ప్రమాదాన్ని తప్పించిన అంకయ్య, మల్లికార్జున్
చిత్తూరు, రేణిగుంట: కళ్లెదుటే ఏంజరిగినా స్పందించని చాలా మందికి మల్లికార్జున్, అంకయ్యలు కచ్చితంగా స్ఫూర్తినిస్తారు. వారు తీసుకున్న చొరవ వందలాది మంది ప్రాణాలను కాపాడింది. రైలుకు పట్టాలు తప్పే ప్రమాదం తప్పించారు. రేణిగుంట మండలంలోని వెదుళ్లచెరువుకు చెందిన చెంగయ్య కుమారుడు మల్లికార్జున్ సాదాసీదా సన్నకారు రైతు. వెదుళ్లచెరువుకు చెందిన ఇతను సోమవారం తెల్లవారుజామున పొలంలో నాట్ల కోసం కూలీలను పిలిచేందుకు ఎస్టీ కాలనీ వైపు వెళుతున్నాడు. రైలు పట్టాలను దాటే సమయంలో ఎడమ వైపునున్న ఓ పట్టా రెండుగా విరిగిపోయి ఉండటాన్ని గుర్తించాడు.
అక్కడి కాలనీకి చెందిన అంకయ్యకు వెంటనే చెప్పాడు. అదే సమయంలో తిరుపతి నుంచి పద్మావతి ఎక్స్‌ప్రెస్ కూతపెడుతూ వస్తోంది. రైలును ఎలాగైనా ఆపి ప్రమాదాన్ని తప్పించాలని వారిద్దరూ భావించారు. అంకయ్య వెంటనే తన ఎర్రటి టీషర్టును విప్పి చేతితో ఊపుతూ మల్లికార్జున్ తో కలిసి రైలుకు ఎదురుగా పరుగులు పెట్టారు. డ్రైవర్ విరిగిన పట్టాలకు కొద్ది దూరంలో రైలును ఆపేశాడు. తర్వాత సిబ్బంది అర్ధగంట పాటు శ్రమించి తాత్కాలిక మరమ్మతులను చేసి రైలును సురక్షితంగా అక్కడి నుంచి పంపారు. స్థానికులు సంఘటన స్థలానికి చేరుకుని వారిద్దరినీ ఎంతగానో కొనియాడారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన వారికి రైల్వే ఉన్నతాధికారులు సేవా పురస్కారాన్ని అందించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment