
సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ నేతలు
అనంతపురం, రాప్తాడు: దివంగత మాజీ మంత్రి పరిటాల రవీంద్ర హయాంలో మాదిరే ప్రస్తుత మంత్రి పరిటాల సునీత పాలన కూడా అరాచకాలు, దౌర్జన్యాలతోనే సాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి సాకే నారాయణ, రాప్తాడ మండల కన్వీనర్ బోయ రామాంజినేయులు, యువజన విభాగం మండల కన్వీనర్ చిట్రెడ్డి సత్యనారాయణరెడ్డి ధ్వజమెత్తారు. రాప్తాడు నియోజకవర్గంలో ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నదీ పరిటాల కుటుంబమేనని అన్నారు. మరూరులో టీడీపీ కార్యకర్త కురుబ సామాజిక వర్గానికి చెందిన బాబయ్య స్థలాన్ని అదే పార్టీ వర్గీయులే కక్ష కట్టారన్నారు.
దౌర్జన్యంగా బాబయ్య స్థలం లాక్కునేందుకు చేస్తున్న ప్రయత్నంపై ‘పన్నెండేళ్ల కక్ష’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి వైఎస్సార్‌సీపీ నాయకులు స్పందించారు. బుధవారం మండల కేంద్రం రాప్తాడులో విలేకరులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీలో బీసీలకు పేద్ద పీట వేస్తున్నామని చెబుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు మరూరులో బాబయ్యపై ఆ పార్టీకి చెందిన పరిటాల వర్గీయులు దాడి చేస్తే నోరు మెదపడం లేదని మండిపడ్డారు. మంత్రి పరిటాల సునీత ఆమె తనయుడు పరిటాల శ్రీరాం, సోదరుడు ధర్మవరపు మురళి కలుగజేసుకొని స్థలాన్ని ఆ పార్టీ నేతలకు చెందేలా అధికారులపై ఒత్తిడి తేవడంతో అధికారులు కూడా విధులు నిర్వర్తించలేక సెలవుపై వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఫ్యాక్షన్ పేరుతో మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరాం అలజడులు సృష్టిస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో పరిటాల కుటుంబం బీసీలను టార్గెట్ చేస్తూ బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఆరోపించారు.
దాడుల్లో మచ్చుకు కొన్ని..
♦ రాప్తాడు పండమేరు వంకలో బోయ ఓబులేస్‌పై పరిటాల శ్రీరాం డ్రైవర్ డాడి చేశాడు.
♦ రామగిరి మండలం పేరూరులో సుబ్బు క్రిష్టపై దాడి చేశారు.
♦ కనగానపల్లి ఎంపీడీఓ కార్యాలయం కంప్యూటర్ ఆపరేటర్‌పై ఎంపీపీ పద్మాగీత భర్త ముకుంద నాయుడు దాడి, వాటర్‌షెడ్ ఫీల్డ్ అసిస్టెంట్ కుళ్లాయప్పపై ముకుందనాయుడు అనుచరుల దాడి చేశారు. తూంచెర్లలో అంగన్‌వాడీ కార్యకర్త గాలెమ్మపై టీడీపీ నాయకుల దాడి చేసి గాయపరిచారు. కొండ్రెడ్డిబాయికి చెందిన సూరిపై టీడీపీ నాయకులు దాడి చేశారు.
♦ రామగిరి మండలం నసనకోటలో ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీ తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి తిరిగాడని బోయ సూర్యంపై పరిటాల శ్రీరాం, ఆయన అనుచురులు మాదాపురం శంకర్, కొత్తపల్లి శివకుమార్, పరంధామ యాదవ్ దాడి చేశారు.
♦ అనంతపురం మండలం చంద్రబాబునగర్‌కు చెందిన నరసింహులును మూడు సెంట్ల స్థలం కోసం టీడీపీకి చెందిన వారు హత్య చేశారు.
♦ ఆత్మకూరు మండలం వేపచెర్ల తండాకు చెందిన కేశవనాయక్‌ను భూ తగాదాల నేపథ్యంలో టీడీపీ నాయకులు మట్టుబెట్టారు.
♦ రాప్తాడులో వైఎస్సార్‌సీపీ మండల మాజీ కన్వీ నర్ భూమిరెడ్డి శివప్రసాద్‌రెడ్డి, అనంతపురం రూరల్ మండలం కందుకూరులో వైఎస్సార్‌సీపీ నేత శివారెడ్డిని అంత్యంత కిరాతంగా పరిటాల కుటంబం హత్య చేయించింది.
మహిళలకూ భద్రత కరువు
మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో మహిళలకు భద్రత కరువైందని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. గొందిరెడ్డిపల్లిలో భూ సమస్యపై ఇద్దరు మహిళలు, యర్రగుంటలో మాజీ స్టోర్ డీలర్ భార్యపై టీడీపీ నాయకులు దాడి చేసి గాయపరిచారన్నారు. ఇలా పరిటాల వర్గీయులు అనేక మంది బీసీ నేతలపై దాడులు చేశారని గుర్తు చేశారు. పరిటాల కుటుంబం, టీడీపీ నాయకుల దౌర్జన్యాలకు చరమగీతం పాడాలని, వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు దండు రామాంజినేయులు, జూటూరు శేఖర్, చెర్లోపల్లి శేఖర్, ఉమాపతి, రమేష్, నాగరాజు, గోర్ల కేశవ రెడ్డి, విజయ్ వర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేడు రాప్తాడులో కురుబల ధర్నా
స్థల విషయంలో టీడీపీ కార్యకర్త బాబయ్యకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ కురుబ కులస్తులు గురువారం రాప్తాడులో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు పిలుపునిచ్చారు. బాబయ్యపై దౌర్జన్యం చేసిన వారిపై చర్యలు తీసుకుని, బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నేటి ధర్నాకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రకటించారు.