సమావేశం నిర్వహిస్తున్న జేసీ కృతికాశుక్లా
సాక్షి, విజయవాడ : ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించడంతో పాటు నీతిబద్ధమైన ఓటింగ్ (ఎథిక్ ఓటింగ్)పై కవి సమ్మేళనం కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయాలని విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కృతికాశుక్లా అధికారులను ఆదేశించారు. ఈ నెల 17వ తేదీ సాయంత్రం 6 గంటలకు భవానీపురం బెరంపార్క్ పశ్చిమ బయళ్లలో నీతిబద్ధమైన ఓటింగ్‌పై కవి సమ్మేళనానికి చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వీప్ (సిస్టమేటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్)లో భాగంగా ఓటర్లుగా నమోదైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య పటిష్టతకు, నీతివంతమైన పాలనకు శ్రీకారం చుట్టాలన్నారు. దీనిలో భాగంగా కృష్ణా జిల్లా రచయితల సంఘం, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతి, జిల్లా యంత్రాంగం సంయుక్త సహకారంతో కవి సమ్మేళనం కార్యక్రమం నిర్వహిస్తున్నామని వివరించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది, జిల్లా ఎన్నికల అధికారి ఏఎండీ ఇంతియాజ్, పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు, వీఎంసీ కమిషనర్ రామారావు హాజరు కానున్నారని తెలిపారు. ఆదివారం నిర్వహించే ఈ కార్యక్రమానికి ఔత్సాహిక కవులు, కళాకారులతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొనాలని జేసీ కోరారు.
సమావేశంలో డీఈవో ఎంవీ రాజ్యలక్ష్మి, ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సీవీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెలగా జోషి, డీఎస్‌ఓ నాగేశ్వరరావు, ట్రైనీ డెప్యూటీ కలెక్టర్ శివజ్యోతి, సోషల్ వెల్ఫేర్ జేడీ పీఎన్‌వీ ప్రసాద్, ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతి సీఈవో డాక్టర్ శివనాగిరెడ్డి, కృష్ణా జిల్లా రచయితల సంఘం కార్యదర్శి డాక్టర్ జీవీ పూర్ణచంద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment