సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రాష్ట్ర సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల సంఘం శనివారం నుంచి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. ఈనెల 19వ తేదీలోపు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. 21న రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు పరిశీలించనున్నారు. 23వ తేదీ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ జరుగుతుంది.
అనంతరం ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్ధులను ప్రకటించనున్నారు. మే 7వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 16వ తేదీ ఓట్లు లెక్కిస్తారు. గెలుపొందిన వారి వివరాలను ప్రకటించినప్పటికీ మే 28వ తేదీ వరకు జిల్లాలో ఎన్నికల ప్రక్రియ సాగుతుంది.
నామినేషన్లు వేసేందుకు ఇప్పటికే నేతలు మంచి రోజులు చూసుకుంటున్నారు. జిల్లాలో 12 శాసనసభా నియోజకవర్గాలుండగా, మూడు లోక్‌సభ స్థానాలున్నాయి. ఒంగోలు, బాపట్ల, నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గాలకు జిల్లాలోని నియోజకవర్గాల ప్రాతినిధ్యం ఉంది.
జిల్లాలో మొత్తం 24,09,910 మంది ఓటర్లుండగా, వీరిలో మహిళలు 12,07,814 మంది ఉండగా, పురుషులు, 11,94,231 మంది ఉన్నారు. ఇంకా సర్వీసు ఓటర్లు మహిళలు 2,269 మంది ఉండగా, పురుషులు 5,459 మంది ఉన్నారు. వీరు కాకుండా ఇతరులు 136 మందితో పాటు చీరాలలో ఒక ఎన్‌ఆర్‌ఐ ఓటరు కూడా ఉన్నారు.
ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ, కాంగ్రెస్‌తోపాటు జైసమైక్యాంధ్ర, సీపీఐ, సీపీఎం, లోక్‌సత్తా పార్టీలు తమ అభ్యర్థులతో నామినేషన్లు వేయించే పనిలో ఉన్నారు. ఇప్పటికే టీడీపీ నాలుగు నియోజకవర్గాలకు, సీపీఎం రెండు నియోజకవర్గాలకు తమ అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన పార్టీలు నేడో, రేపో అభ్యర్థులు జాబితాను విడుదల చేయనున్నాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభ్యర్థులతో నిమిత్తం లేకుండా, పార్టీకి ఓటు వేయాలని కోరుతూ ప్రచారం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. అభ్యర్థులు మాత్రం ఎవరికి వారే గెలుపుపై ధీమాగా ఉన్నారు. అన్ని పార్టీలు శనివారం నుంచే ప్రచారం ప్రారంభించడానికి సన్నద్ధమవుతున్నాయి.
ఎన్నికల నిర్వహణకు పారామిలిటరీ బలగాలను దించుతున్నారు. పారామిలిటరీ పోలీసులు ఎన్నికలకు వారం రోజుల ముందే జిల్లాకు చేరుకోనున్నారు. పోలింగ్ నిర్వహణకు జిల్లా ఎన్నికల అధికారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను సిద్ధం చేస్తున్నారు. వీటిలో లోపాలు ఏర్పడితే, వెంటనే మరో ఈవీఎంను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈవీఎంలపై ఎన్నికల సిబ్బందికి త్వరలో తరగతులు కూడా నిర్వహించ నున్నారు. ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో, హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.
ఇక సార్వత్రిక సమరం
Published Sat, Apr 12 2014 3:07 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement