తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఇడుపులపాయ అభివృద్ధి కార్యక్రమాలపై సోమవారం అధికారులతో సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు వద్ద పర్యాటక పార్క్ రూపొందించాలని టూరిజం అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. కడప, పులివెందులను మోడల్ పట్టణాలుగా తీర్చిదిద్దాలని, పైలెట్ ప్రాజెక్ట్‌గా పనులు ప్రారంభించాలని సూచించారు. ప్రాజెక్టు అమలుకు అవసరమైన సహాయాన్ని పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్ ఏజెన్సీ(పాడా) నుంచి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇడుపులపాయ టూరిజం సర్క్యూట్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాజెక్టులపై సోమవారం ముఖ్యమంత్రికి పర్యాటక అధికారులు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న వైఎస్సార్ మెమోరియల్ గార్డెన్, బొటానికల్ గార్డెన్, గండి టెంపుల్ కాంప్లెక్స్, ఐఐటీ క్యాంపస్, ఎకో పార్క్, జంగిల్ సఫారీ, పీకాక్ బ్రీడింగ్ సెంటర్లకు సంబంధించిన అంచనాల వివరాలను అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ సుందరీకరణకు ప్రాధాన్యమిచ్చేలా ఆర్కిటెక్చర్స్ ఉండాలని సూచించారు. ఏ పని చేసినా దీర్ఘకాలిక మన్నికతో పాటు ప్రాజెక్టు ఆకర్షణీయంగా ఉండేలా రూపొందించాలన్నారు. పులిచింతలలో వైఎస్సార్ ఉద్యానవన ప్రణాళిక, విశాఖపట్నంలో లుంబినీ పార్క్ అభివృద్ధి గురించి అధికారులు వివరించారు. సమావేశంలో కడప ఎంపీ వైఎస్.అవినాష్ రెడ్డి, ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment