వణికిస్తున్న విషజ్వరం | Toxic fevers | Sakshi
Sakshi News home page

వణికిస్తున్న విషజ్వరం

Published Wed, Sep 2 2015 4:23 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM

వణికిస్తున్న విషజ్వరం - Sakshi

వణికిస్తున్న విషజ్వరం

సాక్షిప్రత్యేకప్రతినిధి, అనంతపురం : జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఈ సీజన్‌లో 749మందికి  సోకినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.  అయితే వాస్తవ సంఖ్య వేలల్లోనే ఉందని తెలుస్తోంది. 2013లో డెంగీ దెబ్బకు దాదాపు 50మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. ఈఏడాది 20-25మంది డెంగీతో చనిపోయారు. అయినా నివారణకు వైద్యఆరోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.

 భయపెడుతోన్న డెంగీ:
 ఆ జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఈ ఏడాది 976 మందికి డెంగీ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 210మందికి డెంగీ నిర్ధారణ అయింది. వీరిలో 64మంది తిరుపతి స్విమ్స్, 12మంది కర్నూలులో చికిత్స తీసుకున్నారు. తక్కిన 147 మంది అనంతపురంలో వైద్యం పొందారు. ఇవన్నీ ప్రభుత్వ గణంకాలు. అయితే జ్వరంతో ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్స చేయించుకున్నారు  ఈఏడాది 10 వేలమందికిపైగా ఉంటారని ఓ అంచనా.
 
 దోమల నివారణకు చర్యలేవీ?
 వర్షాకాలంలో పల్లెల్లో, పట్టణాల్లో ఫాగింగ్ చేయడం తప్పనిసరి. ఈ ఏడాది ఫాగింగ్ కోసం మలేరియా నియంత్రణ శాఖకు  ‘1450 లీటర్ల మలాథియాన్’ ద్రావణం వచ్చింది. అందులోనూ ఇప్పటి వరకూ 190 లీటర్లు మాత్రమే జిల్లా వ్యాప్తంగా సరఫరా చేసినట్లు తెలుస్తోంది. అదికూడా ఇప్పటి వరకు కొన్నిచోట్లే ఫాగింగ్ చేశారు. మిగిలిన చోట్ల మూలనపడేశారు. కారణాలు అన్వేషిస్తే చాలాచోట్ల ఫాగింగ్ మిషన్లు పనిచేయడం లేదు. జిల్లా కేంద్రంలో కూడా ఫాగింగ్ పెద్దయంత్రం రిపేరుకు వచ్చింది. దీంతో చిన్నవి వినియోగిస్తున్నారు. జిల్లాకు ఏమేరకు మలాథియన్ అవసరం? తీసుకెళ్లినవారు ఫాగింగ్ చేస్తున్నారా? లేదా? తక్కినవారు ఎందుకు ద్రావణాన్ని తీసుకెళ్లలేదు? అనే అంశాలపై ఆరా తీసే అధికారే కరువయ్యారు. మురికికాలువల్లో దోమల వృద్ధిని నివారించేందుకు గాంబూషియా చేపలను కూడా వదల్లేదు.
 
 పల్లెల్లో వైద్యశిబిరాలు ఎక్కడ?:
 జిల్లాలో 80 పీహెచ్‌సీలు, 586 సబ్‌సెంటర్లు ఉన్నాయి. 24 గంటలూ పనిచేసే ఆస్పత్రులు 42 ఉన్నాయి. వీటి పరిధిలోని ఏఎన్‌ఎంలు సరిగా విధులకు హాజరుకావడం లేదు. సబ్‌సెంటర్ల పరిస్థితి మరీ దారుణం. పీహెచ్‌సీలలో ఉదయం 9 నుంచి12 గంటల వరకూ ఓపీ నిర్వహించాలి. చాలా చోట్ల 10.30 గంటల వరకూ డాక్టర్లు రాని పరిస్థితి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ నర్సులు మాత్రమే ఆస్పత్రిలో ఉంటారు. ఈ సమయంలో జ్వరం వచ్చిందని రోగులు ఆస్పత్రులకు వెళితే మాత్రలు చేతిలో పెట్టడం లేదంటే ఓ ఇంజక్షన్ వేసి పంపుతున్నారు. దీంతో రోగులు ప్రై వేటు ఆస్పత్రులకు వెళ్లక తప్పడంలేదు. జ్వరంతో ఓ రోగి ప్రైవేటు ఆస్పత్రికి వెళితే  2-5వేల రూపాయల ఖర్చవుతోంది.
 
 జ్వరాలు అని తెలియగానే.. ప్రత్యేక బృందాలు పంపుతున్నాం:
 పల్లెల్లో జ్వరం అని తెలియగానే ప్రత్యేక బృందాలను పంపిస్తున్నాం. లార్వాపరీక్షలు నిర్వహిస్తున్నాం. ప్రతీ ఇంటికి డెంగ్యూ నివారణ కరపత్రాలు అంటిస్తున్నాం. ఫైరిథ్రిమ్ స్ప్రే చేస్తున్నాం. రోజూ నివేదికలు తెప్పించుకుని చూస్తున్నాం. ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు రోజూ గ్రామాల్లో పరిస్థితి తెలుసుకుంటున్నారు.
 ప్రభుదాస్, జిల్లా వైద్యాధికారి.
 
 అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించాం:
 మునిసిపాలిటీల్లో దోమల నివారణకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించాం. ఫాగింగ్, గాంబూషియా చేపల పెంపకం, మురికికాలువల్లో ఆయిల్ వేయడంతో పాటు దోమల నివారణకు అన్ని రకాలు చర్యలు తీసుకున్నాం.
 విజయలక్ష్మి, ఆర్డీ, మునిసిపల్ శాఖ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement