నేడు వైఎస్సార్‌సీపీ ‘సేవ్ డెమొక్రసీ’
శ్రీకాకుళం అర్బన్: ‘రాష్ట్రంలో ప్రతిపక్షమనేదే లేకుండా చేయాలి...ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఎలాగైనా మన పార్టీలోకి చేర్చుకోవాలి. అపుడే మనం అనుకున్నది సాధించుకోగలం’. ఇదీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాజకీయ కుయుక్తి. ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతున్న ఆయన ..టీడీపీ కోటరీ తీరును జనానికి వివరించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నడుం బిగించింది. ఇందులో భాగంగా ‘ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ(సేవ్ డెమొక్రసీ) నిరసన కార్యక్రమానికి పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమం శనివారం సాయంత్రం జరగనుంది.
జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన పార్టీ శ్రేణులు పాల్గొని ప్రభుత్వ దురాగతాలను తమ గళం ద్వారా ప్రజలకు వినిపించనున్నాయి. సీఎం చంద్రబాబు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేయడం రాజకీయ అనైకత కిందే వస్తుందని, చట్టాల్ని చేయాల్సిన నేతలే ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారంటూ సేవ్ డెమోక్రసీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి స్పష్టం చేశారు.
ఇవీ కార్యక్రమ వివరాలు
శ్రీకాకుళంలోని సూర్యమహల్ కూడలి వద్ద శనివారం సాయంత్రం 5.30గంటలకు జీటీ రోడ్డు మీదుగా వైఎస్సార్ కూడలి వరకూ కొవ్వొత్తులు, కాగడాల ర్యాలీ నిర్వహించనున్నారు. కార్యక్రమానికి పార్టీ ప్రధాన కార్యదర్శిధర్మాన ప్రసాదరావుతో పాటు పార్టీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం, పార్టీ బీసీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు, పార్టీ నేతలు పాలవలస రాజశేఖరం, జిల్లాలోని అన్ని నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ అనుబంధ విభాగాలు, పార్టీ శ్రేణులు పాల్గొననున్నాయి.