సాక్షి, ముమ్మిడివరం(తూర్పు గోదావరి): జిల్లాలో చిట్టచివరి నియోజకవర్గంగా ఉన్న ముమ్మిడివరం అంతర్జాతీయ రాజకీయాలకు వేదికగా మారింది. ఇద్దరు రాజకీయ ఉద్దండులను రాష్ట్రానికి అందించింది. దివంగత లోక్ సభస్పీకర్ జీఎంసీ బాలయోగి ఈ నియోజకవర్గానికి చెందిన వారే. ఈయన ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టడం, ఆ తర్వాత లోక్ సభ స్పీకరై ఈ నియోజకవర్గానికి ప్రత్యేకను తీసుకు వచ్చింది. ఆరుసార్లు గెలిచి జిల్లాలో రికార్డు సృష్టించిన మాజీ మంత్రి బత్తిన సుబ్బారావు ఈ నియోజకవర్గం నుంచి రెండు సార్లు గెలుపొందడం మరోవిశేషం.
ఆధ్యాత్మిక కేంద్రంగా..
ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రాశస్త్యం ఉంది. ఆధ్యాత్మికంగా అంతర్జాతీయ ఖ్యాతిని పొందింది. శ్రీభగవాన్ బాలయోగీశ్వరుల తపో ఆశ్రమం ఈ నియోజకవర్గంలో ఉండడంతో ఈ ప్రాంతానికి ఈ ఖ్యాతి లభించింది. ఈ ఆశ్రమం సందర్శనకు భక్తులు విచ్చేస్తుంటారు.
ఇలా రూపాంతరం చెంది..
చెయ్యేరు జనరల్ నియోజకవర్గం 1978లో ముమ్మిడివరం ఎస్సీ నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. అంతకు ముందు చెయ్యేరు నియోజక వర్గంగా ఉన్న సమయంలో నాలుగు సార్లు ఎన్నికలు జరగగా రెండు సామాజిక వర్గాలు పోటీ పడ్డాయి. కాపు, క్షత్రియ సామాజిక వర్గాలు రెండేసి పర్యాయాలు ప్రాతినిధ్యం వహించాయి. మొదటి సారి 1955లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నడింపల్లి రామభద్రిరాజు సీపీఐ అభ్యర్థి సి.కృష్ణమూర్తిపై 8,637 ఓట్లతో గెలుపొందారు. 1962లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన సీబీకే రాజుపై కాంగ్రెస్ అభ్యర్థి పళ్ల వెంకటరావు 2,066 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1967 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పళ్ల వెంకటరావును స్వతంత్ర అభ్యర్థి సీబీకే రాజు 15,365ఓట్ల తేడాతో ఓడించారు. 1972లో తిరిగి కాంగ్రెస్ అభ్యర్థిగా పళ్ల వెంకట రావు ఇండింపెండెంట్ అభ్యర్థి జీవీరావుపై 11,304 ఓట్ల తేడాతో గెలుపొంది రాష్ట్ర మంత్రి వర్గంలో స్థానం సంపాదించారు.
పోటాపోటీగా..
ముమ్మిడివరం ఎస్సీ రిజర్వ్‌డు నియోజకవర్గంగా మారాక తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ అభ్యర్థి బి.అప్పలస్వామిపై కాంగ్రెస్ అభ్యర్థి మోకా విష్ణుప్రసాదరావు 13,228 ఓట్లతో గెలుపొంది రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పాందారు. 1983లో తెలుగు దేశం అభ్యర్థి వల్తాటి రాజా సక్కుబాయిపై కాంగ్రెస్ అభ్యర్థి మోకా విష్ణుప్రసాదరావు 36,225 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 1985లో కాంగ్రెస్ అభ్యర్థి జీకే వరప్రసాద్‌ను టీడీపీ అభ్యర్థి పండు కృష్ణమూర్తి 33,124 ఓట్ల తేడాతో ఓడించారు. 1989లో దేశం అభ్యర్థి పండు కృష్ణమూర్తిపై కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి బత్తిన సుబ్బారావు 6,749 ఓట్లతో విజయం సాధించారు. 1994లో కాంగ్రెస్ అభ్యర్థి బత్తిన సుబ్బారావు జిల్లలో తెలుగు దేశం ప్రభంజనాన్ని ఎదురొడ్డి టీడీపీ అభ్యర్థి మోకా ఆనందసాగర్‌పై 9,565 మోజార్టీతో రెండోసారి గెలుపొందారు.
అప్పట్లో కాంగ్రెస్ నుంచి ఏకైక ఎమ్మెల్యేగా జిల్లాలో రికార్డు సృష్టించారు. బత్తిన మరణానంతరం 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గొల్లపల్లి సూర్యారావుపై టీడీపీ అభ్యర్థి జీఎంసీ బాలయోగి 14,496 ఓట్ల మెజార్టీతో గెలుపొంది రాష్ట్ర ఉన్నత విద్యాశాఖామంత్రిగా పనిచేశారు. 1998లో జరిగిన పార్లమెంట్ మధ్యంతర ఎన్నికల్లో బాలయోగి అమలాపురం ఎంపీగా గెలుపు పొందడంతో మరోసారి ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పినిపే విశ్వరూప్‌పై టీడీపీ అభ్యర్థి చెల్లి వివేకానంద 17,778 ఓట్లతేడాతో గెలుపొందారు. 1999లో కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులుగా విశ్వరూప్, వివేకానందలు పోటీపడ్డారు. ఈ ఎన్నికల్లో వివేకానంద మరోసారి 10,742 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2004లో జరిగిన ఎన్నికల్లో తెలుగు దేశం అభ్యర్థి చెల్లి శేషకుమారిపై కాంగ్రెస్ అభ్యర్థి పినిపే విశ్వరూప్ 15,357 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
నియోజకవర్గంలో..
మొత్తం ఓట్లు |
2,20,223 |
పురుషులు |
1,11.054 |
మహిళలు |
1.09,164 |
ఇతరులు |
5 |
కులాల వారీగా...
శెట్టిబలిజలు | 41,414 |
మాలలు | 49,905 |
మాదిగలు | 13,885 |
కాపులు | 29,552 |
అగ్నికుల క్షత్రియలు | 43,774 |
క్షత్రియులు | 11,223 |
యాదవులు | 2,870 |
రజకులు | 2,070 |
విశ్వబ్రహ్మణులు | 1.328 |
బ్రహ్మణులు | 1.077 |
వైశ్యాస్ | 1075 |
మండలాలు...
ముమ్మిడివరం
కాట్రేనికోన
ఐ.పోలవరం
తాళ్లరేవు
నగర పంచాయతీ 1
పంచాయతీలు 63
పోలింగ్ స్టేషన్లు 268
భౌగోళికంగా.. రాజకీయంగా మార్పులు..
2009లో నియోజకవర్గ పునర్విభజన అనంతరం నియోజకవర్గం భౌగోళికంగా, రాజకీయంగా కొన్ని మార్పులు చేసుకున్నాయి. తాళ్లరేవు మండలం ముమ్మిడివరం నియోజకవర్గంలో చేరింది. 30 ఏళ్లుగా ఎస్సీ రిజర్వ్‌డ్‌గా ఉన్న ఈ నియోజకవర్గం జనరల్‌గా మారింది. అప్పట్లో పీఆర్పీ ఆవిర్భావంతో త్రిముఖ పోటీ అనివార్యమైంది. కాంగ్రెస్ అభ్యర్థిగా పొన్నాడ వెంకట సతీష్‌కుమార్, టీడీపీ అభ్యర్థిగా నడింపల్లి శ్రీనివాసరాజు, పీఆర్పీ అభ్యర్థిగా కుడుపూడి సూర్యనారాయణరావులు పోటీ పడగా కాంగ్రెస్ అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్‌కుమార్ 1924 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి గుత్తుల సాయిపై టీడీపీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు 29,535 ఓట్ల మెజార్టీలో గెలుపొందారు.
నియోజకవర్గంలో ఎస్సీ, శెట్టిబలిజ, అగ్నికుల క్షత్రియ, కాపు సామాజిక వర్గాల ఓట్లు అధికంగా ఉన్నాయి. బీసీ ఓట్లు 60 శాతం పైబడి ఉండటంతో ఎన్నికల్లో వీరే అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగలుగుతారు. ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పొన్నాడ వెంకట సతీష్‌కుమార్ పోటీలో ఉండే అవకాశముంది. అలాగే టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన దాట్ల సుబ్బరాజు దాదాపు ఖరారైనట్టే. జనసేన పార్టీ అభ్యర్థిగా శెట్టిబలిజ సామాజికి వర్గానికి చెందిన పితాని బాలకృష్ణ పోటీలో ఉంటారు. బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్‌కుమార్ పోటీలో ఉండే అవకాశముంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం కోసం సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెన్మత్స జగ్గప్పరాజు, గంగిరెడ్డి త్రినాథరావు, ముషిణి రామకృష్ణరావు, వేగేశ్న నరసింహరాజు, పి.ఉదయ భాస్కరవర్మ దరఖాస్తుల చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment