రిమ్స్ క్యాంపస్, న్యూస్‌లైన్ : రిమ్స్ అధికారుల వ్యవహార శైలి తరచూ వివాదాలకు దారితీస్తోంది. రోగులకు నిత్యం సేవలందించే వైద్య సిబ్బందికి అండదండగా ఉండాల్సినవారు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా వారి దృష్టి నర్సింగ్ సిబ్బందిపై పడింది. చిన్నపాటి కారణాలకే మెమోలు జారీ చేసి వేధింపులకు గురిచేస్తున్నారని నర్సింగ్ సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఎం.కమలకుమారి అనే స్టాఫ్ నర్సు గతంలో ఆరు నెలలు మెటర్నిటీ సెలవు తీసుకున్నారు. విధుల్లో చేరాక సెలవు వేతనం కోసం దరఖాస్తు చేశారు. నాలుగైదు నెలలు తిరిగినా వేతనం అందలేదు. దీంతో భర్త సూచన మేరకు.. వేతనం ఎందుకు ఇవ్వలేదో తెలియజేయాలని కోరుతూ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు.
దీనిపై రిమ్స్ డెరైక్టర్ మండిపడ్డారని సమాచారం. అంతేకాకుండా నర్సింగ్ సూపరింటెండెంట్‌ను పిలిచి ఇది సరైన పద్ధతి కాదని, స్టాఫ్‌నర్సుకు చెప్పి ఆర్టీఐ దరఖాస్తును వెనక్కి తీసుకునేలా చేయాలని చెప్పినట్టు తెలిసింది. అంతటితో ఆగకుండా ఆమెకు మెమో జారీ చేయాలని ఆదేశించారు. దీంతో చేసేదిలేక నర్సింగ్ సూపరింటెండెంట్ కమలకుమారికి మెమో జారీ చేశారు. వివరణ ఇవ్వాలని కోరారు. దీంతో స్టాఫ్‌నర్సులందరూ ఆవేదన చెందారు. బాధితురాలికి న్యాయం చేయకపోగా మెమో జారీ చేయటం ఏమిటని వాపోయారు.
సమస్య పరిష్కరించకపోగా.. మరో ఇద్దరికి మెమోలు
గైనిక్ విభాగంలోని సీమాంక్ బ్లాక్‌లో విధులు నిర్వహిస్తున్న ప్రిస్కీల్లా, కరుణకుమారి అనే ఇద్దరు స్టాఫ్‌నర్సులకు కూడా ఇటీవల చేదు అనుభవం ఎదురైంది. రాత్రి 8 గంటల సమయంలో వీరిద్దరు డ్యూటీ డ్రెస్ మార్చుకోవటానికి వెళ్లగా.. అదే సమయంలో డెరైక్టర్ వార్డును విజిట్ చేశారు.
స్టాఫ్ నర్సులు కనిపించకపోవటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వీరిద్దరికి మెమోలు జారీ చేశారు. వాస్తవానికి డ్రస్ మార్చుకోవటానికి ఈ బ్లాక్‌లో సరైన సౌకర్యం లేదు. తెరచాటున మార్చుకోవాల్సి వస్తోంది. ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకుండా తమకు మెమోలు జారీ చేయటం ఏమిటని స్టాఫ్ నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెమో జారీ చేసేముందు కనీసం తమను పిలిపించి వివరణ అడిగితే అసలు విషయం చెప్పేవారమని అంటున్నారు. అయితే ఈ అంశాలపై బహిరంగంగా మాట్లాడేందుకు వెనుకంజ వేస్తున్నారు. అధికారులు మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తారన్న భయమే దీనికి కారణం.
రిమ్స్‌లో వేధింపుల పర్వం!
Published Fri, Mar 7 2014 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 4:25 AM
Advertisement
Advertisement