సాహస యాత్ర ఛత్తీస్‌గఢ్ టు మేడారం | tour from chattisgarh to medaram | Sakshi
Sakshi News home page

సాహస యాత్ర ఛత్తీస్‌గఢ్ టు మేడారం

Published Wed, Feb 12 2014 2:40 AM | Last Updated on Sat, Jul 28 2018 8:20 PM

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని మద్దేడు గ్రామం మాది. మొత్తం ఇరవై కుటుంబాల వారం కలిసి ఇరవై ఎడ్లబండ్లపై శనివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు మేడారం బయల్దేరాం.

 ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని మద్దేడు గ్రామం మాది. మొత్తం ఇరవై కుటుంబాల వారం కలిసి ఇరవై ఎడ్లబండ్లపై శనివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు మేడారం బయల్దేరాం. అదేరోజు మధ్యాహ్నం మూడు గంటలకు భూపాలపట్నం చేరుకున్నాం. ఇక్కడి వరకు రోడ్డు బాగానే ఉంది. ఆ తర్వాత ఎడ్లబండ్ల మార్గంలో దట్టమైన అడవి గుండా రాత్రంతా ప్రయాణం చేయాలి. కాబట్టి  భూపాలపట్నంలోనే భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకున్నాం. సాయంత్రం అక్కడి నుంచి బయల్దేరి రాత్రంతా ఆగకుండా గుట్టలు ఎక్కిదిగుతూ ప్రయాణించి ఆదివారం తెల్లవారు జామున రెండు గంటలకు గోదారి ఒడ్డున ఉన్న తాళ్లగూడెం చేరుకున్నాం.
 
 మేం పడవలో.. ఎడ్లు నదిలో..
 ఎడ్లబండ్లను నది దాటించడం చాలా కష్టం. బళ్లను మొత్తం విడదీసి పడవపైకి ఎక్కించినం. పడవ చిన్నది అవడం వల్ల ఎడ్లు అందులో ఎక్కితే నది మధ్యలో బెదిరే ప్రమాదం ఉంది. కాబట్టి వాటిని ఎక్కించం. అందరం పడవల్లోకి ఎక్కిన తర్వాత ఎడ్లను నీళ్లలో దించి వాటి పగ్గాలను మా చేతుల్లో పట్టుకుని ప్రయాణం మొదలుపెడతాం. నది దాటేందుకు దాదాపు అరగంట పడుతుంది. ఈదలేక ఎడ్లు అలసిపోతే మేం వాటి పగ్గాలను గట్టిగా పట్టుకుని వాటి ముఖం పైకి ఉండేలా జాగ్రత్త పడతాం. ఉదయాన్నే గోదావరిలో నీరు చల్లగా ఉంటుంది. కాబట్టి ఎడ్లు ఈత కొట్టేందుకు ఇబ్బంది పడతాయి. అందుకే మధ్యాహ్నం ఎండ వచ్చే వరకు ఆగి నది దాటుతాం. అలా ఆదివారం మధ్యాహ్నం కల్లా  తుపాలగూడెం చేరుకున్నాం. అక్కడ మళ్లా విప్పిన బళ్లను సరిచేసుకున్నాం. అక్కడే వంట చేసుకుని తిని దొడ్ల, మల్యాల మీదుగా సోమవారం ఉదయం ఊరట్టం చేరుకున్నాం.
 
 చింతలవాగు దాటుడు కష్టం
 భూపాలపట్నం దాటిన తర్వాత తాళ్లగూడెం చేరేవరకు ఎడ్లబండి ప్రయాణం ప్రమాదాలతో కూడి ఉంటుంది. మధ్యలో చిన్నాపెద్ద గుట్టలు చాలా దాటాలి. వీటిలో మరిమల్లగుట్ట, మొక్కులకూరగుట్ట, తాళ్లగూడెం గుట్టలైతే మరీ పెద్దవి. ఇవి దాటేప్పుడు చింతవాగు వస్తుంది. రెండు గుట్టల నడుమ లోతైన వాగులో నిట్టనిలువుగా దిగి పైకి ఎక్కాలి. నేర్పుగా బండి నడిపించాలి. ఈ దారంతా దుబ్బతో ఉంటుంది. తాళ్లగూడెం చేరుకునే సరికి  శరీరాలు తెల్లదుబ్బతో నిండిపోయాయి.
 
 నెలరోజుల ముందే..
 సమ్మక్క-సారలమ్మ జాతర జరిగే తేదీల వివరాలున్న పోస్టర్లను నెలరోజుల ముందే మా ఊర్లో అంటిస్తారు. అప్పటి నుంచే మేం జాతరకు తయారవుతాం. అరిసెలు, గారెలు చేసుకుంటాం. పెద్ద డబ్బాల్లో మిక్చరు నింపి పెట్టుకుంటాం. ఎడ్లబండ్ల మీద మేం మేడారం వచ్చుడు ఇది పదిహేనోసారి. ఇక్కడ మూడురోజులు ఉండి మళ్లీ బీజాపూర్ పయనమవుతాం.
 
 తమ ఆరాధ్య దైవాన్ని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో గిరిజనులు మేడారం చేరుకుంటారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా నుంచి ఎన్నో కష్టనష్టాలకోర్చి మేడారం చేరుకుని అమ్మలకు మొక్కులు చెల్లిస్తారు. జాతరకు చేరుకునేందుకు పలు మార్గాలున్నా ఎడ్లబండ్లపై మేడారం చేరుకునేందుకు వీరు చేసే ప్రయాణం నిజంగా ఓ సాహసమే. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాకు చెందిన ఇరవై గిరిజన కుటుంబాలు మూడు రోజుల పాటు ప్రయాణించి మేడారం చేరుకున్నాయి. కన్నెపల్లి సారలమ్మ గుడిలో కనిపించిన వీరిని ‘సాక్షి’ పలకరించగా మూడు రోజులపాటు సాగే ప్రయాణ విశేషాలను ఆ కుటుంబాలకు చెందిన కామేష్, మోహన్‌రావు ఇలా వివరించారు.
 - హన్మకొండ, సాక్షి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement