చెప్పింది చేయకే తిప్పలు
- అమలుకు నోచని ట్రాఫిక్ ప్రణాళిక
- యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన
- చేష్టలుడిగి చూస్తున్న పోలీసులు
- పుష్కరారంభం నుంచే ప్రయాణికులకు పాట్లు
రాజమండ్రి : మూడు నెలల కసరత్తు.. ఒక్క గంట కూడా ఉపయోగపడలేదు. పుష్కరాల్లో ఎదురయ్యే ప్రధాన సమస్య ట్రాఫిక్ అని, మూడంచెల విధానంలో నియంత్రిస్తామని గొప్పలు పోరుున అధికారులు పుష్కరాలు ఆరంభమయ్యేసరికి చేతులెత్తేశారు. పుష్కరాలకు తూర్పు గోదావరి జిల్లాకే మూడున్నర కోట్ల మందికి పైగా భక్తులు వస్తారని ప్రభుత్వం తొలి నుంచి చెబుతూనే వస్తోంది. అంటే రోజుకు 30 లక్షల మందికి పైబడన్న మాట. యూత్రికుల తాకిడి అధికంగా రాజమండ్రిలో అందుకు తగ్గట్టుట్రాఫిక్‌ను నియంత్రించాల్సి ఉంది. దీనిపై అర్బన్ జిల్లా పోలీసులు, రాజమండ్రియేతర ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణపై జిల్లా పోలీసులు భారీగా ఖసరత్తు చేశారు. ప్రణాళికల మీద ప్రణాళికలు రచించారు. అరుుతే వాటిలో ఒక్కటీ అమలు కాలేదు.
గోదారి గట్టు మీదా ఇష్టారాజ్యంగా రాకపోకలు
రాజమండ్రిలో పేపరుమిల్లు, ఆర్యాపురం, గోకవరం బస్టాండ్, సుబ్రహ్మణ్యమైదానం, శ్యామలాసెంటరు, కోటగుమ్మం, కోటిపల్లిబస్టాండ్ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నిషేధించి, కేవలం అంబులెన్స్‌లు, పారిశుద్ధ్య వాహనాలు, వృద్ధులను తరలించే వాహనాలు, అత్యవసర ప్రభుత్వ వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తామన్నారు. ఈ రూట్లలో ఇప్పుడు ఆటోలు సైతం యథావిధిగా తిరుగుతున్నాయి. రద్దీ ఎక్కువగా ఉన్న శని, ఆదివారాల్లో కూడా వాహనాలు ఆగలేదు. గౌతమ ఘాట్, వీఐపీఘాట్, వైగ్రాం ఘాట్ ఉన్న గోదావరి బండ్ మీద ద్విచక్రవాహనాలు, ప్రైవేట్ కార్లు పెద్ద ఎత్తున సంచరిస్తున్నా అడ్డుకునేవారే లేరు.
అనర్హులకూ వీఐపీ పాస్‌లు
ట్రాఫిక్ రద్దీని బట్టి మూడంచెల విధానం అమలు చేస్తామన్నారు. రద్దీ ఉన్నప్పుడు ప్రైవేట్ కార్లను మాత్రం ఇతర రోడ్లకు మళ్లిస్తున్న అధికారులు మిగిలిన వాహనాల రాకపోకలను పెద్దగా పట్టించుకోవడం లేదు. అనర్హులు కూడా వీవీఐపీ పాస్‌లు, వీఐపీపాస్‌లు సంపాదించి వాహనాలకు తగిలించుకుని నిబంధనలు బేఖాతరు చేస్తున్నా పోలీసులు చేష్టలుడిగి చూస్తున్నారు.
ప్రభుత్వాధికారులు, రాజకీయ నాయకుల అనుచరులు సైతం తమ బంధువులను ఘాట్‌ల వద్దకు నేరుగా కార్ల మీద తరలిస్తున్నా నియంత్రణ లేదు.
వివిధ జిల్లాల నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సులను రాజమండ్రిలోకి రాకుండా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాల్లో ఉంచుతామని చెప్పారు. కొంతమూరు రోడ్డు, కాతేరు రోడ్డు, లాలాచెరువు, మోరంపూడి జంక్షన్, వేమగిరి వంతెన సమీపంలో బస్సులు నిలపాలని భావించారు. అయితే వీటిని నేరుగా బస్టాండ్‌కు తీసుకువస్తుండడం వల్ల కూడా మోరంపూడి నుంచి ఆర్టీసీ బస్టాండ్‌కు బస్సు వచ్చేందుకు రెండు గంటలకు పైగా సమయం పడుతోంది.
ఏదీ నో వెహికిల్ జోన్
రాజమండ్రిలో నో వెహికిల్ జోన్ ఏర్పాటు చేస్తామన్నారు. ధవళేశ్వరం రామపాదాలరేవు దాటిన తరువాత నుంచి కోటిపల్లి బస్టాండ్, వీటీ జూనియర్ కాలేజీ రోడ్డు మీదుగా తాడితోట జంక్షన్ నుంచి బైపాస్ రోడ్డు మీదుగా, పేపరు మిల్లు వరకు రూటులో వాహనాలను అనుమతి లేదని చెప్పారు. కేవలం ఆర్టీసీ ఉచిత బస్సులు మాత్రమే తిప్పుతామన్నారు. ఈ రోడ్డు మీద ఇప్పుడు అన్ని వాహనాలూ తిరుగుతున్నాయి. ఈ కారణంగా శ్యామలా సెంటరు, తాడితోట జంక్షన్, బైపాస్ రోడ్డు జంక్షన్లలో తరచూ ట్రాఫిక్ జామ్ అవుతోంది.
హైవే మీద ట్రాఫిక్ నియంత్రణకు విజయవాడ నుంచి విశాఖ వెళ్లే వాహనాలను జొన్నాడ సెంటరు నుంచి మండపేట, రామచంద్రపురం, కాకినాడ మీదుగా కత్తిపూడి మళ్లిస్తామని, విశాఖ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను దివాన్‌చెరువు నుంచి నాలుగు లేన్ల వంతెన నుంచి మళ్లిస్తామన్నారు. ఇప్పుడు దీనిని ఎత్తివేయడం, విజయవాడ నుంచి వస్తున్న వాహనాలను వేమగిరి వరకు వస్తుండడంతో ఆయా ప్రాంతాల్లో గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయి ప్రయాణికులు పడరానిపాట్లు పడుతున్నారు.