నిర్మాణాత్మక అడుగులు
- వైఎస్సార్ సీపీ సమీక్ష సమావేశం నేడు
- ఎన్నికల్లో గెలుపోటములకు దారితీసిన పరిస్థితులపై అధ్యయనం
- జిల్లాకు రానున్న త్రిసభ్య కమిటీ
సాక్షి ప్రతినిధి, ఒంగోలు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జయాపజయాలకు దారితీసిన పరిస్థితులపై సమీక్షించేందుకు గురువారం త్రిసభ్య కమిటీ ఒంగోలు రానుంది. ప్రకాశం జిల్లా సమీక్ష సమావేశాలు నిర్వహించేందుకు సీనియర్ నేతలు తమ్మినేని సీతారాం, మర్రి రాజశేఖర్, కాకాణి గోవర్ధన్‌రెడ్డి గురువారం ఉదయం ఒంగోలు చేరుకోనున్నారు. వీరు జిల్లాలోని 12 నియోజకవర్గాల పార్టీ అభ్యర్థులతో సమావేశం కానున్నారు. ప్రతి నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థితో ప్రత్యేకంగా సమావేశమై..జయాపజయాలకు దారి తీసిన పరిస్థితులపై సమీక్షిస్తారు.
- పార్టీ జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ ఇప్పటికే నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు వర్తమానం పంపించారు.
- జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి, అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్, కొండపి నుంచి జూపూడి ప్రభాకరరావు, దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, మార్కాపురం నుంచి జంకె వెంకటరెడ్డి, కనిగిరి నుంచి బుర్రా మధుసూదన్ యాదవ్, కందుకూరు నుంచి పోతుల రామారావు, సంతనూతలపాడు నుంచి ఆదిమూలపు సురేష్, గిద్దలూరు నుంచి ముత్తుముల అశోక్‌రెడ్డి, చీరాల నుంచి యడం బాలాజీ, పర్చూరు నుంచి గొట్టిపాటి భరత్, యర్రగొండ పాలెం నుంచి డేవిడ్‌రాజు ఈ సమీక్ష సమావేశాల్లో పాల్గొంటారు. ఎంపీ అభ్యర్థులు వైవీ.సుబ్బారెడ్డి, అమృతపాణిలు కూడా సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంది.
- అనివార్య కారణాల వల్ల ఒకరిద్దరు అభ్యర్థులు హాజరు కాలేకపోయినా, సదరు అభ్యర్థి సూచించిన నాయకుడు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొననున్నారు.
- ఏ ఏ పరిస్థితులు గెలుపోటములకు దారి తీశాయనే విషయాలపై ఆరా తీస్తారు. అన్ని అంశాలపై లోతైన అధ్యయనం చేసి, పార్టీని నిర్మాణాత్మక దిశగా తీసుకెళ్లేందుకు సమీక్ష సమావేశాలు దోహద పడతాయని జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ ఈ సందర్భంగా తెలిపారు. అన్ని అంశాలపై సరైన విశ్లేషణ జరుగుతుందని, ఇవి పార్టీ బలోపేతానికి దోహదపడతాయని అన్నారు. ఉదయం 11.00 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు.