నిద్ర కరువై నలిగిపోతున్న నగరవాసి
మానసిక ఒత్తిళ్లతో సతమతం
ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం
కెరీర్‌లోనూ వెనకడుగు
నేడు వరల్డ్ స్లీప్ డే
పొద్దుట్నుంచీ కంప్యూటర్‌కు అతుక్కుపోయిన కళ్లు రాత్రయినా మూతపడనంటున్నాయ్.. రేపటి మీటింగ్‌లూ, ప్లాన్‌లతో వేడెక్కిపోయిన మెదడు ఆలోచనల చట్రం నుంచి బయటకు రానంటోంది.. ఏసీలూ, కుషన్ సీట్ల పుణ్యాన అలసట రుచి ఎరుగని శరీరం విశ్రాంతికి సిద్ధమవ్వడం లేదు.. వెరసి... నగరవాసికి కునుకు ప్రియమవుతోంది. ఆరోగ్యంగా జీవించడానికి అవసరమైన 8 గంటల నిద్ర అనేది అందని ద్రాక్షే అవుతోంది. అన్ని సౌకర్యాలు ఉండి కూడా కాసింత నిద్రకు నోచుకోని కోటీశ్వరులు, ఉన్నతోద్యోగులు నగరంలో చాలామంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. నిద్ర కోసం మందే మందు అనుకునే మందుబాబులు, నిద్రమాత్రలు, మత్తు ఇంజెక్షన్లతో నిద్రకు దగ్గర కావాలని ఆరాటపడేవారు కోకొల్లలు. అందుకే బ్యాంక్ బాలెన్సులున్న కుబేరుల కన్నా కంటి నిండా నిద్రపోగలిగిన పేదవాడే అధిక సంపన్నుడని అంటుంటారు. -విశాఖ-కల్చరల్
‘నిద్ర సుఖమెరుగదు’ అన్నారు పెద్దలు. ‘అసలు సుఖనిద్ర అనేదే మేమెరుగం’ అంటున్నారు ఆధునికులు. రోజువారీ లక్ష్యాల మధ్య సరైన నిద్ర కోసం అల్లాడుతున్న నగరవాసులు... ‘నిదురమ్మా... నువ్వెక్కడమ్మా..!’ అంటూ అన్వేషిస్తున్నారు. నిద్రాభంగానికి గురవుతున్న వారిలో వారు వీరని తేడా లేదు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల నుంచి శాస్త్రవేత్తల దాకా, డిజైనర్ల నుంచి డిస్ట్రిబ్యూటర్ల వరకు ప్రతి ఒక్కరిదీ ఇదే పరిస్థితి. దీనికి కారణాలను నిపుణులు ఇలా విశ్లేషిస్తున్నారు...
ప్రతి రంగంలోనూ పోటీ తీవ్రమవుతుండడం, విజయాలు సాధించాలనే తపన, తరచుగా లక్ష్యాలను పెంచుకుంటూ పోవడం... ఇలాంటి కారణాల వల్ల మెదడు సామర్థ్యానికి మించి పనిచేయాల్సి రావడం... వ్యక్తిని మానసికంగా తీవ్రమైన అశాంతికి గురిచేస్తున్నాయి. పొద్దస్తమానం అలజడికి అలవాటుపడిన మనసు మంచం ఎక్కగానే ఒక్కసారిగా మత్తులోకి జారిపోవడం కష్టం. మరోవైపు సమయానికి నిద్ర రాకపోతే రేపు లేవడం ఆలస్యమవుతుందని, పనులు సరిగా చేయలేమేమోననే ఆందోళన మరింతగా కునుకును దూరం చేస్తోంది. అలాగే శరీరానికి అవసరమైన కనీస శ్రమ లేకపోవడం, చెమట పట్టే పనులు చేయకపోవడం వల్ల రక్తప్రసరణ సమస్యలు ఏర్పడడం, విశ్రాంతి పొందాలనేంత పరిస్థితిని శరీరానికి కల్పించకపోవడం, టీవీలు, కంప్యూటర్‌లకు గంటల తరబడి కళ్లను అప్పగించడం... ఇవన్నీ మంచి నిద్రను దూరం చేసే కారణాలే.
రోడ్డు ప్రమాదాల్లో కీలక పాత్ర
380 రోడ్డు ప్రమాదాలను కేస్‌గా తీసుకుని ఇటీవల ఎయిమ్స్ ఓ స్టడీని నిర్వహించింది. వీటికి కారణమైన కమర్షియల్ డ్రైవర్స్‌కు నిద్ర వేళలు సరిగా లేవని గుర్తించారు. వీరిలో 60 శాతం మంది అంతకు ముందురోజు రాత్రి సరిగా నిద్రపోలేదని తేలింది.
ఆరోగ్య నిద్రకు ఇవిగో మార్గాలు
సాధారణంగా ప్రతి మనిషికి ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం. ఇది నిరంతరాయంగా ఈ నిద్ర నిరంతరాయంగా ఉండాలి. పగలు కాస్సేపు రాత్రి కాస్సేపు పడుకుని ఆరుగంటలు పడుకున్నాం కదా అని భావించకూడదు. కొందరు అంతరాయంగా నిద్రపోతుంటారు. తరచూ లేస్తుంటారు. కొందరు ఆలస్యంగా పడుకుని ఆలస్యంగా లేస్తుంటారు. కొందరు వేకువజామున మరీ తొందరగా లేస్తుంటారు. ఏమైనప్పటికీ నిద్రను నిర్దిష్టసమయంలో బయోలాజికల్ క్లాక్‌లా అలవాటు చేసుకోవాలి. నిద్ర లేమి వల్ల మానసిక సమతుల్యత దెబ్బతింటుంది. నిత్యజీవనంపై దీనిప్రభావం కనిపిస్తుంది. మానసిక శారీకర రుగ్మతలకు హేతవు అవుతుంది.
ఈ జాగ్రత్తలు తీసుకుంటే మేలు
నిద్ర పట్టకుండా చేసే కాఫీ..టీలు పరిహరించాలి
మసాలాతో కూడిన ఆహారం రాత్రి పూట భుజించ కూడదు. తేలికపాటి ఆహారం ఉత్తమం
పడుకునే ముందు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి
నిద్ర సమయంలో మెదడుకు పెద్దగా పనిచెప్పకూడదు. టీవీలు చూడటం లాంటివి మంచివి కాదు.
సాయంత్రం కాస్సేపు నడిస్తే ప్రశాంతంగా నిద్రపడుతుంది.
పడక గది కూడా మన అభిరుచికి అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి.
నిద్రమాత్రలకు దూరంగా ఉంటే మంచిది.
-డాక్టర్ ఎన్.ఎన్.రాజు
మానసిక వైద్య నిపుణుడు
సర్వేలు ఏం చెబుతున్నాయి...
తాజాగా ఏసీ నీల్సన్-ఫిలిప్స్ సంస్థలు విశాఖపట్నం, హైదరాబాద్‌తోసహా 25 నగరాలలో సర్వే నిర్వహించాయి. 35 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కుల్లో నిర్వహించిన దీని ఫలితాల ప్రకారం... నగరాల్లో 93 శాతం మంది 8 గంటల నిద్రకు నోచుకోవడం లేదు. విచిత్రమేమిటంటే వీరిలో 2 శాతం మంది మాత్రమే తమ నిద్రలేమి గురించి వైద్యులతో ప్రస్తావిస్తున్నారు. దీనివల్ల 15 శాతం మంది ఏకాగ్రత లోపానికి గురవుతుంటే... 62 శాతం మంది అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా... అనే (నిద్ర కరవైతే వచ్చే అనారోగ్యం) సమస్య బారిన పడతున్నారు. నిద్ర సరిగా లేక తమ పని పాడవుతోందని వీరిలో 58 శాతం మంది అంటున్నారు. ఇక 11 శాతం మంది పనిచేసే సమయంలో నిద్ర కమ్మేస్తోందని అంటున్నారు. నిద్రపోయే సమయంలో 1 నుంచి 3 సార్లు మెలకువ వస్తోందని 72 శాతం మంది చెప్పడం ద్వారా తమది కలత నిద్ర అని చెప్పకనే చెప్పారు.
నిద్ర కోసం టూర్‌కు వెళుతున్నా..
బీచ్ రోడ్డులోని మా కేఫ్ ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకూ ఉంటుంది. ఆ తర్వాత ఆ రోజు అకౌంట్స్, రేపటి ప్రిపరేషన్ వగైరా పనులన్నీ పూర్తి చేసుకుని మద్దలపాలెంలోని మా ఇంటికి చేరటప్పటికి ఒంటిగంట అయిపోతుంది. ఆ తర్వాత మంచం ఎక్కి నిద్రకు ఉపక్రమించేటప్పటికి మరో అరగంట, నిద్రలోకి వెళ్లేటప్పటికి మరో అరగంట... మొత్తం మీద సగ టున రోజూ అర్ధరాత్రి దాటి 2 గంటలైతే గానీ నిద్రలోకి వెళ్లం. తిరిగి పొద్దున్నే 7 గంటలకు లేవకపోతే ఈ ట్రాఫిక్‌లో అనుకున్న సమయానికి రెస్టారెంట్‌కు చేరుకోలేం. మొత్తం మీద రోజూ 5 గంటలు నిద్రపోతే బాగా నిద్రపోయినట్టే. ఆదివారాలు కూడా సెలవుండదు కాబట్టి వారమంతా ఇదే పరిస్థితి. అందుకే ఒళ్లెరగని నిద్ర కోసం నెలకో, రెణ్నెల్లకో బ్రేక్ తీసుకుని ఏదో ఒక ప్రయాణం పెట్టుకుంటున్నా.
- కె.సురేష్ కుమార్,
కేఫ్ యజమాని
నిద్ర‘యోగ’ం
యోగాతో ప్రశాంతంగా నిద్రపోవచ్చు. రోజూ ఉదయం నిర్దేశిత సమయంలో సూర్యనమస్కారాలు చేయాల్సి ఉంటుంది. ఇది క్రమం తప్పకుండా చేయాలి. దీనివల్ల నరాలన్నీ చేతనమవుతాయి. ఫలితంగా శరీర వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. ఇది నిద్రకు ఎంతో ఉపకరిస్తుంది. అలాగే భ్రమరీ ప్రాణాయామం కూడా చేయాలి. ఈ శ్వాసప్రక్రియ చాలా ప్రభావవంతమైంది. ఇది కూడా సుఖ నిద్రకు సహకరిస్తుంది. ఇక ధ్యానం వల్ల ఒనగూరే ప్రయోజనం చాలా ఎక్కువ. యోగాలో ప్రతి ప్రక్రియా శరీరాన్ని క్రమపద్ధతిలో ఉంచేదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇన్‌సోమ్నియాతో బాధపడేవారికి యోగా ప్రక్రియ ఇతోధికంగా ఉపయోగపడుతుంది. ఆధునిక వ్యవస్థలో నిద్రలేమితో వచ్చేవే సగం రోగాలు. దీనికి యోగాసనాలు మంచి చిట్కా
-పెనుమర్తి ప్రశాంతి,
యోగా కౌన్సిలర్, విశాఖపట్నం
మంచి నిద్రతో ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు
అందానికి, ఆరోగ్యానికి, నిద్రకు ప్రత్యక్ష సంబంధం ఉంది. తగినంత నిద్ర లేకపోతే దాని ప్రభావం శరీరారోగ్యంపై పడుతుంది. నిద్రలో అనేక శరీర కణాలు రిపేరు జరుగుతాయి. కొత్త కణాలు తయారవుతాయి. కొత్త కణాలు కొత్త అందాన్నిస్తాయి. మెమరీ పవర్: నిద్ర సమయంలో మెదడు విశ్రాంతి పొందడం వల్ల మెమరీ పవర్ పెరుగుతుంది. ఏదైనా ఒక మంచి పని చేయాలనుకున్నా, నేర్చుకోవాలనుకొన్నా మంచిగా నిద్రపోయి లేవడం వల్ల కొత్త ఐడియాలతో చురుకుగా పని చేయగలగుతాం. సృజనాత్మకత: మంచి నిద్ర పొందడం వల్ల మెదడు పునఃవ్యవస్థీకరణ, వాటిని పునరుద్ధరించుకునేందుకు అలాగే మరింత సృజనాత్మకత కారణం కావచ్చు. కళాకారులకు మాత్రమే కాదు పనిచేసే ప్రతి ఒక్కరికీ సృజనాత్మకత పెరుగుతుంది. కొత్త కొత్త ఐడియాలను పొంది వారిలో దాగున్న క్రియేటివటీ బయటకు తీస్తారు.నిద్ర లేనివారిలో కొన్ని హార్మోన్లు రక్తంలో కలసి, ఆకలిని పెంచుతాయి. సరైన నిద్రలేనప్పుడు ఆకలి పెరగడం వల్ల బరువు తగ్గే చాన్సే ఉండదు. నిద్ర చాలా అవసరం.
డిప్రెషన్: సరైన నిద్ర లేకపోవడం వల్ల మన ఓవరాల్ హెల్త్‌కు అవరోధం కలుగుతుంది. నిద్ర లేమితో వెనుకబడి నిరాశ నిస్పృహలకు లోనవుతారు. మంచి నిద్రను పొందడం వల్ల వ్యక్తి మూడ్ మారుతుంది. ఆందోళన తగ్గుతుంది. భావోద్వేగాలను తగ్గించుకుంటారు.
మధుమేహం: నిద్రలేమి టైప్2 డయాబెటిస్‌కు దారితీస్తుంది. రక్తంలోని ఇన్సులిన్ స్థాయి తగ్గి హార్మోన్లపై ప్రభావం చూపుతుంది.
హెయిర్ ఫాల్: నిద్రలేమితో వివిధ ఆలోచనలు మదిలో మెదిలి మెద డు మీద ఒత్తిడి కలిగి హార్మోన్ల లోపంతో జుత్తు రాలిపోతుంది.
హృద్రోగం : సరైన నిద్రలేకపోవడం వల్ల హృదయ వ్యవస్థ మందగిస్తుంది. రక్తనాళాలు, ధమనుల రక్తం సరిగా ప్రసవరణ జరగక గుండె సంబంధిత వ్యాధులు రావడానికి కారణమవుతాయి.
కృత్రిమ సాధనాలు వద్దు: నిద్రకు కృత్రిమమైన సాధనాలు ఉపయోగిస్తే మరికొన్ని కొత్త సమస్యలు తోడవుతాయి.
గుడ్ స్లీప్.. స్వీట్ డ్రీమ్స్
Published Fri, Mar 13 2015 1:43 AM | Last Updated on Sat, Sep 2 2017 10:43 PM
Advertisement
Advertisement