కొత్తపల్లి మండలం వాకతిప్పలో గత నెల 20న సంభవించిన బాణసంచా పేలుడు ఘటనపై సోమవారం మేజిస్టీరియల్ విచారణ నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం వాకతిప్పలో గత నెల 20న సంభవించిన బాణసంచా పేలుడు ఘటనపై సోమవారం మేజిస్టీరియల్ విచారణ నిర్వహిస్తున్నారు. బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ఈ దుర్ఘటనలో 18 మంది మృత్యువాత పడగా, ముగ్గురికి తీవ్ర గాయాలైన సంగతి విదితమే. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సంఘటన స్థలాన్ని పరిశీలించి, మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించి మేజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు.
కాకినాడ ఆర్డీఓ అంబేద్కర్ స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి విచారణ నిర్వహిస్తారు. పేలుడు ఘటనపై ఎటువంటి అనుమానాలున్నా, సంఘటనకు సంబంధించి ఆధారాలున్నా నిర్భయంగా తమకు తెలియజేయవచ్చని చెప్పారు. ఇప్పటికే సంఘటన జరిగిన శ్రీమణికంఠ ఫైర్ వర్క్స్‌కు అన్ని అనుమతులను రద్దు చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.