‘ప్రీమియం’.. అమ్మో ప్రియం! | trains Full i to Sankranti | Sakshi
Sakshi News home page

‘ప్రీమియం’.. అమ్మో ప్రియం!

Published Fri, Jan 2 2015 2:08 AM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM

‘ప్రీమియం’.. అమ్మో ప్రియం! - Sakshi

‘ప్రీమియం’.. అమ్మో ప్రియం!

సంక్రాంతికి రైళ్లన్నీ ఫుల్
ప్రీమియం తత్కాల్ పేరిట రెండు,
మూడు రెట్లు ఎక్కువగా చార్జీ వసూలు
గుట్టుచప్పుడు కాకుండా ఏర్పాటు
అడ్డగోలుగా దోపిడీ
లబోదిబోమంటున్న ప్రయాణికులు

 
విజయవాడ : ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సమయంలో రైళ్లలో అత్యంత రద్దీ ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల్లో సాఫ్ట్‌వేర్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు పండక్కి ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపుతారు. నగరం మీదగా కోస్తా జిల్లాలకు వచ్చే రైళ్లన్నింటిలో ఇప్పటికే అన్ని క్లాసుల టికెట్లు అయిపోయాయి. ముఖ్యంగా త్రీ టైర్ ఏసీ, స్లీపర్ క్లాసుల టికెట్లకైతే  చాంతాండంత వెయిటింగ్ లిస్టులు దర్శనమిస్తున్నాయి.  తప్పనిసరిగా ప్రయాణం చేయాలనుకునే వారి అవసరాన్ని గుర్తించిన రైల్వే ‘ప్రీమియం’ పేరుతో దోచుకుంటోంది. మూడు నెలల క్రితం నరేంద్ర మోది సర్కార్ ప్రీమియం రైళ్లు, ప్రీమియం తత్కాల్ టికెట్లను గుట్టుచప్పుడు కాకుండా ప్రవేశపెట్టింది. ఈ ప్రీమియం తత్కాల్ టికెట్లు విమానాలు, బస్సులతో పోటీ పడి ఉంటున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. ప్రీమియం రైళ్లు, ప్రీమియం తత్కాల్ టికెట్లను రైల్వేశాఖ నేరుగా కాకుండా ఐఆర్‌సీటీసీ ద్వారా విక్రయిస్తోంది. వీటిని రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో కొనుగోలు చేయడానికి వీలులేదు.

కొన్ని ముఖ్యమైన రైళ్లలో  ప్రీమియం తత్కాల్

చెన్నై సర్కార్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు నుంచి వచ్చే శేషాద్రి ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్ వెళ్లే గౌతమి, గోదావరి, హౌరా-సికింద్రాబాద్ ఫలక్‌నుమా  తదితర కొన్ని ముఖ్యమైన రైళ్లలో ఈ ప్రీమియం తత్కాల్ టికెట్లను ప్రవేశపెట్టారు. ప్రయాణికుల డిమాండ్ ఎక్కువగా ఉన్న రైళ్లకే ఐఆర్‌సీటీసీ ప్రీమియం తత్కాల్ ఏర్పాటు చేసినట్లు రైల్వే కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు.
 
చుక్కల్ని అంటుతున్న ప్రీమియం రేట్లు!


 విజయవాడ నుంచి తిరుపతికి శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్ క్లాస్ టిక్కెట్ రూ.235. తాత్కాల్‌లో రూ.375 కాగా, ప్రీమియం టికెట్ సుమారు రూ.1,000 వరకు పలుకుతోంది. కాకినాడ నుంచి సికింద్రాబాద్ వెళ్లే గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో కాకినాడ నుంచి సికింద్రాబాద్‌కు స్లీపర్ క్లాస్‌లో రూ.340, తత్కాల్ 430 కాగా, ప్రీమియం తత్కాల్ పేరుతో రూ.1,500 వరకు చార్జీ వసూలు చేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. రైల్వే ప్రీమియం రేట్లు పైపైకి వెళ్లి చుక్కల్ని తాకుతున్నాయని లబోదిబోమంటున్నారు.
 
20 శాతం సీట్లు ప్రీమియం తత్కాల్‌కే
 
గతంలో ప్రతి రైలులోనూ 40 శాతం బెర్త్‌లను తత్కాల్ కోటా కింద కేటాయించేవారు. రైలు బయలుదేరడానికి 24 గంటల ముందు ఈ టికెట్లు కేటాయిస్తారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన రైళ్లలో ఈ తత్కాల్ టికెట్లలోనే 20 శాతం టికెట్లను ప్రీమియం తత్కాల్‌గా మార్చింది. తత్కాల్ టికెట్లు 20 శాతం పూర్తవగానే ప్రీమియం టికెట్ల విక్రయాలు ప్రారంభమవుతాయని, అయితే ఈ టికెట్లు రైల్వే కౌంటర్లలో కాకుండా ఆన్‌లైన్‌లో మాత్రమే లభిస్తాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. ప్రీమియం తత్కాల్ టికెట్  రేటు ప్రతి నిమిషానికి మారిపోతూ ఉంటుందని, డిమాండ్‌ను బట్టి అప్పటికప్పుడు కంప్యూటర్‌లో వచ్చే రేటు ఆధారంగా ప్రయాణికుడి నుంచి చార్జీ వసూలు చేస్తారు. ముందుగా రేటు ఏ విధంగా నిర్ణ యిస్తారో తమకు తెలియదని స్థానిక రైల్వే అధికారులు చెబుతున్నారు. ఒకసారి ప్రీమియం తత్కాల్ టికెట్ కొనుగోలు చేసిన తర్వాత దాన్ని తిరిగి రద్దు చేసుకునే అవకాశం లేదు.
 
ప్రయాణికుల గగ్గోలు...


 విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబయికి నేరుగా తగినన్ని రైళ్లు లేవు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లలోనే కోటా తీసుకోవాల్సి వస్తోంది. ఈ సీట్లలోనూ 40 శాతం తత్కాల్‌కే కేటాయిస్తున్నారు. అందులో 20 శాతం ప్రీమియం పేరుతో వేలకు వేలు దోచుకోవడంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. కొన్ని ముఖ్యమైన రైళ్లలో సాధారణ టికెట్లు రెండు నెలలు ముందుగానే అయిపోతున్నాయని, ప్రీమియం తత్కాల్, తత్కాల్ టికెట్ల పేరుతో వందల బెర్త్‌లు ఖాళీగా ఉన్నట్లు చూపిస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. తత్కాల్, ప్రీమియం తత్కాల్ టికెట్లు ఎవరూ కొనుగోలు చేయకపోతే అప్పుడు ఆ టికెట్లను సాధారణ ప్రయాణికులకు చివరి నిమిషంలో రైల్వే అధికారులు కేటాయిస్తారు. కాగా, ప్రీమియం తత్కాల్ టికెట్‌పై పూర్తి అవగాహన లేక, ఎక్కువ చార్జీలు భరించలేక ప్రయాణికులు దీనిపై ఆసక్తిచూపడం లేదని తెలిసింది. ప్రీమియం తత్కాల్‌లో సాధారణ రోజుల్లో 50 శాతం సీట్లు, వారాంతం, పండుగ రోజుల్లో 80 శాతంసీట్లు భర్తీ అవుతున్నాయని తెలిసింది.
 
ప్రీమియం రైళ్లు

 కొన్ని ముఖ్యమైన రైళ్లకు వెయిటింగ్ లిస్టు భారీగా ఉంటోంది. దీన్ని గమనిస్తున్న ఐఆర్‌సీటీసీ అధికారులు ఆ రూట్‌లో ప్రీమియం రైలును నడుపుతున్నారు. రైలు నడుపుతున్నట్లు కేవలం 15 రోజులు ముందు ఆన్‌లైన్ పెడుతున్నారు.ఈ రైలు చార్జీలను కూడా రైల్వే శాఖ నిర్ణయించినట్లు కాకుండా ఐఆర్‌సీటీసీ అధికారులే నిర్ణయిస్తారు. టికెట్లు కూడా ఆన్‌లైన్‌లోనే విక్రయిస్తారని, వాటి వివరాలు తమకు తెలియడం లేదని రైల్వే అధికారులు చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement