికి అంకురార్పణ చేశారు.
 
 ఏడాదిలో రైతులు రెండు పంటలు పండించుకోవాలనే లక్ష్యంతో కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో నాలుగు ఎత్తిపోతల పథకాలకు మహానేత రూపకల్పన చేశారు. మండలంలోని గింజుపల్లి ఎత్తిపోతల పథకానికి రూ.3 కోట్లు మంజూరు చేయించారు. అదేవిధంగా గ్రంథశిరిలో ఎత్తిపోతల పథక నిర్మాణానికి రూ.17 కోట్లు మంజూరు అయ్యాయి. వేల్పూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముకు రూ.67కోట్లు, పెదపాలెం స్కీముకు రూ.29కోట్లతో  దివంగత నేత వైఎస్సార్ అంచనాలు తయారు చేయించారు. ఈ రెండు ప్రాజెక్టులకు కూడా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ శిలాఫలకాలను 2008, జూన్ 5 ఆవిష్కరించారు. మహానేత ముఖ్యమంత్రి ఉండగానే మండలానికి ఇన్ని పథకాలు సాధ్యపడ్డాయ ప్రజలు విశ్వసిస్తున్నారు.
 
 నేడు వర్ధంతి కార్యక్రమాలు
 మహానేత సేవలను ఆయన వర్ధంతి (సెప్టెంబర్ 2) సోమవారం స్మరించుకునేందుకు వైఎస్సార్ సీపీ నేతలు  ఏర్పాట్లు చేశారు. భారీ అన్నదాన కార్యక్రమాలతో పాటు రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నారు.   వైఎస్ రాజశేఖరరెడ్డి ఉండి ఉంటే రాష్ట్రానికి ఈ దుర్గతి పట్టేది కాదని ప్రతిఒక్కరూ వ్యాఖ్యానిస్తున్నారు. సాక్షాత్తూ దేశ ప్రధాని చేసిన వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా ఉటంకిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement