rims ongole
-
రిమ్స్‌లో వేధింపుల పర్వం!
రిమ్స్ క్యాంపస్, న్యూస్‌లైన్ : రిమ్స్ అధికారుల వ్యవహార శైలి తరచూ వివాదాలకు దారితీస్తోంది. రోగులకు నిత్యం సేవలందించే వైద్య సిబ్బందికి అండదండగా ఉండాల్సినవారు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా వారి దృష్టి నర్సింగ్ సిబ్బందిపై పడింది. చిన్నపాటి కారణాలకే మెమోలు జారీ చేసి వేధింపులకు గురిచేస్తున్నారని నర్సింగ్ సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఎం.కమలకుమారి అనే స్టాఫ్ నర్సు గతంలో ఆరు నెలలు మెటర్నిటీ సెలవు తీసుకున్నారు. విధుల్లో చేరాక సెలవు వేతనం కోసం దరఖాస్తు చేశారు. నాలుగైదు నెలలు తిరిగినా వేతనం అందలేదు. దీంతో భర్త సూచన మేరకు.. వేతనం ఎందుకు ఇవ్వలేదో తెలియజేయాలని కోరుతూ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. దీనిపై రిమ్స్ డెరైక్టర్ మండిపడ్డారని సమాచారం. అంతేకాకుండా నర్సింగ్ సూపరింటెండెంట్‌ను పిలిచి ఇది సరైన పద్ధతి కాదని, స్టాఫ్‌నర్సుకు చెప్పి ఆర్టీఐ దరఖాస్తును వెనక్కి తీసుకునేలా చేయాలని చెప్పినట్టు తెలిసింది. అంతటితో ఆగకుండా ఆమెకు మెమో జారీ చేయాలని ఆదేశించారు. దీంతో చేసేదిలేక నర్సింగ్ సూపరింటెండెంట్ కమలకుమారికి మెమో జారీ చేశారు. వివరణ ఇవ్వాలని కోరారు. దీంతో స్టాఫ్నర్సులందరూ ఆవేదన చెందారు. బాధితురాలికి న్యాయం చేయకపోగా మెమో జారీ చేయటం ఏమిటని వాపోయారు. సమస్య పరిష్కరించకపోగా.. మరో ఇద్దరికి మెమోలు గైనిక్ విభాగంలోని సీమాంక్ బ్లాక్‌లో విధులు నిర్వహిస్తున్న ప్రిస్కీల్లా, కరుణకుమారి అనే ఇద్దరు స్టాఫ్‌నర్సులకు కూడా ఇటీవల చేదు అనుభవం ఎదురైంది. రాత్రి 8 గంటల సమయంలో వీరిద్దరు డ్యూటీ డ్రెస్ మార్చుకోవటానికి వెళ్లగా.. అదే సమయంలో డెరైక్టర్ వార్డును విజిట్ చేశారు. స్టాఫ్ నర్సులు కనిపించకపోవటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వీరిద్దరికి మెమోలు జారీ చేశారు. వాస్తవానికి డ్రస్ మార్చుకోవటానికి ఈ బ్లాక్‌లో సరైన సౌకర్యం లేదు. తెరచాటున మార్చుకోవాల్సి వస్తోంది. ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకుండా తమకు మెమోలు జారీ చేయటం ఏమిటని స్టాఫ్ నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెమో జారీ చేసేముందు కనీసం తమను పిలిపించి వివరణ అడిగితే అసలు విషయం చెప్పేవారమని అంటున్నారు. అయితే ఈ అంశాలపై బహిరంగంగా మాట్లాడేందుకు వెనుకంజ వేస్తున్నారు. అధికారులు మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తారన్న భయమే దీనికి కారణం. -
రిమ్స్ నర్సింగ్ కాలేజీలో అడ్మిషన్లు ప్రారంభం
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: రిమ్స్ నర్సింగ్ కాలేజీలో అడ్మిషన్లను సోమవారం రిమ్స్ డెరైక్టర్ అంజయ్య ప్రారంభించారు. మొదటి అడ్మిషన్‌ను శ్రీకాకుళానికి చెందిన విద్యార్థినికి డెరైక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక రిమ్స్ డెరైక్టర్ చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంజయ్య మాట్లాడుతూ 2013-14 సంవత్సరానికి నర్సింగ్ కాలేజీలో జీఎన్ఎం కోర్సుకు 60 మంది విద్యార్థులను ప్రభుత్వం కేటాయించిందన్నారు. నవంబర్ 24న విశాఖపట్నం ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్ అధ్యక్షతన గల కమిటీ విద్యార్థులను ఎంపిక చేసిందని చెప్పారు. రిమ్స్‌లో ప్రవేశం పొందిన 60 మందిలో 51 మంది విద్యార్థినులని, 9 మంది విద్యార్థులని తెలిపారు. మూడున్నరేళ్ల వ్యవధి కలిగిన ఈ కోర్సులో 6 నెలల పాటు మిడ్వైఫరీ శిక్షణను అభ్యర్థులు పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. నర్సింగ్ కళాశాలకు అధ్యాపకులను నియమించినట్లు చెప్పారు. విద్యార్థినీ, విద్యార్థులకు తరగతి గదలు, లైబ్రరీ, అదే విధంగా వేరు వేరుగా హాస్టల్ వసతి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదే విధంగా *10 కోట్ల నిధులు మంజూరు చేశారని, కానీ విడుదల చేయలేదన్నారు. దీనిలో కేంద్ర ప్రభుత్వ వాటా 85 శాతం, రాష్ట్ర ప్రభుత్వ వాటా 15 శాతం ఉంటుందన్నారు. మొదటి సంవత్సరం నర్సింగ్ విద్యకు నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు అనుమతులు మంజూరు చేశారన్నారు. మరో రెండు సార్లు ఎన్.సి.ఐ తనిఖీలు ఉంటాయని చెప్పారు. ఈ తనిఖీల్లోపు నర్సింగ్ భవనాలు కూడా పూర్తి చేయాలన్నారు. నర్సింగ్ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా రాజ్యలక్ష్మిని, వైస్ ప్రిన్సిపాల్ గా కృష్ణవేణిలను నియమించినట్లు తెలిపారు. రిమ్స్‌లో డైట్ కాంట్రాక్టర్‌ను డిస్మిస్ చేశామని, త్వరలో నూతన కాంట్రాక్టర్‌ను ఎంపిక చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పారిశుధ్య కాంట్రాక్టుపై జనవరిలో హైదరాబాద్‌లో నిర్ణయం తీసుకుంటారని, త్వరలో 150 మంది పారిశుధ్య కాంట్రాక్టు కార్మికులు, వైద్యకళాశాల, వైద్యశాలకు నియమితులవుతారన్నారు. వీటితో పాటు 50 మంది సెక్యూరిటీ గార్డులను ఎంపిక చేస్తామన్నారు. అదే విధంగా ఎంబీబీఎస్ విద్యలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్ అందజేసేందుకు * 10 లక్షలతో నిధిని ఏర్పాటు చేశామన్నారు. ఇంకా దాతలు స్పందించాలని కోరారు. 4 నెలలుగా ప్రొఫెసర్లకు జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. విలే కరుల సమావేశంలో రిమ్స్ మెడికల్ డిపార్టుమెంట్ హెచ్ఓడీ డాక్టర్ మల్లికార్జునరావు, ఆరోగ్య శ్రీ ఇన్చార్జి డాక్టర్ కె.సి.టి నాయక్, ఎ.పి.ఐ.ఎం.డి.సి ఇంజినీర్ టి.రవి తదితరులు పాల్గొన్నారు. -
అద్దంకిలో మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి దీక్ష భగ్నం
సమైక్యాంధ్రకు మద్దతుగా అద్దంకి మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గొట్టిపాటి రవికుమార్ చేపట్టిన ఆమరణ నిరాహర దీక్షను ఆదివారం తెల్లవారుజామున పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ఆయన్ని ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి గత ఐదు రోజులుగా అద్దంకిలో ఆమరణ నిరాహర దీక్ష చేపట్టారు. అయితే ఆయన ఆరోగ్యం రోజురోజుకు కీణిస్తుంది. దాంతో ఈ రోజు తెల్లవారుజామున ఆయన ఆమరణ నిరాహర దీక్షను పోలీసులు భగ్నం చేశారు.