కుటిల నీతిపై కదన భేరి
అధికార టీడీపీ కుతంత్రంపై వైఎస్సార్‌సీపీ కన్నెర్ర
కాకినాడలో మార్మోగిన ‘సేవ్ డెమోక్రసీ’ నినాదం
ఫిరాయింపులను నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ
జిల్లా నలుమూలల నుంచీ తరలి వచ్చిన పార్టీ శ్రేణులు
కాకినాడ : అధికార తెలుగుదేశం పార్టీ తీరుపై నిరసన మిన్నంటింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడలో జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో జిల్లా నలుమూలల నుంచి తరలి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు ‘ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి- పార్టీ ఫిరాయింపు చట్టాన్ని అమలు చేయండి’ అంటూ కొవ్వొత్తులు చేతబట్టి నినాదాలు చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని కోకిల సెంటర్ నుంచి పద్మప్రియ, భానుగుడి జంక్షన్ మీదుగా కొవ్వొత్తులతో ర్యాలీ కొనసాగింది. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు, రాష్ట్ర, జిల్లా కమిటీల నేతలు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలతో కొవ్వొత్తుల ర్యాలీ జరుగుతున్న ప్రాంతం కిటకిటలాడింది. తొలుత కోకిల సెంటర్‌లోని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కాంస్య విగ్రహానికి కన్నబాబు, ఇతర నేతలు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ‘ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి, సేవ్ డెమోక్రసీ’ అనే నినాదాలతో ఉన్న ఫ్లెక్సీలు, బ్యానర్లు చేత బట్టి ర్యాలీగా భానుగుడి జంక్షన్‌కు చేరుకున్నారు.
రాజీనామాలు చేసి ఎన్నికల్లో గెలవాలి : కన్నబాబు
అధికార పార్టీ ప్రలోభాలకు లొంగి టీడీపీ లో చేరిన ఎమ్మెల్యేలకు ప్రజాస్వామ్య విలువలపై ఏ మాత్రం నమ్మకం ఉన్నా తక్షణమే రాజీనామా చేసి మళ్లీ ప్రజల తీర్పు కోరాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు డిమాండ్ చేశారు. సేవ్ డెమోక్రసీ ర్యాలీ సందర్భంగా భానుగుడి సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో ఆయన మాట్లాడారు. రాజ్యాంగానికి లోబడి పని చేస్తానని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు రాజ్యాంగ విలువలకు తిలోదకాలిచ్చి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షం బలంగా ఉంటే తమ అవినీతి అక్రమాలు బయటకు వస్తాయనే భయంతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు.
నైతిక విలువలపై ఏ మాత్రం విశ్వాసం లేని టీడీపీ అధినేత, పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలు భవిష్యత్‌లో శంకరగిరి మాన్యాలు పట్టడం తథ్యమని జోస్యం చెప్పారు. నిక్కచ్చిగా పనిచేసే నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు కొద్ది మందే ఉన్నా పార్టీకి అదే కొండంత బలమన్నారు. తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మాట్లాడుతూ కొద్ది మంది ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకున్నంతమాత్రాన తమ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదన్నారు. పార్టీలు మారిన ఎమ్మెల్యేలు గానీ, టీడీపీ చెందిన ఏ ఒక్క మంత్రైనా ముందుకు వస్తే తాను రాజీనామా చేసి వారిపై పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ఈ సవాల్‌ను స్వీకరించాలన్నారు. ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ గుర్తుపై గెలిచి పార్టీ మారడం అనైతికమని, తక్షణమే ఆయా ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్ళీ గెలిస్తే ప్రజలు కూడా హర్షిస్తారని అన్నారు.
లోకేష్ రాజ్యాంగేతరశక్తి : పినిపే
మాజీ మంత్రి, సీజీసీ సభ్యుడు పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ సంతలో పశువులను కొన్న చందంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసేలా ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతూ కిందిస్థాయిలో రాజ్యాంగేతర శక్తులుగా జన్మభూమి కమిటీలను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్నిఅవహేళన చేస్తున్నారంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ రాజ్యాంగేతర శక్తిగా పెత్తనం చెలాయిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ రాజకీయాల్లో నైతిక విలువలకు జగన్ ప్రాధాన్యతనిస్తే చంద్రబాబు ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిస్తున్నారని, ఇదే ఈ ఇద్దరి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసమని పేర్కొన్నారు.
నేరుగా ఏ ఒక్క ఎన్నికల్లోనూ పొత్తులేకుండా తెలుగుదేశం పోటీ చేయలేకపోతోందని, ప్రజల్లో ఆ పార్టీపై విశ్వాసం లేదనడానికి అదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ చంద్రబాబును రాష్ట్రానికి పట్టిన శనిగా అభివర్ణించారు. టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్ళాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాట్లాడుతూ రాజీనామాలు చేయకుండా పార్టీలు మారడం సరికాదని, దమ్ము, ధైర్యం ఉంటే ఎన్నికల కు వెళ్ళాలని అన్నారు. సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్తే రాళ్ళతో కొట్టే పరిస్థితి ఉందన్నారు.
సిగ్గుంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేసి ప్రజల తీర్పు కోరాలని డిమాండ్ చేశారు. అలా ఒక్క ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిచినా పార్టీ పదవికి రాజీనామా చేసేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. కాకినాడ సిటీ కో ఆర్డినేటర్ ముత్తా శశిధర్ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ, ఫ్యాన్ గుర్తు, మహానేత వైఎస్ ఆశయాల ప్రభావంతో ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీలు మారడాన్ని ఎద్దేవా చేశారు. చివరగా పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, కాకినాడ నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్ కుమార్ వందన సమర్పణ చేశారు.
ఆందోళనలో వివిధ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు తోట సుబ్బారావునాయుడు, గిరజాల వెంకటస్వామినాయుడు, ఆకుల వీర్రాజు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, వేగుళ్ళ పట్టాభిరామయ్యచౌదరి, వేగుళ్ళ లీలాకృష్ణ, అనంత ఉదయభాస్కర్, కొండేటి చిట్టిబాబు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు అత్తిలి సీతారామస్వామి, శెట్టిబత్తుల రాజబాబు, జెడ్పీ ప్రతిపక్షనేత సాకా ప్రసన్నకుమార్, రాజమండ్రి ఫ్లోర్ లీడర్ షర్మిలారెడ్డి, ముమ్మిడివరం ఫ్లోర్‌లీడర్ కాశి మునికుమారి, కాకినాడ మాజీ డిప్యూటీ మేయర్ పసుపులేటి వెంకటలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, మిండగుదిటి మోహన్, జక్కంపూడి రాజా, కర్రి నారాయణరావు, జీవీ రమణ, పాలెపు ధర్మారావు, చెల్లుబోయిన శ్రీను, లింగం రవి, అడ్డగళ్ళ సాయిరామ్, రాష్ట్రసేవాదళ్ కార్యదర్శి సుంకర చిన్ని, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి పోలు కిరణ్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర బీసీసెల్ కార్యదర్శులు బొబ్బిలి గోవిందు, అల్లి రాజబాబు, రాష్ట్ర సేవాదళ్ ప్రధానకార్యదర్శి ఒమ్మి రఘురామ్, రాష్ట్ర నీటి వినియోగదారుల సంఘం మాజీప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినాథరెడ్డి, జిల్లా అనుబంధ విభాగాల కన్వీనర్లు సిరిపురపు శ్రీనివాసరావు, డాక్టర్ యనమదల మురళీకృష్ణ గీత, పెట్టా శ్రీనివాస్, మట్టపర్తి మురళీకృష్ణ, జున్నూరు వెంకటేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, పార్టీ నేతలు ఆదిరెడ్డి వాసు, మురళీరాజు, వాసిరెడ్డి జమీలు, రవి వర్మ తదితరులు పాల్గొన్నారు.