జననేతను చూసేందుకు పల్లెలన్నీ వెల్లువెత్తాయి. ఆత్మీయ నాయకుడికి ఆనందంగా స్వాగతం పలికాయి. జగన్‌ను చూడగానే జనం ఉప్పొంగారు.
=దారి పొడవునా స్వాగతం
=కర్ణాటక సరిహద్దు నుంచే పెల్లుబికిన అభిమానం
=అందరితో ఆప్యాయంగా మాట్లాడిన జగన్
జననేతను చూసేందుకు పల్లెలన్నీ వెల్లువెత్తాయి. ఆత్మీయ నాయకుడికి ఆనందంగా స్వాగతం పలికాయి. జగన్‌ను చూడగానే జనం ఉప్పొంగారు. పసిబిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు జేజేలు పలికారు.
సాక్షి, తిరుపతి: జిల్లాలో జననేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. శుక్రవారం పలమనేరు నియోజకవర్గంలో చేపట్టిన రెండో విడత సమైక్య శంఖారావానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. రోడ్లపై గంటల తరబడి జననేత కోసం ఎదురు చూశారు. ఆయన రాగానే బాణా సంచా పేల్చి, పూలమాలలు వేసి అభిమానం చాటుకున్నారు. ఆయన ఏ గ్రామం వెళ్లినా ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కోసం కర్ణాటక సరిహద్దు గ్రామం నంగిలి వద్ద అభిమానులు పెద్ద సంఖ్యలో గజమాలతో ఎదురు చూశారు. సరిగ్గా 11.15 గంటలకు ఆయన నంగిలి చేరుకోగానే బాణా సంచా పేల్చి ఆహ్వానించారు. కర్ణాటకకు చెందిన జనతాదళ్ ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు జగన్‌మోహన్‌రెడ్డిని అక్కున చేర్చుకున్నారు. శనిగపల్లి సర్పంచ్ ప్రకాష్ రెడ్డి, మాజీ సర్పంచ్ అశోక్ రెడ్డి, జెడ్పీటీసీ శ్రీనివాసులుతో పాటు, రెడ్డీస్ యూత్ అసోసియేషన్ మోహన్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.
అక్కడి నుంచి బయలుదేరి ఆంధ్ర సరిహద్దు జంగాలపల్లె వద్దకు చేరుకోగానే ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు ఏఎస్.మనోహర్, సుబ్రమణ్యంరెడ్డి, షమీమ్ అస్లాం, ఆదిమూలం, బియ్యపు మధుసూదన్ రెడ్డి, తిరుపతి పార్లమెంటరీ పరిశీలకుడు వరప్రసాదరావు, కాణిపాకం మాజీ ఈవో కేశవులు, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ రెడ్డెమ్మ తదితరులు స్వాగతం పలికారు. అప్పటికే జగన్‌మోహన్‌రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి బెంగళూరు నుంచి కాన్వాయ్‌లో వచ్చారు.
అక్కడి నుంచి అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో సమైక్య శంఖారావం యాత్రను జననేత ప్రారంభించారు. గంగవరం మండలం ఆలకుప్పం గ్రామం వద్ద వేచి ఉన్న అభిమానులను అప్యాయంగా పలకరించారు. ఆయనకు పార్టీ నాయకులు రాజప్ప, కిశోర్‌నాయుడు స్వాగతం పలికారు. సమీపంలోని హెచ్2 అప్పిరల్స్ పరిశ్రమ వద్దకు చేరుకుని, అక్కడ పని చేస్తున్న వారిని పలకరించారు. అనంతరం పెద్దఊగిని గ్రామంలో వేచి ఉన్న ముస్లిం మహిళల వద్ద వాహనం దిగి మాట్లాడారు. గుండ్రాజుపల్లె ఏబీ ఇండ్ల దగ్గర భాస్కర్, రాజన్న తదితరులు ఓంశక్తి మాల వేసుకున్న మహిళలతో కలసి హారతులతో స్వాగతం పలికారు.
పొన్నమాకులపల్లె వద్ద భారీ ఎత్తున బాణా సంచా పేల్చారు. అక్కడ పార్టీ జెండా ఆవిష్కరించారు. కేలపల్లె క్రాస్ వద్ద సైతం జనం గుమిగూడారు. పత్తికొండకు చేరుకుని అక్కడ వైఎస్‌ఆర్ విగ్రహవిష్కరణ చేసి, సభలో ప్రసంగించారు. పార్టీ నాయకుడు కిరణ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో జరిగిన సభకు వేలాది మంది హాజరయ్యారు. అటుకుమాకులపల్లె వద్ద వికలాంగ అభిమానులను పలకరించారు. క్యాటల్ ఫాం వద్ద వేలమంది జగన్‌మోహన్‌రెడ్డిని ఆహ్వానించారు. అక్కడే ఎమ్మాసిస్ ఫ్యాక్టరీ కార్మికులను, పాలిటెక్నిక్, వెటర్నరీ విద్యార్థులను పలకరించారు. ‘బాగా చదువుకోవాలి’ అని విద్యార్థులకు సూచనలిచ్చారు.
అక్కడి నుంచి ప్రతి వంద అడుగులకు ఒక బృందం నిల్చుని, జగన్‌మోహన్‌రె డ్డి కాన్వాయ్‌ని అడ్డుకుని మాట్లాడి పంపించారు. నక్కపల్లి వద్ద మహానేత వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పలువురు వృద్ధులు జననేతతో మాట్లాడే యత్నం చేశారు. అక్కడి నుంచి గాంధీనగర్ మీదుగా కొలమాసనపల్లె చేరుకున్నారు. అక్కడ పెద్ద ఎత్తున టపాకాయలు పేల్చారు. కొద్దిసేపు అభిమానులను ఉద్దేశించి జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు.
చిన్న పిల్లలు, విద్యార్థుల తలపై చేతులు పెట్టి ఆశీర్వదించడంతో వారు ఉబ్బి తబ్బిబ్బయ్యారు. సమీపంలో ఉన్న పార్టీ నాయకురాలు రత్నారెడ్డి ఇంటికి వెళ్లి కాసేపు విరామం తర్వాత శంకర్రాయలపేటకు చేరుకున్నారు. అక్కడ ఉన్న అభిమానులతో కొద్దిసేపు గడిపి, అప్పినిపల్లె చేరుకుని, చేలూరి జగన్నాథం కుటుంబాన్ని ఓదార్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఓవీ.రమణ, ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి, డాక్టర్ సునీల్ కుమార్, రవిప్రసాద్, పుణ్యమూర్తి, పూర్ణంతో పాటు యువజన కన్వీనర్ ఉదయకుమార్, చిందేపల్లి మధుసూదన్ రెడ్డి, వైఎస్‌ఆర్ సేవాద ళ్ నాయకుడు చొక్కారెడ్డి జగదీశ్వరరెడ్డి, హర్ష, వై.సురేష్ పాల్గొన్నారు.