బూసారపు సత్యయేసుబాబు, జిల్లా ఎస్పీ
సాక్షి, అనంతపురం సెంట్రల్: ‘రాష్ట్రంలో ఎక్కడా బెల్టుషాపులు కనిపించకూడదు. ఇసుక అక్రమ తరలింపునకు అడ్డుకట్టపడాలి. శాంతిభద్రతలు అదుపులో ఉండాలి.’ ఇదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్ష. ప్రస్తుతం పోలీసు శాఖల పనితీరును చూస్తుంటే ముఖ్యమంత్రి ఆకాంక్ష నెరవేరేలా కనిపిస్తోంది. ప్రధానంగా జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన బూసారపు సత్య యేసుబాబు పాలనలో తన మార్కు చూపిస్తున్నారు. జిల్లాలో పేకాట, క్రికెట్ బెట్టింగ్, మట్కా నిర్వహణపై ఉక్కుపాదం మోపుతున్నారు. బెల్టుషాపులపై దాడులు, ఇసుక అక్రమ తరలింపునకు అడ్డుకట్ట వేస్తున్నారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడకుండా ముందుకు సాగుతుండటంతో ఫ్యాక్షనిస్టుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రేపటితో ఎస్పీగా బూసారపు సత్య యేసుబాబు బాధ్యతలు స్వీకరించి నెలరోజులు గడుస్తున్న సందర్భంగా ప్రత్యేక కథనం...
ఎస్పీగా సత్యయేసుబాబు బాధ్యతలు స్వీకరించి నెలరోజులు మాత్రమే అవుతున్నా పోలీసుశాఖలో అనేక మార్పులు తీసుకొచ్చారు. ముఖ్యంగా పేకాట, మట్కా, క్రికెట్ బెట్టింగ్‌లపై ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా క్లబ్‌లపై దాడులు జరపడం చర్చనీయాంశంగా మారింది. ఎస్పీ నిర్ణయాలతో జిల్లాలో మట్కా, బెట్టింగ్, పేకాటరాయుళ్లకు భయం పట్టుకుంది. ఎప్పుడు ఎక్కడ దాడులు చేస్తారోననే ఆందోళన ప్రారంభమైంది.
ఇప్పటి వరకూ మట్కాపై 27 కేసులు నమోదు చేసి రూ. 1.87 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పేకాటకు సంబందించి 553 కేసులు నమోదు చేసి రూ. 9.97 లక్షలు స్వాదీనం చేసుకున్నారు. గుట్కా విక్రయిస్తున్న 27 మందిని అరెస్ట్ చేసి రూ. 3.96 లక్షలు విలువజేసే గుట్కా ప్యాకెట్లను స్వాదీనం చేసుకున్నారు. అలాగే బెల్టు దుకాణాలపై మెరుపుదాడులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ 128 కేసులు నమోదు చేసి 3,714 మద్యం బాటిళ్లు, 149 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు.
ఇసుక రీచ్ ప్రాంతాల్లో పోలీసు పికెట్
ఇసుక అక్రమ తరలింపు విషయంలో ఎస్పీ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఏకంగా ఇసుక అక్రమంగా తరలిస్తున్న ప్రాంతాల్లో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. ఎస్పీ తీసుకున్న నిర్ణయాలతో ఇసుక అక్రమ తరలింపు అడ్డుకట్ట పడుతోంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అక్రమంగా ఇసుక తరలిస్తున్న 154 ట్రాక్టర్లు, నాలుగు టిప్పర్లు, లారీలను పట్టుకున్నారు. మొత్తం 26 మందిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. 150 ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేశారు. మొత్తం మీద ఎస్పీ నెలరోజుల పాలన పోలీసుశాఖలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి
జిల్లాలో శాంతిభద్రతల విషయంలో ఎస్పీ రాజీపడడం లేదు. కొన్నేళ్లుగా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరుడు ఎస్‌వీ రవీంద్రారెడ్డి హవా నడిచింది. అనేక ఘటనల్లో ఇతడి పాత్ర ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉంది. అయితే గతంలో ఎవరూ ఇతడి జోలికి పోలేదు. ఇటీవల తాడిపత్రిలో ఓ బ్యాంకు ఉద్యోగి హత్యాయత్నంలో ఎస్‌వీ రవీంద్రారెడ్డి పాత్ర ఉండడంతో ఎస్పీ తనదైన శైలిలో కౌన్సెలింగ్ నిర్వహించినట్లు సమాచారం.
శాంతిభధ్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. కేవలం ఈ ఘటనలోనే కాకుండా ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో నేరుగా ఎస్పీనే పర్యటిస్తున్నారు. కొంతమందిని తన కార్యాలయానికి పిలిపించుకొని తనదైన శైలిలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment