పశ్చిమగోదావరి: బోగీ విరిగి పడి పోవటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు సమీపంలో శనివారం ఉదయం జరిగింది. విజయవాడ నుంచి విశాఖ వెళ్లే స్పెషల్ ప్యాసింజర్ రైలు శనివారం ఉదయం 5 గంటల సమయంలో ఉంగుటూరు సమీపంలో రాగా ఒక బోగీ నిట్టనిలువుగా చీలి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో బోగీ విరిగిపోవటంతో ప్రయాణికులు ఆందోళన చెందారు.
అధికారులు వెంటనే ఏర్పాట్లు చేయకపోవటంతో కొందరు బస్సుల్లో వెళ్లిపోయారు. అయితే, అధికారులు కొద్దిసేపటి తర్వాత వచ్చిన సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లో మిగిలిన ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరేలా ఏర్పాట్లు చేశారు. విరిగిపడిన బోగీని పక్కకు తొలిగించి ఉదయం 7.30 గంటలకు రైళ్ల రాకపోకలకు వీలు కల్పించారు. ఈ ఘటన కారణంగా ఆ మార్గంలో రెండు గంటలపాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.