మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: దూడల్లో మరణాలు తగ్గించి తద్వారా పాల ఉత్పత్తిని అధికంగా పెంచేందుకు పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది నుంచి సునందిని పథకాన్ని అమలు చేస్తున్నారు. లబ్ధిదారులు రూ. 975 చెల్లిస్తే ఏడాది పాటు దూడ సంరక్షణ బాధ్యతను పశుసంవర్ధకశాఖ అధికారులు చూసుకుంటారు. జిల్లాలో పాడి పశువులు దాదాపు 5.40 లక్షలు ఉన్నాయి. వీటి ద్వారా సరాసరి ఏడాది 20 వేల వరకు దూడలు పుట్టే అవకాశం ఉంది. పాలు విక్రయించాలనే ఉద్దేశంతో దూడలను యజమానులు నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో సగానికి సగం మృత్యువాత పడుతున్నాయి.
అందుకోసం కొన్నింటినైనా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ ఏడాది జిల్లాలో 2551 దూడలను సంరక్షించే బాధ్యతగా తీసుకోవాలని ప్రభుత్వం నుంచి పశుసంవర్ధక శాఖ అధికారులకు ఉత్తర్వులు అందాయి. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తిచేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. లబ్ధిదారుని వాటా రూ.975లు, ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ రూ.4025లు మొత్తం రూ.5 వేలతో 4 నెలల నుంచి 6 నెలల వయసున్న దూడలను సంరక్షించే బాధ్యత పశుసంవర్ధక శాఖ తీసుకోనుంది. దాణాతో పాటు వాటికి అవసరమైన మందులు తదితర వాటిని మొదటిసారిగా రెండు నెలలకు సరిపడా ఒకేసారి ఇలా ఏడాదికే ఆరుసార్లు ఇస్తారు. రోజుకు 150 గ్రాముల చొప్పున దూడలకు దాణా అందివ్వాల్సి ఉంటుంది. దూడల ఆరోగ్య సంరక్షణలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే విధంగా పాడి రైతుల్లో అవగాహన కోసం పశుసంవర్ధక శాఖ కరపత్రాలను ముద్రించి సరఫరా చేస్తున్నారు.
జిల్లాలో 5 వేల దూడల సంరక్షణకు అవకాశం ఇవ్వాలి..
జిల్లా పరిస్థితుల దష్ట్యా 5 వేల దూడల సంరక్షణకు ప్రభుత్వం అనుమతి ఇస్తే బాగుంటుంది. ప్రస్తుతం 2551 దూడల సంరక్షణకు మాత్రమే అనుమతి వచ్చిందని ఈ సంఖ్యను పెంచాలని ఉన్నతాధికారులను కోరాం. పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సునందిని పథకం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న రాయితీని ఉపయోగించుకుంటే ప్రయోజనం ఉంటుంది.
- వెంకటరమణ, జాయింట్ డెరైక్టర్, పశుసంవర్ధకశాఖ
దూడల సంరక్షణకు సునందిని
Published Thu, Dec 12 2013 4:19 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement