రేపటి నుంచి రిజిస్ట్రేషనూ భారమే!
25 శాతం మేర పెరగనున్న భూముల విలువ
ఏడాదికి రూ.25 కోట్లు పెరగనున్న ఆదాయం
తిరుపతి అర్బన్: రాష్ర్ట ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆగస్టు ఒకటి నుంచి భూముల విలువలతో పాటు రిజిస్ట్రేషన్ ధరలు కూడా పెరగనున్నాయి. ఇప్పటివరకు స్థలాల బయటి మార్కెట్ ధరలకు, రిజిస్ట్రేషన్ శాఖలో అమలవుతున్న ధరలకు ఏమాత్రం పొంతన ఉండడం లేదు. అందులో రిజిస్ట్రేషన్ శాఖ ధరల కన్నా మార్కెట్ ధరలు ఎక్కువగా ఉన్న అంశాన్ని గుర్తించిన ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల ధరలను కూడా పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై స్థలాలు, భూములు, ప్లాట్‌ల ధరలు సుమారు 25 శాతం మేరకు పెరిగి వినియోగదారులపై రిజిస్ట్రేషన్ భారం పడనుంది. అయితే జిల్లాలోని కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధి ప్రాంతాల్లో భూముల ధరలను పెంచకుండా యథాస్థితిని కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయ డం గమనార్హం.
అయినప్పటికీ ముఖ్యమైన ప్రాంతాల్లో స్థలాలు, ప్లాట్ల విలువ పెరగనున్న దృష్ట్యా తిరుపతి, చిత్తూరు, పుత్తూరు, మదనపల్లి, కుప్పం, పీలేరు, శ్రీకాళహస్తి, తిరుపతి రూరల్, చంద్రగిరి, నగరి ప్రాంతాల్లోని ప్లాట్‌లు, స్థలాల రిజిస్ట్రేషన్ల ధరలూ ఒక మోస్తరుగా పెరిగే అవకాశాలు ఉంటాయని రిజిస్ట్రేషన్ వర్గాలు వెల్లడించాయి. భూములు, స్థలాల విలువ పెరగడం, తద్వారా రిజిస్ట్రేషన్ ధరలు పెరిగితే జిల్లా వ్యాప్తంగా ఏడాదికి సుమారు రూ.25 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం పెరగనుంది. కానీ ఆయా ప్రాంతం ఆధారంగా స్థలాలు, భూముల విలువలు పెరుగుతాయని అధికారులు పేర్కొంటున్నారు.
మూడు నెలల్లో పెరిగిన ఆదాయం
ఆగస్టు ఒకటి నుంచి భూముల విలువతో పాటు రిజిస్ట్రేషన్ ధరలూ పెరిగే అవకాశం ఉన్న కారణంగా గత మూడు నెలలుగా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లు పెరిగాయి. ఆ ప్రభావంతో తిరుపతి బాలాజీ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆదాయం కూడా బాగా పెరిగి 106 శాతం లక్ష్యాన్ని అధిగమించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయ ఆదాయ లక్ష్యం రూ.31.27 కోట్లు కాగా రూ.33.27 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2014లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు వచ్చిన ఆదాయం రూ.24.79 కోట్లతో పోల్చితే ఈ ఏడాది ఆదాయం 34 శాతం అదనంగా పెరిగింది. అలాగే ఈ నెల మొత్తం రిజిస్ట్రేషన్ల కోసం వచ్చేవారితో జిల్లా కార్యాలయం రద్దీగా కనిపిస్తోంది.